డిటెన్షన్​ విధానం మంచిదే కానీ..!

సమర్థ మానవ వనరుల నిర్మాణానికి విద్య అత్యంత కీలకమైనది.  అందరికీ నాణ్యమైన విద్య అందించినప్పుడే ఇది సాధ్యమౌతుంది. ఈ లక్ష్య సాధనలో విద్యాహక్కు చట్టం 2009ను తీసుకురావడం జరిగింది. 

ఈ చట్టం ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాలు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించడం జరుగుతున్నది. విద్యను సార్వత్రికం చేయడంలో ఈ చట్టం విజయవంతమైందని చెప్పవచ్చు.  

నేడు మెజారిటీ విద్యార్థులకు విద్య అందుబాటులోకి వచ్చినప్పటికీ నాణ్యతా ప్రమాణాలు లోపిస్తున్నాయని అనేక అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఈ విషయాన్ని అసర్ సర్వే,  నేషనల్ అచీవ్​మెంట్​ సర్వేలు ధ్రువీకరిస్తున్నాయి.  

ఈ క్రమంలో విద్యా నాణ్యతపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది.  ఇందులో భాగంగానే  డిటెన్షన్ విధానాన్ని  ప్రవేశపెట్టారు. 


వా స్తవంగా మొదట్లో విద్యాహక్కు చట్టం సెక్షన్ 16 ప్రకారం నో- డిటెన్షన్ విధానం ఉండేది.  ఈ సెక్షన్  రెండు కీలకమైన నిబంధనలను నిర్దేశిస్తుంది.  మొదటిది, ప్రాథమిక విద్యను పొందుతున్న ఏ పిల్లవాడిని పాఠశాల నుంచి బహిష్కరించకూడదు. 

రెండవది, ఏ తరగతిలోనూ పిల్లలను నిలుపుదల చేయకూడదు. అనగా 8వ తరగతి వరకు విద్యార్థులను నిర్బంధించకుండా పై తరగతులకు అనుమతించాలి.  పిల్లలు ప్రతి తరగతిలో ఫెయిల్ అవుతానేమో అనే భయం లేకుండా కనీస అభ్యసనస్థాయి పొందేలా చేయడం, తద్వారా డ్రాపౌట్ రేటును తగ్గించడం సెక్షన్ 16 ప్రధాన ఉద్దేశం. 

సమ్మిళిత విద్యను ప్రోత్సహించడం,  డ్రాపౌట్‌‌‌‌లను తగ్గించడం కోసం నో-డిటెన్షన్ విధానం ఒక సదుద్దేశంతో తీసుకురావడం జరిగింది. అయితే, దీని అమలుతీరు పలు విమర్శలను ఎదుర్కొంది.ఈ విధానం పిల్లల- స్నేహపూర్వక విద్యా వ్యవస్థను ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ విద్య నాణ్యత, జవాబుదారీతనంపై ప్రభావం చూపింది.

నాణ్యత లోపానికి కారణం

ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి పాటించకపోవడం, పర్యవేక్షణ లోపం, అశాస్త్రీయ బోధనా పద్ధతులు, అసమగ్రమైన మూల్యాంకన వ్యవస్థ, ఉపాధ్యాయులపై విద్యేతర అంశాల భారం పెరిగిపోవడంలాంటివే దీనికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.  

కరికులంలో సృజనాత్మకత, పరిశీలన జ్ఞానం, శాస్త్రీయత,  ప్రశ్నించేతత్వం, తర్కం లోపించడంతో విద్యార్థులు బట్టీ చదువులకే పరిమితమవుతున్నారు.  ఫలితంగా నాణ్యతా ప్రమాణాలు తీవ్రంగా పడిపోతున్నాయి. 

ప్రాథమిక, ఉన్నత పాఠశాలలోని మెజార్టీ  విద్యార్థులు చదవడం,  రాయడం, గణించడం వంటి కనీస అభ్యసన సామర్థ్యాలలో వెనకబడడమే దీనికి నిదర్శనం. ఈనేపథ్యంలో దేశంలోని బాలలందరికీ అవగాహనతో కూడిన పఠనం, ప్రాథమిక గణితం పట్ల ప్రావీణ్యాన్ని పెంపొందించే ధ్యేయంతో  ‘నిపుణ భారత్’  మిషన్ కార్యక్రమాన్ని  కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రారంభించారు. 

డిటెన్షన్​కు మొగ్గు

ప్రాథమిక విద్యపై ఇటీవల కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 5, 8 తరగతులకు 'నో డిటెన్షన్' పాలసీని రద్దు చేసింది.  దీనిప్రకారం ఈ రెండు తరగతులకు చెందిన విద్యార్థులపై తరగతులకు వెళ్లేందుకు తప్పనిసరిగా పరీక్షల్లో ఉత్తీర్ణత  సాధించాల్సి ఉంటుంది. 

 ఇప్పటివరకు పాసైనా, ఫెయిలైనా హాజరుశాతంతో విద్యాహక్కు చట్టం ప్రకారం పై తరగతులకు పంపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం విద్యార్థి ఫెయిలైతే మళ్లీ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తారు. 

పరీక్షల ఫలితాలు వెలువడే తేదీకి రెండు నెలల్లోపే మళ్ళీ పరీక్ష పెడతారు. ఒకవేళ అందులోనూ ఫెయిలైతే వారు 5, 8 తరగతులను  మళ్లీ చదవాల్సి ఉంటుంది.  ఫెయిలైన విద్యార్థుల  జాబితాను  ప్రధానోపాధ్యాయులు నిర్వహించాల్సి ఉంటుంది. 

అయితే,  ప్రాథమికోన్నత విద్య పూర్తయ్యేవరకు ఏ విద్యార్థినీ బహిష్కరించరాదని  కేంద్రం స్పష్టం చేసింది. మరోవైపు   కేంద్రం నిర్ణయించినట్లు 5, 8 తరగతుల్లో డిటెన్షన్ విధానం అమలుచేస్తే ప్రభుత్వ విద్యా సంస్థల్లో  డ్రాపౌట్లు పెరుగుతాయని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

తెలంగాణలో సందిగ్ధత

ప్రాథమిక విద్య రాష్ట్ర జాబితాలోని అంశమైనందున ఈ విషయంలో ఆయా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని దాదాపు 3 వేల కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ,  సైనిక పాఠశాలలకు ఇది వర్తిస్తుంది.  

ఇప్పటికే  ఢిల్లీ సహా 16 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలు నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేశాయి.  డిటెన్షన్ విధానం తెలంగాణలో అమలుపై సందిగ్ధత నెలకొంది. రాష్ట్రంలో ఇటీవల విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం విద్యా కమిషన్ నియమించినది. 

 ఇది విద్యావ్యవస్థలో నాణ్యత, మౌలిక సదుపాయాలపై అధ్యయనం చేస్తోంది.   ప్రస్తుతం 9వ తరగతి వరకు నో డిటెన్షన్ విధానం అమలవుతోంది. పరీక్షల్లో పాసైనా.. కాకున్నా పై తరగతులకు  పంపిస్తున్నారు.  

విద్యా నాణ్యతకు సంస్కరణలు అవసరం

ప్రస్తుతం పాఠశాల విద్యా వ్యవస్ధలో ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్ర కరికులం అమలు చేస్తుండగా,  ప్రైవేట్ పాఠశాలల్లో  వేరే  కరికులం బోధిస్తున్నారు.  ఉపాధ్యాయుల కొరత,  శిక్షణ  ఉపాధ్యాయులకు  వృత్తిపర అర్హత లేకపోవడం, విద్య నాణ్యతపై ప్రభావం చూపుతోంది.  

ఉపాధ్యాయులకు  బోధనేతర  అంశాల భారం తగ్గించాలి. కేంద్రం నూతన విద్యావిధానం 2020  తీసుకురావడం  జరిగింది.  ప్రస్తుతం పలు రాష్ట్రాలు నూతన విద్యావిధానం అమలు దిశగా ముందుకుపోతున్నాయి. 

ఈ విధానంలో  కూడా  లోపాలు  ఉన్నాయని  విద్యావేత్తలు  అభిప్రాయపడుతున్నారు.  ఈ క్రమంలో  పాఠశాల విద్యలో  కీలకమార్పులు చేయాల్సిన అవసరమైతే ఉంది. 

విద్యా నాణ్యతను  మరింత  మెరుగుపరచడానికి  నిరంతర  సమగ్ర మూల్యాంకనం, నో డిటెన్షన్ విధానంపై విద్యాహక్కు చట్టంలో చేసిన సవరణలు సమీక్షించాలి. ప్రాథమిక స్థాయిలో నో డిటెన్షన్ విధానం రద్దువలన విద్యార్థుల్లో ఒత్తిడి పెరుగుతుంది. కావున, దీనిపై పున:సమీక్షించి 8వ తరగతి నుంచి అమలుచేస్తే  బాగుంటుంది.

- సంపతి రమేష్ మహారాజ్, సోషల్ ​ఎనలిస్ట్​