టెన్త్​లో ప్రతిభకు కొలమానం ఎలా?

తెలంగాణలో టెన్త్​ పరీక్షల విధానంలో సంస్కరణలు తీసుకువస్తూ 2025– 26 విద్యా సంవత్సరం నుంచి 20 మార్కుల ఇంటర్నల్ మార్కులు విధానాన్ని ఎత్తివేశారు. ప్రతి సబ్జెక్టులో వంద మార్కులకు వార్షిక పరీక్షలు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయం సహేతుకమైనది. 2014-15 నుంచి అమలులో ఉన్న నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ ) ఆచరణలో లోపభూయిష్ఠంగా ఉంది.  సంవత్సరం పొడవునా విద్యార్థి విశ్లేషణ శక్తి, అభ్యసనా స్థాయి, అవగాహన శక్తి తదితర విషయాలను సమగ్రంగా మూల్యాంకనం చేయాలని  సీసీఈ విధానాన్ని ప్రవేశపెట్టారు.

కానీ, అమలులో ఈ ఉద్దేశాలు పూర్తిగా నెరవేరడం లేదు. 1986, 2020 జాతీయ విద్యా విధానాలు పరీక్ష పద్ధతి నమ్మకమైనదిగా,  బోధన,  అభ్యసనను  మెరుగుపరిచేలా ఉండాలని చెప్పాయి.  విద్యార్థి బట్టీ పట్టడం ద్వారా నేర్చుకోవడం,  పరీక్షల కోసం నేర్చుకోవడం కాకుండా భావనాత్మకంగా అర్థం చేసుకోవడంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని,తార్కికంగా నిర్ణయాలు తీసుకునేలా,  సృజనాత్మకంగా ఆలోచించేలా పరీక్షా విధానం ఉండాలని చెప్పాయి.

2020  జాతీయ విద్యావిధానంలో జాతీయ మూల్యాంకన కేంద్రం ఏర్పాటు,  విద్యార్థి ప్రగతిపత్రాన్ని పునఃరూపకల్పన చేయడం, ఎస్ఎస్ సీ  బోర్డులను,  టెన్త్​ పరీక్షలను సంస్కరించడం, విద్యార్థి ఇష్టాన్ని బట్టి  సబ్జెక్టులను ఎంపిక చేసుకునేలా చేయడం, కనీసం రెండు ప్రయత్నాల ద్వారా విద్యార్థి సులభంగా టెన్త్ పాస్ అయ్యేలా చేయడం వంటి సంస్కరణలు తీసుకురావాలని చెప్పారు. 2015 మార్చి నుంచి అమలులోకి వచ్చిన 20 మార్కుల ఇంటర్నల్ మార్కుల విధానంలో ఎఫ్ఏ  వన్,  టూ,  త్రీ, ఫోర్ లలో వచ్చిన 80 మార్కులను నాలుగు పరీక్షలతో  భాగించి వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటున్నారు.

ఈ 20 ఇంటర్నల్ మార్కులలో  ఏడు మార్కులు వస్తేనే విద్యార్థి పాస్ అవుతున్నాడు.  మిగిలిన 80 మార్కుల కోసం వార్షిక పరీక్షకు విద్యార్థి హాజరుకావాలి ఈ 80 మార్కులలో  28 వస్తేనే విద్యార్థి ఉత్తీర్ణుడు అవుతున్నాడు.  మొత్తంగా 35 మార్కులకు ప్రతి సబ్జెక్టులో విద్యార్థి పాస్ అవుతున్నారు. ప్రతి సబ్జెక్టులో ఎనిమిది గ్రేడ్లు ఉన్నాయి. ఏడాది పొడవునా మూల్యాంకనం చేస్తూ నాణ్యమైన విద్యార్థులు తయారయ్యేలా బోధన అభ్యసనను తీర్చిదిద్దాలనేది  సీసీఈ ఆశయం. 

బోధనపై  మరింత దృష్టిపెట్టే అవకాశం

కఠినంగా వ్యవహరిస్తే విద్యార్థులు ఫెయిల్ అవుతారు. కాబట్టి తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వస్తుంది. 20కి20 కోసం కొన్నిసార్లు టీం సభ్యులపై ఒత్తిళ్లు వస్తున్నాయి. ఈ విధానంలో ఉన్న  లోపాలను గమనిస్తే పతి పరీక్షలను వంద మార్కుల విధానంలో  నిర్వహించడమే ఉత్తమమని చెప్పవచ్చు.  మార్కులలో  ఫలితాన్ని ఇవ్వడం వల్ల బాసర ట్రిపుల్ ఐటీ సీట్లకు ఎంపిక,  ఎస్ఎస్​సీ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తున్న ఉద్యోగాల ఎంపికలలో సౌలభ్యం ఏర్పడుతుంది.  మార్కుల వల్ల పాఠశాలల మధ్య పోటీలు నివారించడానికి,  విద్యార్థులపై ఒత్తిడిని నివారించడానికి,  మొత్తం మార్కులను  గ్రేడులుగా మార్చి ఇవ్వాలి. 

540 నుంచి 600 మార్కులు వచ్చిన విద్యార్థికి ఏ వన్ గ్రేడుగా నిర్ణయించి 10 సీజీపీఏ ఇవ్వాలి.  480 నుంచి 539 మార్కులు వచ్చిన విద్యార్థులకు ఏ టు గ్రేడుగా నిర్ణయించి తొమ్మిది జీపీఏ ఇవ్వాలి. ఇలా మార్కులతోపాటు గ్రేడు ఇవ్వడం వల్ల భవిష్యత్తులో ఎలా అవసరం పడితే అలా ఉపయోగించుకోవచ్చు. తగిన సమయం మిగలడం వల్ల  ఉపాధ్యాయులు బోధనపై  మరింత దృష్టిపెట్టే అవకాశం ఉంటుంది. మార్కుల విధానం వల్ల ప్రైవేట్  విద్యా వ్యాపారుల మధ్య పోటీ పెరగడం,  విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతుందన్న వాదన ఉంది.  విద్యాప్రమాణాలు పెరగాలంటే కఠిన పాఠశాల తనిఖీ వ్యవస్థ,  వార్షిక పరీక్షలు నిర్వహణ విధానం పాఠశాల విద్యలో తక్షణ అవసరం.

ఇతర దేశాలలోనూ గ్రేడింగ్​ విధానం

దేశంలోని అనేక రాష్ట్రాలలోనూ, ఇతర దేశాలలోనూ ఈ గ్రేడింగ్​ విధానం అమలవుతున్నది.  కానీ,  నిశితంగా గమనిస్తే  ప్రభుత్వ, ప్రైవేటు,  గురుకుల పాఠశాలలు ఉండే  మనరాష్ట్రంలో విద్యార్థుల మధ్య ‘స్థాయి భేదాలు’ ఉన్నాయి.  సమకాలీన  అంశాలపై  ప్రతిస్పందనలు రాయడం,  ప్రాజెక్టు పనులు, పుస్తక సమీక్ష, ల్యాబ్ పని తదితర అంశాలపై తరగతిలో కొద్దిమంది విద్యార్థులే సొంతంగా చేస్తున్నారు.  ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద,  వెనుకబడిన తరగతుల విద్యార్థులకు  గ్రంథాలయాలు, దినపత్రికలు వంటి సదుపాయాలు లేకపోవడం వల్ల సమాచార సేకరణకు ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థుల విలువైన సమయం రాతకే సరిపోతోంది. ఉపాధ్యాయులకు ఎఫ్ఎల నిర్వహణలో సమయం సరిపోవడం లేదు.

విద్యార్థుల ప్రతిస్పందనలు,  సమీక్షలు,  ప్రాజెక్టు పనులు తరగతి గదిలో వ్యక్తిగతంగా ప్రతి విద్యార్థి ప్రదర్శించేలా చేస్తూ టీచర్ పరిశీలించిన అంశాలకు మార్కులు వేయాలి.  చిన్నతరగతి గదికి ఈ విధానం ఓకే అయినా 30 మందికిపైగా ఉండే క్లాస్ రూంలో  ప్రతి  విద్యార్థిని మూల్యాంకనం చేసి గ్రేడింగ్ ఇవ్వాలంటే ఎక్కువ సమయం పడుతుంది. అందువల్ల సిలబస్ ఒత్తిడి వల్ల టీచర్లు విద్యార్థి ప్రదర్శనలు వివరణలు లేకుండానే మార్కులు వేస్తున్నారు. ఇక ప్రతి క్లాసులో 30శాతానికి పైగా విద్యార్థులు సంవత్సరం చివరలో ఎఫ్ఏ అంశాలు చేయకుండా  లేదా ఎక్స్​టర్నల్​ టీమ్స్ వచ్చినప్పుడు గైర్హాజరు కావడం  వల్ల సబ్జెక్టు టీచర్లు, ప్రధానోపాధ్యాయులు ఒత్తిడికి గురవుతున్నారు. 

- తండ పర్భాకర్ గౌడ్,
సోషల్ ఎనలిస్ట్