చర్చలు వీటిపైనే! : CMల భేటీలో తెలంగాణ వాటాలను సాధించేనా?

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్​రెడ్డి మధ్య పెండింగ్‌‌‌‌లో ఉన్న విభజన అంశాల పరిష్కారానికి  ఈరోజు  సంయుక్త సమావేశం జరుగుతుంది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం.  అయినప్పటికీ, ఏ మేరకు తెలంగాణ ప్రయోజనాలను చంద్రబాబు అంగీకరించగలడని, ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్​ ఏమేరకు తెలంగాణ  ప్రయోజనాలను కాపాడగలడని తెలంగాణ ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. తెలంగాణ ప్రయోజనాలను దృఢంగా కాపాడవలసిన గురుతర బాధ్యత తెలంగాణ సీఎం రేవంత్​రెడ్డిపై ఉన్నది. 

ఆ మేరకు తెలంగాణ ప్రజలు  సీఎం రేవంత్‌‌‌‌పై పూర్తి విశ్వాసంతో ఉన్నారు.  ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య  కృష్ణా- గోదావరి జలాల పంపకంలో పరిష్కారం అనేది అత్యంత కీలక అంశం. ఈ విషయంలో  తెలంగాణ ప్రజల్లో అనేక భయాందోళనలు ఉన్నాయి. ఎందుకనగా  చంద్రబాబు నాయుడు సూపర్‌‌‌‌ సీనియర్‌‌‌‌ రాజకీయవేత్త, అపర చాణక్యుడు అని అందరికీ తెలిసిన విషయమే. వీరిరువురి సమావేశం ఒక చరిత్రాత్మకం కాగలదు.  తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఆత్మబలిదానాల పునాది చరిత్ర ఎన్నటికీ మరిచిపోలేనిది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమ క్రమం పునరావలోకనం చేసుకునే కంటే ముందు తెలంగాణ సమగ్రాభివృద్ధిపై దృష్టి సారించి ఉద్యమ లక్ష్యాలు నీళ్లు,  నిధులు, నియామకాలు సాధించుటకు కృషి చేయడం అత్యంత ఆవశ్యకం.


తెలంగాణ ఏర్పడిన 10 సంవత్సరాలలో  కేసీఆర్‌‌‌‌. అసమర్థ పాలన, మొండి వైఖరి, కేంద్ర ప్రభుత్వంతో విరోధం,  ఆంధ్రప్రదేశ్‌‌‌‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సఖ్యత లేకపోవడం, అనేక కారణాల వలన ఉమ్మడి ఆస్తులు, అప్పుల పంపకం ఇప్పటివరకు జరగలేదు. తేది 2-–6-–2024లోగానే  అన్నీ విభజన జరిగిపోవలసింది.  ఫలితంగా ఈరోజున  రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సంయుక్త సమావేశం జరగాల్సివచ్చింది.

దక్షిణ తెలంగాణ పరిస్థితి 

ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న ఈ తొమ్మిదేండ్లలో కృష్ణా జలాలపై ఆంధ్రా జలదోపిడీ ఎక్కువైనది.  తెలంగాణ తెచ్చుకున్న ఆశయం విఫలమైనది. ఈ తొమ్మిదేండ్లలో మన తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసినందున, కృష్ణా జలాలు వినియోగించుకోవడంలో విఫలమైనాం. కృష్ణా జలాల్లో పరీవాహక ప్రాంతం ప్రకారం తెలంగాణ నీటి వాటా 69% రావాలి.  కానీ, తెలంగాణకు కేటాయింపు 37% నీళ్ళు అనగా 299 టి.ఎం.సి.లు మాత్రమే  కేటాయించడం జరిగినది. అదే ఆంధ్రా పరీవాహక ప్రాంతం ప్రకారం నీటి వాటా 31%,  కానీ వారికి కేటాయింపు జరిగినది 63%  అనగా 512 టి.ఎం.సి.   ఈ వివక్షతను నివారించుకొనుటకు తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ, ఈ పదేండ్లలో  వివక్షత తగ్గే బదులు వివక్షత పెరిగినది. 

ఉన్న నీటి కేటాయింపునే వాడలేదు

2014  ముందు అనేక ఏండ్లుగా తెలంగాణ కృష్ణా జలాల వినియోగ సామర్థ్యం కేటాయింపు కంటే తక్కువగా ఉండేది. అనగా ఏ సంవత్సరం కూడా కేటాయించిన 299 టి.ఎం.సి.ల నికర జలాలు దాటి వినియోగ సామర్థ్యం జరగలేదు. తెలంగాణ ఏర్పడిన, ఈ పదేండ్ల నుండి కూడా ఇదే  పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతున్నందుకు తెలంగాణ అమరవీరుల ఆత్మ క్షోభిస్తున్నది. గత ఏడాది తెలంగాణ నీటి వినియోగం మొత్తం 270 టి.ఎం.సి.లు అనగా 299 టి.ఎం.సి.లు దాటలేదు. అదే ఆంధ్రా నీటి వినియోగం 647 టి.ఎం.సి.లు అనగా 512 టి.ఎం.సి.లు దాటి అదనంగా 135 టి.ఎం.సి.ల నీళ్లు వినియోగం ఎక్కువ చేసుకున్నారు. ఈ పదేండ్లలో తెలంగాణ ప్రభుత్వం వివక్షతో  దక్షిణ తెలంగాణలో కృష్ణా జలాల వినియోగ సామర్థ్యం పెంచుటకు ప్రయత్నించలేదు. 

దక్షిణ తెలంగాణ వినియోగ సామర్థ్యం 

పెంచుకోలేని అసమర్ధత ఈ పదేండ్లలో తెలంగాణ పాలకుల నిర్లక్ష్యం, తగిన ప్రణాళికలు తయారుచేసి అమలు చేయకపోవడం. కేటాయించిన నికర జలాలు 299 టి.ఎం.సి.లను కూడా పూర్తి స్థాయిలో వినియోగించడానికి ఈ తొమ్మిదేండ్లలో తగిన ప్రణాళికలు  ప్రభుత్వం చేయకపోవడం.  తెలంగాణ రాకముందు చేపట్టిన మూడు  ప్రాజెక్టులు.  కల్వకుర్తి -  పూర్తి స్థాయిలో వినియోగించుటకు తగిన ప్రణాళికలు చేయని అసమర్థత. తెలంగాణ వచ్చిన తరువాత  120 టి.ఎం.సి.ల అదనపు జలాల వినియోగంపై  రెండు ప్రాజెక్టులు చేపట్టినప్పటికి తగిన ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేయలేని గత పాలకుడి అసమర్థ పాలనను ఏమందాం? 

మూడు జిల్లాల్లో  ఒక్క ప్రాజెక్ట్​ కూడా పూర్తికాలేదు

నాగార్జున సాగర్‌‌‌‌, జూరాల, శ్రీశైలం, ఎలిమినేటి ప్రాజెక్టు, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమ, కోయిలసాగర్‌‌‌‌  ప్రాజెక్టుల ద్వారా సాగు జరుగుచున్నది. కానీ, తెలంగాణ వచ్చిన తరువాత చేపట్టిన ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు.  కొత్త సాగు లేదు. పైగా తెలంగాణ పాలకుల అసమర్థ పాలన కారణంగా కృష్ణా జలాలలో మన నీటి వినియోగ సామర్థ్యం పెంచుకోనందున మనం ఆంధ్రాతో పోటీపడే పరిస్థితి లేదు. 

నీటి దోపిడీ చేస్తున్న ఏపీ

సమైక్య పాలన కాలంలో ఆంధ్రా  పోతిరెడ్డిపాడు ద్వారా, ఇతర ప్రాజెక్టుల ద్వారా వారికి కేటాయించిన జలాలను మించి బేసిన్‌‌‌‌ ఆవల ఉన్న రాయలసీమకు అక్రమంగా తరలించుకుపోయే ప్రణాళికలు అమలు చేసుకున్నారు. రాయలసీమలో 364 టి.ఎం.సి.ల స్టోరేజితో అనేక రిజర్వాయర్‌‌‌‌లను నిర్మించుకున్నారు. ప్రస్తుతం పోతిరెడ్డిపాడు విస్తరణతో అదనంగా రాయలసీమ లిఫ్ట్‌‌‌‌ ద్వారా రోజుకు 3.0 టి.ఎం.సి.లను మొత్తం రోజుకు 11.00 టి.ఎం.సి.ల కృష్ణా జలాలను పోతిరెడ్డిపాడు ద్వారా తరలించుకునే ప్రణాళికలను అమలు చేస్తున్నారు. కానీ, ఇక్కడ మన తెలంగాణ ఒడ్డు నుండి అన్ని ప్రాజెక్టులు కలిపి కూడా రోజుకు ఒక్క టి.ఎం.సి  మించి నీటిని తరలించే ఏర్పాట్లు ఈ పదేండ్లలో చేయలేదు. 

ఎంత వెనకబడి ఉన్నామో ఈ తొమ్మిదేండ్ల పాలనకు నిదర్శనం. ఒక్క పోతిరెడ్డి పాడు నుండి ఒక్క గేటు ద్వారా తరలించే నీళ్లు తెలంగాణలోని కల్వకుర్తి ప్రాజెక్టు ద్వారా మొత్తం తరలించే నీళ్లకు సమానం. అంటే మనం ఎంత వెనకబడి ఉన్నామో ఈ పదేండ్ల తెలంగాణ పాలనకు నిదర్శనం. కృష్ణా జలాల్లో న్యాయమైన తెలంగాణ వాటా 700 టి.ఎం.సి.లు సాధించుకోవలసిందే. రాయలసీమ అక్రమ ప్రాజెక్టులను ఆపడానికి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు సుప్రీంకోర్టులో కేసులు వేయడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే, దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే పరిస్థితి దగ్గరలోనే ఉన్నది. హైదరాబాద్‌‌‌‌ నగర తాగునీటికి, సాగు నీటికి నీటి కొరత ఏర్పడే ప్రమాదం పొంచియున్నది.

కృష్ణాలో 70% వాటా రావాలి

బ్రిజేష్‌‌‌‌ కుమార్‌‌‌‌  ట్రిబ్యునల్‌‌‌‌ 2013 సంవత్సరంలోనే నీటి కేటాయింపులపై అవార్డు పూర్తి చేసినది. కానీ, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌‌‌ ప్రభుత్వం ఈ  ట్రిబ్యునల్‌‌‌‌ అవార్డుపై స్టే  తీసుకు వచ్చినది. ఈ అవార్డు నోటిఫై కాకుండా నిలిచిపోయినది.  తెలంగాణ ప్రభుత్వం 2014 సంవత్సరంలోనే సెక్షన్‌‌‌‌-3, అంతర రాష్ట్ర నదీ జలాల పంపిణీ వివాదాల చట్టం, 1956 ప్రకారం మళ్లీ ఒక కొత్త ట్రిబ్యునల్‌‌‌‌ను ఏర్పాటు చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినది. కానీ కొత్త ట్రిబ్యునల్‌‌‌‌ ఏర్పాటుకు మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు, ఆంధ్రప్రదేశ్‌‌‌‌ కూడా వ్యతిరేకించినవి. 

ఈ పరిస్థితులలో తెలంగాణ ప్రభుత్వం దీనిపై సుప్రీంకోర్టులో కేసు వేసినది.  జరిగిన రెండవ అపెక్స్‌‌‌‌ కమిటీ మీటింగ్‌‌‌‌లో తెలంగాణ ప్రభుత్వం ఈ అంశాన్నే లేవనెత్తినది. అప్పుడు కేంద్రప్రభుత్వం స్పందించి, ఒకవేళ సుప్రీంకోర్టు కేసును ఉపసంహరించుకుంటే, కొత్త ట్రిబ్యునల్‌‌‌‌ను ఏర్పాటు చేస్తామని కేంద్రప్రభుత్వం హామీనిచ్చినది. వెంటనే తెలంగాణ ప్రభుత్వం 2021 జనవరిలో కేసును ఉపసంహరించుకున్నది.  కావున   బ్రిజేష్‌‌‌‌ కుమార్‌‌‌‌ ట్రిబ్యునల్‌‌‌‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌‌‌కు కేటాయించిన 1,005 టి.ఎం.సి.ల నుండి తెలంగాణకు న్యాయమైన 70% వాటా (700) టి.ఎం.సి.ల కృష్ణా జలాలను కేటాయించుటకు తగిన చర్యలు తీసుకుంటారని తెలంగాణ ప్రజలు ఆశతో ఉన్నారు. దానిని ఉభయ ముఖ్యమంత్రులు  ఒప్పుకున్నట్లయితే.. ఈ రెండవ బ్రిజేష్‌‌‌‌ కుమార్‌‌‌‌ ట్రిబ్యునల్‌‌‌‌  తదనుగుణంగా తీర్పును త్వరగా వెలువరించగలదు. 

ఉమ్మడి పాలనలో తెలంగాణకు చెందింది ఎంత? 

ఇప్పటివరకు ఆంధ్రపాలకులు తెలంగాణపై అజమాయిషీ చేసినవారే. ఏ మేరకు చిక్కుముళ్లు విడిపించుటకు సహకారం అందించగలరనే అనుమానం తెలంగాణ ప్రజలకు ఉన్నది. ఉమ్మడి రాష్ట్రంలో  తెలంగాణ సంపదను, ఆదాయాన్ని సమపాళ్లలో ఖర్చు చేయకుండా ఆంధ్రాకు తరలించుకుపోయారు. తెలంగాణ ప్రజల ఆదాయంతో తెలంగాణలో నిర్మాణం చేసిన 9వ, 10వ షెడ్యూల్‌‌‌‌లోని  ఆస్తులు, న్యాయపరంగా తెలంగాణకు చెందాలి. 1956 నుంచి 2014 వరకు తెలంగాణ నుంచి వచ్చిన ఆదాయం ఎంత? ఇందులో నుంచి తెలంగాణకు ఎంత ఖర్చు చేయడం జరిగినది?  లెక్కలు తేలాలి. 

ఉమ్మడి ఆస్తులు తెలంగాణకే దక్కాలి

తెలంగాణ సొమ్ముతో ఆంధ్రాలో నిర్మాణం చేసి ఉన్న ఆస్తులపై తెలంగాణకు కూడా హక్కులు ఉంటాయి.  గుడ్డిగా తెలంగాణలో ఉన్న ఉమ్మడి ఆస్తులపై ఆంధ్రాకు వాటా ఇవ్వడం వల్ల  తెలంగాణకు అన్యాయం చేసిన వారమవుతాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి 1956 నుంచి 2014 వరకు తెలంగాణ ఆదాయాన్ని ఖర్చును లెక్కలు తీయాలి. అదే విధంగా ఆంధ్రా ఆదాయాన్ని అక్కడ పెట్టిన ఖర్చును లెక్కలు తీయాలి. అప్పుడే తెలంగాణకు జరిగిన నష్టం తెలుస్తుంది. ఈ నష్ట నివారణకు ఇక్కడ ఉన్న ఉమ్మడి ఆస్తులపై తెలంగాణనే పూర్తి హక్కుదారు కాగలదు.

గత ప్రభుత్వ నిర్వాకం

వివాదాలు  లేని  గోదావరి జలాలపై, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పటికీ రూ. 94 వేల కోట్లను ఖర్చుచేసి పూర్తిచేశారు. కానీ, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుపై కేవలం 40% నిధులకు  మించి ఖర్చు చేయక ఇప్పటికీ అసంపూర్తి దశలోనే ఉంచారు.  నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్‌‌‌‌ నివారణకై చేపట్టిన  డిండి ప్రాజెక్టుది కూడా ఇదే పరిస్థితి. కొత్తగా తుమ్మిల, గట్టు, తదితర ఎత్తిపోతల పథకాలు కూడా చేపట్టి, పూర్తిచేయలేదు. ఆర్‌‌‌‌.డి.యస్‌‌‌‌.ను కూడా పూర్తిస్థాయిలో అనగా 85 వేల ఎకరాల సాగు వినియోగానికి తేలేదు. ఎస్‌‌‌‌.ఎల్‌‌‌‌.బి.సి. టన్నెల్‌‌‌‌ను కూడా ఈ పదేండ్లలో పూర్తిచేయలేదు.  

భీమ (2 లక్షల ఎకరాల సాగు), కల్వకుర్తి (3.4 లక్షల ఎకరాల సాగు), నెట్టెంపాడు (2 లక్షల ఎకరాల సాగు), కోయిలసాగర్‌‌‌‌ (0.5 లక్షల ఎకరాల  సాగు), జూరాల (1 లక్ష ఎకరాల సాగు) కింద ఉన్న సాగును పూర్తిస్థాయిలో వినియోగించడానికి ప్రయత్నం చేయలేదు.  డిండి ప్రాజెక్టుకు ఈ పదేండ్లలో ఎక్కడ నుంచి నీళ్లు ఇవ్వాలనో నిర్ణయించలేదు. దీనికి ఏడుసార్లు ప్రతిపాదనలు చేసి, రూ.15 కోట్లు ప్రజాధనాన్ని వృథా చేసినప్పటికీ, నీళ్ల సోర్స్‌‌‌‌ నిర్ణయించలేదు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు రోజుకు రెండు  టి.ఎం.సి.లు ఎత్తిపోసే ప్రతిపాదనను కూడా ఇప్పుడు ఒక్క  టి.ఎం.సి.కి కుదించారు.  

కల్వకుర్తి ప్రాజెక్టు క్రింద ఉన్న నిర్దేశిత 3.4 లక్షల ఎకరాల సాగుకు నీళ్లు ఇవ్వకుండా చెరువులు, కుంటలు, ఇతర రిజర్వాయర్‌‌‌‌లను నింపుతున్నారు.  కె.పి. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌‌‌‌ను రద్దుచేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును మొదట జూరాల నుంచి చేపట్టాలని నిర్ణయించి, తరువాత  కేసీఆర్​ ఆదేశాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు మార్చడం వల్ల అధిక వ్యయానికి గురిచేశారు. అంచనా రూ. 55 వేల కోట్లు, అదే జూరాల నుంచి
అయితే అంచనా రూ. 32 వేల కోట్లు మాత్రమే.

పోలవరం ఎత్తును తగ్గించాలి

పోలవరం ప్రాజెక్ట్‌‌‌‌ ఎత్తును 150 ఫీట్‌‌‌‌ల నుండి 130 ఫీట్‌‌‌‌లకు తగ్గిస్తే గానీ భద్రాచలం దక్షిణ భారతదేశపు రామాలయం మనుగడ కష్టం. జులై 2022 సంవత్సరంలో వచ్చిన వరదల కారణంగా పోలవరం బ్యాక్‌‌‌‌ వాటర్‌‌‌‌ వల్ల భద్రాచలం టెంపుల్‌‌‌‌ సమీపంలోని 93 గ్రామాలు జలమయం అయినాయి. భద్రాచలం టెంపుల్‌‌‌‌లో పూజలు ఆగిపోయినాయి. పోలవరం ఎత్తును 130 ఫీట్‌‌‌‌లకు తగ్గించినా గానీ పోలవరం ప్రాజెక్టు కింద ఆశించిన ప్రయోజనాలకు ఎలాంటి విఘాతం కలగదు.  భద్రాచలం టెంపుల్‌‌‌‌ను రక్షించే అవకాశం ఉన్నది.  ఒకవేళ 150 ఫీట్‌‌‌‌ల ఎత్తుకు పోలవరం ప్రాజెక్టును నిర్మించినట్లయితే  భద్రాచలం టెంపుల్‌‌‌‌ మనుగడకు ముప్పు వాటిల్లగలదు. కావున, ఇరువురు ముఖ్యమంత్రులు పోలవరం బ్యాక్‌‌‌‌ వాటర్‌‌‌‌ ఎఫెక్ట్‌‌‌‌పై సమగ్ర ఫ్లడ్‌‌‌‌ సర్వే చేయించి పోలవరం ప్రాజెక్టు ఎత్తును 130 ఫీట్‌‌‌‌ల ఎత్తుకు తగ్గించుటకు ప్రయత్నం చేయాలి.

- దొంతుల లక్ష్మీనారాయణ,
కన్వీనర్, తెలంగాణ ఇంజనీర్స్‌‌‌‌ ఫోరం