విజ్ఞులా... విష పురుగులా?

కొందరు పైకి విజ్ఞుల్లా కనిపిస్తారు. అందులోనూ పంచెకట్టుతో పెద్దరికాన్ని తెచ్చి పెట్టుకుంటారు. ఐతే, అది ఆహార్యంలో మాత్రమే. మానసిక స్థితిలో మాత్రం మహా విషపూరితం. ‘నమస్తే తెలంగాణ’లో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వ్యాసం చూసిన తర్వాత.. సగటు తెలంగాణ పౌరుడుకి ఎవరికైనా ఈ విషయం అర్థమవుతోంది. ఇయ్యాల ఉభయ తెలుగు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు 

ఎ రేవంత్ రెడ్డి, ఎన్ చంద్రబాబు నాయుడు ఇరు రాష్ట్రాల ఉమ్మడి సమస్యల పరిష్కారం కోసం ప్రగతి భవన్ వేదికగా భేటీ కానున్నారు. దీనిపై నిరంజన్ రెడ్డి ఆ వ్యాసంలో విషం కక్కారు. ప్రగతి భవన్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక... అందులో ఇద్దరు ద్రోహులు భేటీ అవుతున్నారు అని సెంటిమెంట్ ను రెచ్చగొట్టే దుర్బుద్ధి ప్రదర్శించారు.

చంద్రబాబు నాయుడు 2014 -– 2018 మధ్య ఈ సమస్యల పరిష్కారం కోసం ఎందుకు కేసీఆర్ కు లేఖ రాయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డికే ఎందుకు రాశాడు. అని తలా తోక లేని ప్రశ్న లేవనెత్తారు నిరంజన్ రెడ్డి. 
ప్రగతి భవన్​ సాక్షిగా...గద్దర్​కు అవమానం
నిరంజన్ రెడ్డికి కేసీఆర్ మీద వల్లమాలిన ప్రేమ. రేవంత్ రెడ్డి అంటే అణువణువునా ద్వేషం. కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చాడు కాబట్టి... ఆయనపై ప్రేమ ఒలకబోసుకుంటే తప్పులేదు. తనకు రేవంత్ రెడ్డిపై ఉన్న వ్యక్తిగత ద్వేషాన్ని తెలంగాణ ప్రయోజనాలతో ముడిపెట్టి చూడటం మాత్రం దుర్మార్గం. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిరంజన్ రెడ్డి చెబుతోన్న ప్రగతి భవన్ కేసీఆర్ పాలనలో గడచిన పదేండ్లు ఎన్ని దారుణాలకు సాక్ష్యంగా నిలిచిందో తెలంగాణ సమాజం చూడలేదా! ప్రజల కష్టార్జితంతో, ప్రజల చెమటతో నిర్మించిన ప్రగతి భవన్ ఎనిమిదవ నిజాం లాంటి కేసీఆర్ కుటుంబ విలాస కేంద్రంగా ఎట్లా వర్ధిల్లిందో తెలంగాణ మర్చిపోతుందా! 15 అడుగుల శత్రుదుర్బేధ్యమైన ఇనుప కంచెలను తెలంగాణ అంత తేలిగ్గా మర్చిపోతుందా? ఒక ముస్లిం హోంమంత్రిని ప్రగతి భవన్ లోకి ప్రవేశం లేదని కానిస్టేబుల్ ఆపేసి... వెనక్కు పంపిన దృశ్యాలు తెలంగాణ మర్చిపోయిందా! తెలంగాణ సాంస్కృతిక చిహ్నం గద్దర్ ను రెండు గంటలకు పైగా ప్రగతి భవన్ గేటు దగ్గర ఎర్రటి ఎండలో నిలబెట్టి... ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ లేదు అని అవమానంగా గెంటేసిన సంఘటన తెలంగాణ కళ్ల ముందు ఇంకా మెదలాడుతూనే ఉంది.  కోదండరాంపై  మీ  వికృత ద్వంద్వ వైఖరి తెలంగాణ ఎన్నడూ క్షమించదు.

జగన్​తో అలయ్​ బలయ్​

ప్రజలు ఒక్కసారి ఓట్లు వేసి గెలిపించిన తర్వాత ఏ నాయకుడుకైనా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం కావాలి. రాగద్వేషాలకు అతీతంగా పని చేయాలి. రాజకీయ కక్షల కంటే రాష్ట్ర ప్రజల భవిష్యత్తే ముఖ్యం కావాలి. కానీ, కేసీఆర్ చేసింది ఏమిటి. చంద్రబాబుతో చర్చించి... సమస్యలు పరిష్కరించుకోవడం ఆయనకు వ్యక్తిగతంగా ఇష్టం లేదు. కాబట్టి... ఏమీ పట్టించుకోలేదు. కానీ, జగన్ మోహన్ రెడ్డితో ఆయనకు స్నేహం సౌఖ్యంగా ఉంది. అందుకే పిలిచి బిర్యానీ పెట్టారు. అలయ్ బలయ్ లు చేసుకున్నారు. గోదావరి జలాలను రాయలసీమకు తరలిస్తా... నన్నెవరేం చేస్తారు అని బీరాలు పోయారు. అధికారిక సమావేశాల ముసుగులో ఏకాంత భేటీలు జరిపారు. కాంట్రాక్టులు పంచుకున్నారు. కమీషన్లలో పర్సెంటేజీలు మాట్లాడుకున్నారు.

 గడచిన ఐదేండ్లు వైసీపీకి చెందిన నేతలకు తెలంగాణలో కాంట్రాక్టులు ఇచ్చి ప్రోత్సహించారు. అంతే తప్ప... ఉమ్మడి సమస్యల పరిష్కారం కోసం కేసీఆర్ ఏనాడూ ప్రయత్నించింది లేదు. ఈ పరిస్థితుల్లో  నేడు ఒక ప్రయత్నం జరుగుతోంది. అది కూడా బహిరంగంగానే.  ఎక్కడా రహస్యం లేదు.  ప్రగతి భవన్ లో మంత్రులు, అధికారగణం సమక్షంలో చర్చలు జరగబోతున్నాయి. తెలంగాణపై  ప్రేమ ఉన్నవారు ఎవరైనా ఈ చర్చలు ఫలవంతం కావాలని... తెలంగాణకు లాభం జరగాలని కోరుకోవాలి.  బీఆర్ఎస్ కు చెందిన హరీష్ రావు కూడా ఈ దిశగానే మాట్లాడారు. కానీ, అదే పార్టీకి చెందిన నిరంజన్ రెడ్డి మాత్రం రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాసం రాశారు.

సమస్యలు అధిగమించి తెలంగాణ పురోగమించాలి

ఇరువురి ముఖ్యమంత్రులు భేటీ ఒక దుర్దినంగా వ్యాఖ్యానించారు. విభజన చట్టంలో 9 వ షెడ్యూలులో ఉన్న 89 ప్రభుత్వ కంపెనీలు, పదవ షెడ్యూలులో ఉన్న 107 శిక్షణా సంస్థల, ఇతర వ్యవస్థల మధ్య ఇప్పటికీ విభజన జరగలేదు. షీలాబేడీ కమిటీ సిఫార్సులు ఇచ్చినా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. డెక్కన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ (దిల్) లాంటి కొన్ని అంశాలపై హైకోర్టులో కేసులు ఉన్నాయి. 10 షెడ్యూలులో ఉన్న హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ విభజన జరగలేదు. ఉద్యోగుల విభజనలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. 

స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లాంటి సంస్థల విభజన పెండింగ్ లో ఉంది. 80 వేల పుస్తకాలు చదవిన అపరమేధావి ఈ సమస్యలపై ఆనాడే చొరవ చూపి ఉంటే... పంచాయితీనే లేదు కదా! ఈ రోజు రేవంత్ రెడ్డి, చంద్రబాబులు భేటీ అయ్యారని మీరు ఏడ్వాల్సిన అవసరమే ఉండేది కాదు కదా! నిరంజన్ రెడ్డి  ఏం చెప్పదలచుకున్నారు. అసలు భేటీయే వద్దంటారా!  సమస్యలు పరిష్కరించుకోవాల్సిన అవసరం లేదంటారా? రేవంత్ రెడ్డి, చంద్రబాబులు నిజంగానే మిలాఖత్ అవ్వాలనుకుంటే దానికి బహిరంగ భేటీ ఎందుకవుతారు!  

నిరంజన్ రెడ్డి తన ఆహార్యానికి తగ్గ గౌరవాన్ని ప్రదర్శిస్తే తెలంగాణ సమాజం హర్షిస్తుంది. సమస్యలు సాధ్యమైనంత త్వరగా పరిష్కారం కావాలి.  తెలంగాణ పురోగమించాలి అని ఆయన కోరుకుంటే గౌరవం పెరుగుతుంది. మంత్రిగా పనిచేసిన ఆయన అనుభవంతో... ఇదిగో ఇలా పరిష్కార మార్గాలు వెతకండి అని ఏమైనా సూచనలు చేస్తే ఇంకా బాగుంటుంది. అంతే తప్ప ఇద్దరి ముఖ్యమంత్రులు భేటీలో దురుద్దేశాలు వెతికే ప్రయత్నం చేస్తే అది వృథా ప్రయాస మాత్రమే కాదు. తెలంగాణ ప్రజానీకం మిమ్మల్ని ఇంకా ఛీ కొడుతుంది.

- సాగర్​ వనపర్తి,
పొలిటికల్​ ఎనలిస్ట్