ప్రకృతి పచ్చదనమే శ్రీరామరక్ష

ఎటు చూసినా ఎండలు 40 డిగ్రీలు దాటిపోతున్నాయి. తాగునీరు కరువైతున్నది. ప్రకృతి ప్రకోపం దానికి తోడైందనే విషయాన్ని అందరమూ గుర్తించాలి. ఆధునిక సాంకేతిక మోజులో అనాగరికంగా అడవులను నరుకుతూ, అవసరానికి మించి ప్లాస్టిక్ ను వినియోగిస్తూ, ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించే పద్ధతులు వాడకపోవడం, చెట్లను పెంచే నైతిక బాధ్యతను విస్మరించడం వంటి వివిధ కారణాల వల్ల ప్రశాంతతను పంచాల్సిన ప్రకృతి పర్యావరణం కలుషితమై నేడు సమస్త మానవాళిపై కన్నెర్ర చేసింది.  నేడు తాగడానికి మంచినీరు, శ్వాసించడానికి స్వచ్ఛమైన ఆక్సిజన్ దొరకని ఆందోళనకర పరిస్థితుల్లో  కొట్టుమిట్టాడుతుంది  మన 5G ప్రపంచం. 

తెలివి, డబ్బు ఉందన్న అహంకార మదంతో. భవిష్యత్ తరాలకు బతుకునీయాలంటే, బతుకు ఉండాలంటే ప్రపంచ దేశాలు, వాటి ప్రభుత్వాలు, పౌరులు సామాజిక బాధ్యతగా, మానవతావాదంతో ప్రకృతితో స్నేహం చేస్తూ పచ్చదనాన్ని పరిమళించేలా చేయాలి. మనం నాటే చెట్ల ఎదుగుదలే  మానవ నాగరికత ప్రగతిగా భావించాలి. చెట్లను నాటినట్లు నటించడం మానేయాలి. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి. ప్రకృతి ప్రాణంతో ఉంటేనే మనమంతా జీవంతో ఉంటాం. లేదంటే ప్రకృతి ప్రదర్శించే విధ్వంసాన్ని ఆపడం అసాధ్యం. ప్రకృతి మన అవసరాలను మాత్రమే తీరుస్తుంది. మన అంతులేని కోరికలు ప్రకృతిని విధ్వంసం చేస్తున్నది. కాబట్టి ప్రకృతి ఆరాధన, ప్రకృతిని కాపాడే పనిలో మనకు మనంగా ఎవరికి వారు చేయగలిగితే అది ఎన్నో విధాల మేలు.

- పి. అరుణ్ కుమార్
ఫిజిక్స్ రీసెర్చ్ స్కాలర్ 
పాలమూరు యూనివర్సిటీ