లెటర్​ టు ఎడిటర్​: గ్రంథాలయాల్లో ఖాళీలను భర్తీ చేయాలి

గ్రంథాలయాలు జ్ఞాన సంపదకు నిలయాలు. విజ్ఞానాన్ని పంచుతూ,- చైతన్యాన్ని పెంచుతూ తరతరాల చరిత్ర గ్రంథాల రూపంలో నిక్షిప్తమై ఉంటాయి. విద్యార్థుల జ్ఞానశక్తిని పెంపొందించడంలో,  ప్రజలను మేలుకొల్పడంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయి. గ్రంథాలయాలు సమాజంలో చాలా అవసరం. తెలంగాణ సాయుధ పోరాటంలో గ్రంథాలయాలు ప్రముఖ పాత్రను పోషించాయి. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం మెగా డీఎస్సీతో ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను నింపుతామనడం చాలా సంతోషకరమైన విషయం. 

కానీ, నూతన విద్యా విధానం ప్రకారం ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో కచ్చితంగా లైబ్రేరియన్ ఉండాలి. ప్రతి గ్రామ పంచాయతీలలో ప్రజలు ఆస్తి పన్నులో భాగంగా లైబ్రరీ సెస్ చెల్లిస్తుంటారు.  వాస్తవానికి చాలా గ్రామాల్లో లైబ్రరీలు ఉండవు.  గ్రామపంచాయతీ వసూలు చేసిన పన్నుల నుంచి జిల్లా గ్రంథాలయ సంస్థ చట్టం-1960 ప్రకారం 8% నిధులు ఆయా గ్రంథాలయ సంస్థలకు గ్రామపంచాయతీలు చెల్లిస్తున్నాయి.  కాబట్టి, ఎలాంటి జాప్యం లేకుండా ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో లైబ్రరీని ఏర్పాటు చేసి లైబ్రేరియన్​ను నియమించాలి. 

అదే విధంగా పాఠశాల విద్యార్థులకు లైబ్రరీకి పిరియడ్ కేటాయించడం వలన విద్యార్థులకు ఆలోచన శక్తి. జనరల్ అవేర్​నెస్​ పెరుగుతుంది. రాష్ట్రంలోని ప్రతి ఊరిలోనూ కచ్చితంగా ఒక లైబ్రరీ ఏర్పాటు చేసి లైబ్రేరియన్​ను నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే విద్యార్థులకు, యువతకు గ్రంథాలయాలు చాలా ఉపయోగపడతాయి. 

త్వరలో మెగా డీఎస్సీతో పాటు లైబ్రేరియన్ పోస్టులను కూడా భర్తీచేయాలి. ఎంతోమంది లైబ్రరీ సైన్స్ పట్టభద్రులు చాలా ఏండ్ల నుంచి రిక్రూట్మెంట్ లేకపోవడంతో నిరుద్యోగులుగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి పబ్లిక్,  జిల్లా గ్రంథాలయాలలో,  ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయాలని నిరుద్యోగ యువత కోరుతున్నారు. 

అయితగోని మల్లికార్జున్, వరంగల్