ఉత్తరప్రదేశ్‌‌కు మునుపటిలాగ ప్రాధాన్యత ఉంటుందా?

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌‌లో 80 పార్లమెంటు నియోజకవర్గాలకుగానూ 33 ఎంపీ స్థానాలను మాత్రమే బీజేపీ గెలుచుకుంది. ఈ ఫలితాలు కేంద్రంలో అధికారంలో ఉన్న  బీజేపీకి షాక్​ ఇచ్చాయి. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇంతమంది ఎంపీలను ఎందుకు కోల్పోయమనేదానిపై బీజేపీ సరైన సమాధానం కనుక్కోలేకపోతోంది. కమలం పార్టీ హైకమాండ్​ దగ్గర ఒక్క సమాధానం కూడా లేదు. ఒక పార్టీ  విజయంలో ప్రజలు చాలా కారణాలను సులభంగా కనుగొంటారు. కానీ, ఓటమిని నిర్ధారించడం కష్టం.  ప్రతి ఓటమి భిన్నంగా ఉంటుంది. 1869లో రష్యన్ రచయిత  లియో టాల్‌‌స్టాయ్ రాసిన  ‘వార్ అండ్ పీస్’  ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న పుస్తకాలలో ఒకటి.  టాల్‌‌స్టాయ్ రాసిన వెంటాడే వాక్యం  ‘అన్ని సంతోషకరమైన కుటుంబాలు ఒకేలా ఉంటాయి. మరోవైపు సంతోషంగా లేని కుటుంబాలకు వారి సంతోషలేమికి వివిధ కారణాలు ఉంటాయి’.

అదేవిధంగా అన్ని పరాజయాలు భిన్నంగా ఉంటాయి. మీరు ఖచ్చితమైన కారణాలను కనుగొనలేరు. భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్.  యూపీలో ఒక పార్టీ మెజార్టీ స్థానాలు గెలిస్తేనే  ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమని రాజకీయ నాయకులు నమ్ముతారు. 1947 నుంచి 1977 వరకు, ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీలుగా ఉన్న నెహ్రూ, శాస్త్రి, ఇందిరా గాంధీ, చరణ్ సింగ్ వంటి భారతదేశ ప్రతి ప్రధానమంత్రి ఉత్తరప్రదేశ్‌‌కు చెందినవారే. అదేవిధంగా  ప్రధాని పదవిని అధిష్టించినవారిలో  విశ్వనాథ్​ ప్రతాప్​సింగ్,  చంద్రశేఖర్,  రాజీవ్ గాంధీ  ఇప్పుడు నరేంద మోదీ ఉత్తరప్రదేశ్​ ఎంపీలుగా ఉండి ప్రధాని పదవిని అధిష్టించినవారిలో ఉన్నారు. 

యూపీ నుంచి ఏడుగురు ప్రధానులు..

1947 నుంచి ఉత్తరప్రదేశ్ కు చెందిన ఏడుగురు దేశానికి ప్రధానమంత్రులుగా సేవలందించారు. కానీ, వాస్తవం ఏమిటంటే ఉత్తరప్రదేశ్‌‌కు వెలుపల ఎంపీలు ప్రధానమంత్రులుగా పాలక పగ్గాలు చేపట్టారు.  వారిలో  మొరార్జీ దేశాయ్,  దేవెగౌడ, ఐ.కె. గుజ్రాల్,  పీవీ నరసింహారావు,  మన్మోహన్ సింగ్  ప్రధానమంత్రులుగా ఎన్నో కీలక మైలురాళ్లను అధిగమించారు. పార్లమెంటు ఎన్నికల్లో గెలవాలంటే ఒక రాజకీయ పార్టీ ఉత్తరప్రదేశ్‌‌లో రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిగి ఉండాలనేది కూడా అపోహ మాత్రమే. 1977లో కాంగ్రెస్ పార్టీ  ఉత్తరప్రదేశ్​లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి అధికారంలో  ఉన్నప్పుడు ఇందిరా గాంధీ ప్రధాని పదవిని కోల్పోయారు.

1979లో ఉత్తరప్రదేశ్‌‌లో జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మొరార్జీ దేశాయ్ తన పదవిని కోల్పోయారు.  పీవీ నరసింహారావు ప్రధానమంత్రి అయినప్పుడు, ఉత్తరప్రదేశ్​లో కాంగ్రెసేతర ప్రభుత్వం ఉంది. అదేవిధంగా 2004, 2009లో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయినప్పుడు, ఇతర పార్టీలు ఉత్తరప్రదేశ్‌‌ను పాలించాయి. మరీ ముఖ్యంగా 2014లో నరేంద్ర మోదీ ప్రధాని అయినప్పుడు యూపీలో బీజేపీ అధికారంలో లేదు. ప్రధానమంత్రి కావడానికి ఉత్తరప్రదేశ్‌‌లో రాష్ట్ర ప్రభుత్వం అవసరం లేదని దీని అర్థం.

ఇప్పుడు ఉత్తరప్రదేశ్​కి ప్రాధాన్యం ఉందా?

బిహార్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, బెంగాల్,  ఒడిశా,  ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ, బెంగాల్, మహారాష్ట్ర, అస్సాం, జార్ఖండ్‌‌లలో ప్రాంతీయ పార్టీలు కీలకంగా మారాయి.  ఆయా రాష్ర్టాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు ఉత్తరప్రదేశ్ వెలుపల కొత్తగా పవర్​ సెంటర్స్​గా ఏర్పడ్డాయి.  ఇంతకుముందు ఉత్తర భారతదేశానికి పరిమితమైన బీజేపీ ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్ర,  ఒడిశా,  అస్సాం,  బెంగాల్‌‌, కేరళ, తమిళనాడులలో    ప్రాబల్యం పెంచుకుంటోంది.  ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పార్టీల బలోపేతంవల్ల  ఉత్తరప్రదేశ్​కు తక్కువ ప్రాముఖ్యతనిస్తున్నట్లు కనిపిస్తోంది. 

చిన్న ప్రాంతీయ పార్టీలే కీలకం

ప్రాంతీయ పార్టీలు సిద్ధాంతాల ప్రాతిపదికన పనిచేయవు. ఒకప్పుడు డీఎంకే, శివసేన (ఠాక్రే), మమతా బెనర్జీ,  నవీన్ పట్నాయక్ బీజేపీకి మిత్రపక్షాలు. ఇప్పుడు బీజేపీకి వాళ్లు ప్రత్యర్థులు. భవిష్యత్తులో  వారు శత్రువులుగా ఉంటారా లేక మిత్రులుగా ఉంటారో ఏ కూటమివైపు మొగ్గుచూపుతారనేది కచ్చితంగా  ఎవరూ చెప్పలేరు. యూపీలో ఒక పార్టీ మొత్తం ఎంపీ స్థానాలను కైవసం చేసుకున్నా, కొన్ని ప్రాంతీయ పార్టీలు మద్దతిస్తే తప్ప ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది.

భారతదేశంలో ఇప్పుడు చాలా చిన్న ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్ పవార్),  జేడీఎస్​, తమిళనాడు, కేరళలో వివిధ చిన్న పార్టీలు బీజేపీకి మిత్రపక్షాలుగా ఉన్నాయి.  తెలుగుదేశం, జనసేన పార్టీలు కూడా ఎన్డీఏ కూటమిలో కొనసాగుతున్నాయి.  ఈ పార్టీలు బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాయి.

యూపీ వెలుపల నుంచి వచ్చిన ప్రధానులు

1991లో  పీవీ నరసింహారావు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, 85 మంది ఎంపీల్లో ఉత్తరప్రదేశ్‌‌ నుంచి కాంగ్రెస్‌‌కు కేవలం 5 మంది ఎంపీలు మాత్రమే ఉన్నారు. అదేవిధంగా 2004లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా కాంగ్రెస్‌‌కు ఉత్తరప్రదేశ్‌‌లో కేవలం 9 మంది ఎంపీలు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఉత్తరప్రదేశ్ ఎంపీలలో కేవలం 33 మంది మాత్రమే బీజేపీ ఎంపీలు ఉన్నారు. సమాజ్​వాది పార్టీ అత్యధికంగా 37 ఎంపీలను కలిగి ఉంది. అధికార బీజేపీ కంటే ఎక్కువసంఖ్యలో ఎంపీలు ఆ పార్టీకి ఉన్నా ప్రతిపక్ష ఇండియా కూటమిలో ఉంది.

అంటే..కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు యూపీలో రాజకీయ పార్టీ భారీ విజయం సాధించాల్సిన అవసరం లేదని స్పష్టమైంది. కాగా, ఉత్తరప్రదేశ్‌‌లోని కొంతమంది ఎంపీలతోనే భవిష్యత్తులోనూ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదా? అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నది.  గత రికార్డులు,  ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే,  ఉత్తరప్రదేశ్​లో బీజేపీ అధికారంలో లేకపోయినా 2029లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు. కమలం పార్టీకి ఆ అవకాశం ఉంది.  ఎందుకంటే దేశంలో ఇప్పుడు అన్ని చోట్లా ప్రాంతీయ పార్టీలే బలంగా ఉన్నాయి.

బీజేపీ కొత్త రాష్ట్రాలను వెతకాలి

యూపీలో బీజేపీ తమ ఎంపీల సంఖ్య తగ్గటానికి కారణాలు నిశితంగా పరిశీలించుకోవాలి. అయితే బీజేపీ కేవలం యూపీపైనే ఆధారపడకూడదు. బీజేపీ గెలవాలంటే కొత్త రాష్ట్రాల కోసం వెతకాలి. చాలా మంది యూపీ నాయకులు యూపీ ప్రాముఖ్యతను పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అది అబద్ధం. 2000 సంవత్సరాల క్రితం రోమ్ ఐరోపాలో రోమన్ సామ్రాజ్యానికి హెడ్​గా ఉన్నప్పుడు ‘అన్ని రహదారులు రోమ్‌‌కి దారితీస్తాయి’ అని చెప్పబడింది. దీని అర్థం అధికారంలో ఉన్నందున  ప్రతి ఒక్కరూ రోమ్‌‌కు వెళ్లవలసి వచ్చింది.

అయితే ఈ రోజుల్లో లక్నోకు ఎవరు వెళ్తున్నారు? బీజేపీ గెలవాలంటే ఆర్థిక వ్యవస్థపై దృష్టి పెట్టాలి. జీడీపీపై విదేశాలతో పోల్చి గొప్పలు చెప్పుకోవడం పనికిరాదు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాలి. వ్యవసాయంపై దృష్టి పెట్టాలి.  మధ్యతరగతిని ప్రోత్సహించాలి.  బీజేపీ అధికారం సాధించడానికి ఇది  సరిపోతుంది. అయితే బీజేపీ అలా చేయగలదా? మధ్యతరగతి ఆగ్రహం నుంచి బీజేపీ మేల్కొనే సూచన కనిపించడం లేదు!

కొత్త రాష్ట్రాలపై బీజేపీ నజర్​

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కేరళలో బీజేపీ ఎదగడానికి ఇంకా గొప్ప అవకాశం ఉంది. 102 మంది ఎంపీలకు గానూ బీజేపీ కేవలం 12 మంది ఎంపీలను మాత్రమే గెలుచుకుంది. ఈ రాష్ట్రాల్లో కమలం పార్టీ బలోపేతమయ్యే అవకాశాలు ఉన్నాయి. రాజస్థాన్, మహారాష్ట్ర, బెంగాల్‌‌లో కూడా బీజేపీ మళ్లీ మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నించవచ్చు.  ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఉత్తరప్రదేశ్‌‌లో బీజేపీకి 20 మందికి మించి ఎంపీలు అవసరం లేదు.

1999 నుంచి యూపీలో బీజేపీ ఆ కనిష్ట స్థాయిని అధిగమిస్తోంది. అయితే, మనం భవిష్యత్తును అంచనా వేయలేం. కానీ, ఇంతకుముందులాగ ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఉత్తరప్రదేశ్ కీలకమా అని ప్రశ్నించవచ్చు. 2024లో  ఒడిశా, ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ బీజేపీకి ముఖ్యమైనవి. 

- డా. పెంటపాటి పుల్లారావు, పొలిటికల్​ ఎనలిస్ట్​