ట్వెల్త్ ఫెయిల్, సెక్టార్ 36 లాంటి చిత్రాలతో నటుడిగా చక్కని గుర్తింపును అందుకున్నాడు విక్రాంత్ మాస్సే(Vikrant Massey). ఇటీవల అతను నటించిన ‘సబర్మతి రిపోర్ట్’ చిత్రం విడుదలైంది.
ఈ నేపథ్యంలో సినిమా కెరీర్‌కు బ్రేక్ ఇస్తున్నానని, ఫ్యామిలీ లైఫ్, తన హెల్త్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించి ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడిప్పుడే హీరోగా ఎదుగుతున్న విక్రాంత్ నుంచి ఇలాంటి ప్రకటన రావడంతో షాక్ అయ్యారు అభిమానులు.
అయితే రిటైర్మెంట్ ప్రకటించి రెండు రోజులు తిరక్కముందే కొత్త చిత్రం షూటింగ్‌లో కనిపించి సర్ప్రైజ్ చేశాడు. విక్రాంత్, షణాయ కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆంఖోన్ కి గుస్తాఖియాన్’. ప్రస్తుతం డెహ్రాడూన్‌లో జరుగుతున్న షూట్‌లో విక్రాంత్ మాస్సే జాయిన్ అయ్యాడు. షూటింగ్ సందర్భంగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామిని కలిశాడు విక్రాంత్. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఇక రిటైర్మెంట్ ప్రకటనపై స్పందిస్తూ.. తన స్టేట్మెంట్‌ని అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని, పూర్తిగా సినిమాలు మానేస్తానని తానెక్కడా చెప్పలేదని, కొన్ని రోజులు విరామం మాత్రమే తీసుకుంటున్నట్టు వివరణ ఇచ్చాడు.