నీటి వృథా అరికట్టకపోతే నరకమే!

  • నేడు  ప్రపంచ జల పరిరక్షణ దినోత్సవం

ఏ వస్తువు అయినా ఉచితంగా లేదా ఎక్కువ మొత్తంలో అందుబాటులో ఉంటే దుర్వినియోగం చేయడం మానవ నైజం. ఇప్పుడు ఈ సూత్రం నీటికీ వర్తిస్తుంది. వేసవి కాలం వచ్చేసింది. సహజంగానే నీటి వినియోగం ఎక్కువ అవుతుంది. కానీ బోర్ల నుంచి, నల్లాల నుంచి వస్తున్న నీటిని విచ్చలవిడిగా వాడుతున్నారే తప్ప... ఏనాడైనా నీటి పొదుపు గురించి ఆలోచిస్తున్నారా? సిలికాన్‌‌‌‌ వ్యాలీగా పేరుమోసిన బెంగళూరు మహానగరం ఇప్పుడు నీటి కోసం బెంగపడుతోంది.

దాదాపు 60 శాతం మంది ప్రజలు నీటి ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. నీటిని వృథా చేస్తే రూ. 5000 జరిమానా విధించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. . తమిళనాడు రాజధాని చెన్నైలోనూ 2019 సంవత్సరంలో ఇలాంటి పరిస్థితే వచ్చింది. చివరకు రైల్వే వ్యాగన్ల ద్వారా తాగునీటిని తరలించారు. నీటి ఎద్దడి వలన రాష్ట్రాలకు రాష్ట్రాలకు మధ్య సమస్యలు కూడా రావడం తెలిసిందే.

లీకేజీలు, నిర్లక్ష్యంతో నీటి వృథా

విలువైన నీటిలో చాలా వరకు వృథాగా పోతుండడం ఆందోళన కలిగిస్తోంది. సరఫరా చేస్తున్న నీటిలో 20 శాతం వరకు లీకేజీలు, వాడకంలో నిర్లక్ష్యం వలన వృథా అవుతోందని జలమండలి గతంలో లెక్క వేసింది. పాత పైపులైన్ల వ్యవస్థ, లీకేజీలు, సర్వీసు రిజర్వాయర్ల ఓవర్‌‌‌‌ ఫ్లో, ఇంటి ముందు రహదారులు, వాహనాలు పైపులు పెట్టి కడగటం, పబ్లిక్‌‌‌‌ నల్లాలకు ట్యాప్‌‌‌‌లు లేకపోవడం తదితర కారణాలతో ఎక్కువ వృథాగా పోతోంది. కాబట్టి ఇప్పటినుంచే ప్రణాళికలతో పాటు నీటి వినియోగంలో వృథా తగ్గించి పొదుపు పాటించడం అవసరమని, రీసైక్లింగ్‌‌‌‌ విధానంపై ప్రధానంగా దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

గ్రేటర్‌‌‌‌ వ్యాప్తంగా రోజు విడిచి రోజు 2,547 మిలియన్‌‌‌‌ లీటర్ల నీటిని అందిస్తున్నారు. అందులో 20 శాతం అంటే 509 మిలియన్‌‌‌‌ లీటర్ల వరకు వృథా అవుతున్నట్లు అంచనా. నగర పరిధిలో నీటి సరఫరా సర్వీసు ఏరియా 1451. 91 చదరపు కిలోమీటర్లు (ఓఆర్‌‌‌‌ఆర్‌‌‌‌ వరకు), మొత్తం 10 వేల కిలోమీటర్లతో పైపులైన్ల వ్యవస్థ, 1300 కిలోమీటర్లు శుద్ధి చేసిన నీటిని తరలించే పైపు లైను వ్యవస్థ, మొత్తం నల్లాలు 13 లక్షలు, రోజు విడిచి రోజు వ్యక్తికి ఇచ్చే నీళ్లు 150 లీటర్లు ఇది మహానగరంలో నీటి సరఫరా వివరాలు.

ప్రభుత్వాలు కఠిన నిబంధనలు విధించాలి

 ప్రభుత్వం దాదాపు లీటరు  నీటికి రూ.50 దాకా ఖర్చు పెడుతోంది. కానీ, ప్రజలు మాత్రం విచ్చలవిడిగా నీటిని వాడేస్తున్నారు. ఒక పక్క తాగడానికి నీరు లేక ఇబ్బందులు పడుతున్న పట్టణాలు, గ్రామాల గురించి తెలుస్తున్నా ఎటువంటి చైతన్యం కూడా ఉండడం లేదు. భవిష్యత్తు తరాలకు నీటిని అందించాలన్న స్పృహ ఉండడం లేదు. ఒకప్పుడు నగరంలో 100, 200 వందల గజాల స్ధలంలో ఒక ఇల్లు మాత్రమే వుండేది. ఒక కుటుంబం మాత్రమే ఉండేది. ఇప్పుడు అదే స్ధలంలో అపార్జుమెంట్లు కట్టి నాలుగైదు కుటుంబాలు ఉండేలా నిర్మాణాలు జరుగుతున్నాయి.

దీంతో  నీటి వినియోగం పెరిగి భూగర్భ జలాలు కూడా అడుగంటిపోతున్నాయి. ఒకప్పుడు 100, 200 అడుగుల బోరు వేస్తేనే పుష్కలంగా పడుతున్న నీరు, ఇప్పుడు 1000, 2000 అడుగుల వరకు భూమిని తూట్లు పొడుస్తున్నారు. భూమి నుంచి నీటిని తోడుకోవడమే తప్ప, తిరిగి నీటిని సంరక్షించుకోవాలన్న విజ్ఞత ప్రజలకు ఉండడం లేదు. ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత ఉండాలన్న నిబంధన పాటించేవారే లేదు. వర్షపు నీటిని తిరిగి భూమిలోకి ఇంకేలా ప్రతి ఇంటి నిర్మాణం వుండాలని ప్రభుత్వాలు చెబుతున్నా పట్టించుకునేవారే లేరు.  భవిష్యత్తు యుద్దాలు నీటి కోసమే అని ఎప్పటి నుంచే పర్యావరణ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.   

మోతె రవికాంత్‌‌‌‌, వ్యవస్థాపక అధ్యక్షుడు-సెఫ్‌‌‌‌