సాహు నుంచి మండల్ వరకు రిజర్వేషన్లను అడ్డుకున్నది ఎవరు?

ఛత్రపతి సాహు మహరాజ్ 1902 జులై 26న బ్యాక్వర్డ్ క్లాసులకు రిజర్వేషన్లు అమలు చేసిండు. పాలన రంగంలో 50 శాతం రిజర్వేషన్లను బ్రాహ్మణేతర కులాలకు వర్తింప చేశాడు. భారతదేశంలో చదువుకు, పాలనకు దూరమైన సామాజికవర్గాలకు రిజర్వేషన్లను అమలుచేయడం ఒక విప్లవాత్మకమైన నిర్ణయం. తన పాలన వ్యవస్థలో కులాలకు సమన్యాయం జరగాలంటే పాలనలో రిజర్వేషన్లు అవసరమని ఈ నిర్ణయం తీసుకున్నాడు.  

అభివృద్ధి, సామాజిక న్యాయం, ఆత్మగౌరవంలతో సామాజిక మార్పు దిక్సూచిగా 125 సంవత్సరాల క్రితమే దేశం ముందు నిలిపిన సామాజిక విప్లవకారుడు సాహు మహారాజు.  ఇంతటి గొప్ప దార్శనికతతో తీసుకున్న రిజర్వేషన్ నిర్ణయం అగ్రకులాలకు మింగుడు పడలేదు. అందుకే వారు అంతా ఏకమై సాహూ పాలనను వ్యతిరేకించారు. ఒక దశలో రాజభవనంలో  మంటలు చెలరేగితే రిజర్వేషన్ పాపం వల్లనే జరిగిందని ప్రచారం చేశారు. అదే విధంగా సాహు తల్లి చనిపోతే రిజర్వేషన్ల చర్య వల్ల పాపం చేసుకున్నారు కాబట్టి తల్లి చనిపోయిందని ప్రచారం చేశారు. 

1871లో తొలిసారి కులగణన

1830 నుంచి 1850 వరకు ఆనాటి బ్రిటిష్ అధికారులు.. పాలనలో కులాల ఆధిపత్యంపై  పలు సమీక్షలు నిర్వహించారు. ఒకే కులం అధికారంలో ఉండటం వలన ప్రజాపాలన అనేది పాక్షికంగానే ఉంటుందని భావించారు. అందుకే బ్రిటిష్ ప్రభుత్వం 1850లోనే  పలు కులాలను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని తీర్మానించింది. వెనుకబడిన కులాలవారి అభివృద్ధిని,  మార్పును సంప్రదాయక శక్తులు అడ్డుకుంటున్నాయని గమనించారు. దీంతో 1850లోనే కులగణనపై  కీలక నిర్ణయం తీసుకున్నారు.  కులాల అధ్యయనం చేశారు.  

మొదటిసారి 1871లో  కులగణన నిర్వహించారు.  ప్రతి 10 సంవత్సరాలకు కులాల స్థితిగతులను అధ్యయనం చేయడానికి జనాభా లెక్కలు మొదలయ్యాయి.  ముఖ్యంగా 1881 నుంచి కులగణన 1941 వరకు జరిగింది. స్వాతంత్ర్యం అనంతరం1951లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కుల జనగణనను పాక్షికంగా అమలుచేసింది. అందులో ఎస్సీలకు, ఎస్టీలకు, మతపరమైన మైనారిటీలను కుల జనగణనలో పరిగణనలోకి తీసుకున్నారు.  కానీ, వెనుకబడిన కులాల, ఎదిగిన కులాల కుల జనగణనను విస్మరించారు.

గాంధీ, అంబేద్కర్​ మధ్య పూనా ఒప్పందం

మహాత్మ జ్యోతిరావు ఫూలే బ్రాహ్మణేతరులకు రిజర్వేషన్లు కల్పించాలని హంటర్ కమిషన్ ముందు 1882లో వాదించారు. మింటో 1909 సంస్కరణలలో భాగంగా ముస్లింలు, సిక్కులు ఇతర మత మైనారిటీలకు ప్రత్యేకంగా రాజకీయాలలో రిజర్వేషన్ ఇవ్వడమైంది. 1918లో  మైసూర్ మహారాజు నల్వాడి కృష్ణ రాజా వడయార్ రిజర్వేషన్ల కోసం సర్ లెస్లీ మిల్లర్ కమిటీని ఏర్పాటుచేసి రిజర్వేషన్లు అమలుచేశారు.

అదేవిధంగా 1921లో జస్టిస్ పార్టీ ప్రభుత్వంలో భాగంగా మద్రాస్  ప్రెసిడెన్సీలో 'కమ్యూనల్ రిజర్వేషన్' జీవో జారీ అయింది. రౌండ్ టేబుల్ లో దళితులకు సపరేట్ ఎలెక్టరేట్ ఆమోదించడమైనది.  మహాత్మా గాంధీ బ్రిటిష్ చర్యను నిరసిస్తూ ఎర్రవాడ జైల్లో నిరాహార దీక్ష చేశారు.  దాంట్లో భాగంగా గాంధీ, -అంబేద్కర్​ల మధ్య 1932లో  పూనా ఒడంబడిక జరిగింది. 'హరిజనులు' (ఎస్సీలు) ఎన్నుకున్న  వారి నలుగురి ప్రతినిధులలో ఒకరిని అన్ని కులాలవారు తమ ఓటు వేసి1937లో ఎన్నుకున్నారు.

తరువాత ఆ పద్ధతిని తొలగించి ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేయడమైనది. 1946 డిసెంబర్ 9న రాజ్యాంగ సభ ఏర్పాటై రాజ్యాంగ రచన జరుగుతున్న క్రమంలో రిజర్వేషన్ల చర్చ జరిగింది. ఎంతోమంది రాజ్యాంగ సభ సభ్యులు రిజర్వేషన్లను వ్యతిరేకించారు. చివరికి అంబేద్కర్ నిరసించడంతో రాజ్యాంగ సభ రిజర్వేషన్ ఆర్టికల్స్​ను అంగీకరించింది. 

ఓబీసీలకు రిజర్వేషన్ల కోసం..మండల్​ కమిషన్​ సిఫార్సు

రాజ్యాంగ సూత్రాల మేరకు బ్యాక్వర్డ్ క్లాసెస్ ను గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నందున బీసీ నాయకత్వం 1950 నుంచి ఉద్యమిస్తోంది. ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ నాయకులు పంజాబ్ రావు దేశ్​ముఖ్, చౌదరి బ్రహ్మప్రకాశ్ యాదవ్, రామ్ లఖన్ చందాపురి  తదితరులు బీసీ ఉద్యమాన్ని   దేశస్థాయిలో కొనసాగిస్తూ ఉద్యమించారు. లోహియా సోషలిస్టులు/ సమాజ్వాదిలు జనతా పార్టీలో భాగంగా 1977 నాటి ప్రభుత్వం పై కమిషన్ ఏర్పాటుకు ఒత్తిడి చేయడంతో 1978లో మండల్ కమిషన్ ఏర్పాటు చేయడమైనది.

1980లో మండల్ కమిషన్ 40 సిఫార్సులను చేసింది. అదే విధంగా కులజనగణన దేశస్థాయిలో జరగాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.  1990 ఆగస్టు 7న జనతాదళ్ సారథ్యంలోని వీపీ సింగ్ ప్రభుత్వం మండల్ కమిషన్ రిపోర్టుకు ఆమోదం తెలుపుతూ 40 సిఫార్సుల్లోని ఒక సిఫారసును కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో అమలు చేయుటకు నిర్ణయాన్ని పార్లమెంటులో ప్రకటించింది.

దాన్ని అగ్రవర్ణ సమాజం వ్యతిరేకించింది.  చివరకు 1992 నవంబర్ 16న సుప్రీంకోర్టు తొమ్మిది జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం మండల్ కమిషన్ రిపోర్టు శాస్త్రీయంగా ఉన్నదని తీర్పునిచ్చింది. దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో నిర్ణయించిన 27% రిజర్వేషన్లు కూడా సరైనదేనని తీర్పునిచ్చింది. దాంతో మొదటిసారి 1993లో కేంద్ర ప్రభుత్వ స్థాయిలో వెనుకబడిన కులాలకు'వెనుకబడిన తరగతుల గుర్తింపు' (ఓబీసీ ఐడెంటిటీ) లభించింది.

- ప్రొఫెసర్ సింహాద్రి సోమనబోయిన, రాష్ట్ర అధ్యక్షుడు,సమాజ్​వాది పార్టీ