అంబేద్కర్ ఆరాధ్య దేవుడే..!

‘‘అంబేద్కర్ పేరు ఎత్తడం ఒక ఫ్యాషనైపోయింది.. దాని బదులు దేవుడిని స్మరించినా స్వర్గానికి వెళ్లవచ్చు..’’ అంటూ కీలక బాధ్యతల్లో ఉన్న దేశ హోం మంత్రి అమిత్ షా బాధ్యతారాహిత్యంగా రాజ్యసభలో వ్యాఖ్యానించారు. ఆయన అహంపూరిత వ్యాఖ్యలపై యావత్ దేశం ఆగ్రహం వ్యక్తం చేయడంతో కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని అసత్య ప్రచారాలకు తెరలేపింది బీజేపీ నాయకత్వం. రాజ్యాంగంపై కక్షకట్టిన బీజేపీ రంగులు బట్టబయలు కావడంతో ప్రజాగ్రహాన్ని తప్పించుకునేందుకు కాంగ్రెస్ పై బురదజల్లుతోంది.

నిస్సందేహంగా అమిత్ షా చెప్పినట్టు భారత రాజ్యాంగం, దాని రూపకర్త కోట్లాది భారతీయుల  ఆరాధ్య దైవమైన డా.బీర్.అంబేద్కర్ పేరు కాంగ్రెస్ పార్టీకి నిత్యం స్మరణీయమే కాదు, మాకు ఆరాధ్య దైవం కూడా. అమిత్ ​షా చెప్పినట్టు దేవుడు, స్వర్గం వంటి మాటలు బీజేపీకి సరిగ్గా సరిపోతాయి. సెంటిమెంట్ అవకాశవాద రాజకీయాలతో పబ్బం గడుపుకునే బీజేపీకి అంబేద్కర్ పేరు ఎత్తడం ఫ్యాషన్ అయితే, పేద, బడుగు, బలహీనవర్గాల అభివృద్ది, సంక్షేమం కోసం తపించే కాంగ్రెస్​కు మాత్రం అంబేద్కర్ దేవుడితో సమానం. మాకు ఆరాధ్యమైన అంబేద్కర్ పేరును ఒకసారి కాదు లక్షల కోట్ల సార్లు స్మరించడానికి మేము వెనుకంజ వేయం. రాజ్యాంగాన్ని మార్చే లక్ష్యంగా అడుగులేస్తున్న బీజేపీ అంబేద్కర్​ను ద్వేషించడంలో ఆశ్చర్యమేమీ లేదు. 

లోక్​సభ ఎన్నికల్లో బీజేపీకి బుద్ది చెప్పినా..

బీజేపీ, దాని మాతృసంస్థ ఆర్ఎస్ఎస్, వారి సానుభూతిపరులు అంబేద్కర్​ను విమర్శించడం ఇది మొదటిసారి కాదు. సంఘ్ సిద్ధాంతాలను సమర్థించే ప్రముఖ రచయిత అరుణశౌరి ‘వర్షిపింగ్ ఫాల్స్ గాడ్స్’ పుస్తకంలో స్వాతంత్ర్య పోరాటంలో, రాజ్యాంగం రూపకల్పనలో అంబేద్కర్ పాత్రను తక్కువచేసి చూపించాలని ప్రయత్నించారు. అప్పటి నుండి ఇప్పటి వరకూ అంబేద్కర్ విషయంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్రలు బట్టబయలవుతూనే ఉన్నాయి. బీజేపీ రాజ్యాంగంపై కుట్రలు పన్నుతోందని పసిగట్టిన ప్రజలు 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ది చెప్పినా వారిలో మార్పురాలేదు. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లకు బీజేపీతో ప్రమాదం ఏర్పడుతుందని గ్రహించిన ప్రజలు విజ్ఞతతో కూడిన తీర్పు ఇచ్చారు. ‘అబ్ కీ బార్ చార్ సౌ పార్’ అనే నినాదంతో లోక్​సభ ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీకి అధిక స్థానాలు కట్టబెడితే పవిత్ర రాజ్యాంగానికే ముప్పు ఏర్పడుతుందని పసిగట్టిన దేశ ప్రజలు ఆ పార్టీకి మునుపటి సీట్ల కంటే చాలా తక్కువ స్థానాలే ఇచ్చారు. 

రాజ్యాంగ పుస్తక ప్రదర్శనను జీర్ణించుకోలేకపోతున్నారు

పార్లమెంట్ సాక్షిగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ ఎంపీలు రాజ్యాంగం ప్రతిని పట్టుకొని బీజేపీతో రాజ్యాంగానికి ఏర్పడుతున్న ముప్పుపై ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలదీస్తే, ఆ ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వలేని బీజేపీ నేతలు పుస్తకం అట్ట రంగు, పుస్తకం డిజైన్ అందులోని పేజీల సంఖ్య అంటూ అసందర్భ అంశాలతో చర్చను పక్కదారి పట్టించే కుటిల ప్రయత్నాలు చేశారు. దీంతో బీజేపీతో రాజ్యాంగానికి, లౌకికవాదానికి ఏర్పడుతున్న ముప్పును ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో కాంగ్రెస్ అధినేతలంతా  కొంతకాలంగా అవకాశమొచ్చిన ప్రతి చోటా రాజ్యాంగం పుస్తకాన్ని ప్రదర్శిస్తూ బీజేపీ తీరును ఎండగడుతూ ఉన్నారు.దానికి పరాకాష్టనే  ప్రస్తుతం పార్లమెంట్ లో అమిత్ షా అహంపూరిత వ్యాఖ్యలు. 

అమిత్ ​షా బుకాయింపు

ప్రజా సమస్యలను, ముఖ్యాంశాలను పక్కదారి పట్టించడంలో సిద్దహస్తులైన బీజేపీ నేతలు అమిత్​ షా చేసిన ప్రమాదకరమైన వ్యాఖ్యలతో ఆయనను పదవి నుండి తొలగించాల్సింది పోయి, అనవసరమైన విషయాలను తవ్వుతూ అసలైన విషయాన్ని పక్కదారి పట్టిస్తూ అమిత్​ షాను వెనకేసుకొస్తున్నారు. రాజ్యసభ సాక్షిగా చేసిన ఈ వ్యాఖ్యలపై తన ప్రసంగాన్ని ఎడిట్ చేసారని అమిత్ షా బుకాయిస్తున్నారు. సభ సాక్షిగా యావత్ దేశం చూస్తుండగా చేసిన వ్యాఖ్యలు ఎలా ఎడిట్ చేస్తారు..? ప్రసంగంలో భాగంగా వెనుకముందు ఇతర విషయాలున్నా  ఈ వ్యాఖ్యలు ఆయన చేసినవే కదా. ఇందులో ఎడిటింగ్, మార్ఫింగ్​కు అవకాశాలెలా ఉంటాయి...? ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు అన్నీ మీడియా వేదికలుగా చక్కర్లు కొడుతున్నా ఆ పార్టీ నేతలు నిస్సిగ్గుగా తిరిగి కాంగ్రెస్​పైనే ఎదురు దాడి చేయడం వారి అహంభావానికి నిదర్శనం.

సావర్కర్​ను కొలిచేవారు, రాజ్యాంగాన్ని గౌరవిస్తారా?

సావర్కర్ ను  వీరుడిగా కొలిచే బీజేపీ నుండి అంబేద్కర్ పై, రాజ్యాంగంపై ఇంతకంటే ఎక్కువ ఆశించలేం.  ‘‘రాజ్యాంగంలో భారతీయత లేదు. మనది హిందూ దేశం. మన సంస్కృతి సంప్రదాయాలుండే వేదాలు, మనుస్మృతి మనకు ముఖ్యమైనవి. మనకు మనుస్మృతే చట్టం..’’ అని అభిప్రాయపడిన సావర్కర్​ను  అనుసరించే బీజేపీ నిత్యం రాజ్యాంగంపై దాడి చేస్తూనే ఉంది. ఒక వైపు రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నాం అంటూ, మరోవైపు దాన్ని విమర్శించిన సావర్కర్ మాకు ఆరాధ్యమని చెప్పుకునే బీజేపీ కపట నాటకానికి ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలి?

సమస్యలను పక్కదారి పట్టించే ప్రయత్నాలు 

 మోదీ అండతో అదానీ అవినీతి, మణిపూర్, సంభాల్లో మత కలహాలు, దేశంలోని రైతుల న్యాయమైన డిమాండ్లపై కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి మోదీ ప్రభుత్వాన్ని నిలదీస్తే, ఈ అంశాలను పక్కదారి పట్టించేలా అమిత్ షా అంబేద్కర్​ను అగౌరవపర్చారు. దీనికి నిరసనగా దేశ వ్యాప్తంగా ఆందోళన చేసి, బీజేపీ  నిజస్వరూపాన్ని కాంగ్రెస్​బయటపెడుతున్నది. అమిత్ ​షాను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని పార్లమెంట్ లోపల, బయట రాహుల్ గాంధీ నేతృత్వంలో ‘ఇండియా’ కూటమి నిరసనలు తెలుపుతుంటే, అడ్డుకోవడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం కొత్త  కుట్రలకు తెరలేపింది. 

పార్లమెంట్ లోపలికి ప్రవేశిస్తున్న సమయంలో అక్కడ గుమిగూడిన ఎంపీల కారణంగా దురదృష్టవశాత్తు గాయపడ్డ బీజేపీ ఎంపీని రాహుల్ గాంధీ ఉద్ధేశపూర్వకంగా గాయపర్చారని ఆయనపై పోలీసు కేసు నమోదు చేసి నీచ రాజకీయాలకు బీజేపీ పాల్పడింది. ప్రతిపక్ష నేత మరో సహచర ఎంపీపై పార్లమెంట్​లో  దాడి చేశారని ఫిర్యాదు చేశారంటేనే ఆ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనం. రాజ్యాంగంపై, అమిత్ షా వ్యాఖ్యలపై పార్లమెంట్​లో  చర్చిద్దామంటే భయపడి పారిపోయిన బీజేపీ, పార్లమెంట్ బయట గలాట సృష్టించి ప్రజాస్వామ్యానికే తీవ్ర తలవంపు తెచ్చింది.

కాంగ్రెస్​ పోరాటం ఆగదు

కాంగ్రెస్ పార్టీ బడుగు, బలహీనవర్గాల సంక్షేమం కోసం కులగణన చేపట్టి వారికి న్యాయం చేయాలని ప్రయత్నిస్తుంటే, బీజేపీ ఇందుకు విరుద్ధంగా బడుగు, బలహీనవర్గాల పీకనొక్కేలా వ్యవహరిస్తూ వారికి అన్యాయం చేస్తోంది. ఇందులో భాగంగానే అంబేద్కర్​పై అనుచిత వ్యాఖ్యలు చేసి భారతీయుల గుండెలను గాయపర్చారు.  బీజేపీ కుట్రలను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నిత్యం పోరాడుతుంది. అంబేద్కర్ పై  అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా, ఆయనను పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ  అనేక వేదికలపై పలు రూపాల్లో నిరసనలు తెలుపుతున్న కాంగ్రెస్ పార్టీ అమిత్ షా రాజీనామా చేసేవరకు, బీజేపీ క్షమాపణలు చెప్పేవరకు విశ్రమించేదే లేదు. దేవుడిని స్మరించమని అమిత్ షా అంటున్నారు. మాకు అంబేద్కర్  ఆరాధ్య దేవుడే అని గర్వంగా చెప్పుకుంటున్నాం.  భారత రాజ్యాంగం మాకు పవిత్రమైన భగవద్గీత, ఖురాన్, బైబిల్ గ్రంథాలతో సమానం.

రాజ్యాంగ సవరణలను కాంగ్రెస్ పేదల కోసం చేసింది

మరోవైపు రాజ్యాంగాన్ని అడుగడుగునా ఉల్లంఘించే వీరు తామే రాజ్యాంగ పరిరక్షకులమంటూ గొప్పలు  చెప్పుకోవడం హాస్యాస్పదం.  కాంగ్రెస్ రాజ్యాంగానికి పలు సవరణలు చేసిందని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ రాజ్యాంగంలో చేసిన పలు సవరణలు దేశాభివృద్ధి కోసం చేసినవే. దేశ లౌకికవాదాన్ని పరిరక్షించడంతో పాటు కాలమాన పరిస్థితులను బట్టి బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసమే పలు సవరణలు చేపట్టింది.  ఇటీవల ప్రపంచానికే స్ఫూర్తిగా నిలిచిన మన రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా పార్లమెంట్​లో  నిర్వహించిన ప్రత్యేక చర్చలో బీజేపీ అసత్య ప్రచారాలతో తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించగా కాంగ్రెస్ ఎంపీలు వారి కుట్రలను ఎండగట్టారు. ఈ చర్చల్లో భాగంగానే అమిత్ షా రాజ్యసభలో తమ నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారు.

బి.మహేశ్ కుమార్ గౌడ్ (ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు)