సార్​ కల నెరవేరిందా?..నేడు జయశంకర్​ సార్​ జయంతి

  • (ఇయ్యాల ప్రొఫెసర్​ జయశంకర్​ సార్​ జయంతి సందర్భంగా..)

ఉద్యమకారుడి నుంచి మహోపాధ్యాయుడి దాకా.. ఎన్ని ఆటు పోట్లు ఎదురొచ్చినా.. ఎన్నెన్నో కుట్రల కత్తులు దూసినా..వెన్ను చూపలేదు. వెనకడుగు వేయలేదు.  ఒంటరైనా తన గళం విప్పారు. ఎలుగెత్తిన నినాదం ఆపలేదు. తెలంగాణ స్వరాష్ట్ర కలల జెండాను.. భవిష్యత్ అజెండాను వదలలేదు. తెలంగాణే శ్వాసగా.. తెలంగాణే ధ్యాసగా.. తెలంగాణ లక్ష్యంగా బతికారు. కోట్లాది సకల జనుల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. సాకారం అయ్యేదాకా బతికించారు.. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్.  స్వరాష్ట్ర సాధనలో ఆయన పాత్ర మరువలేనిది. తన జీవితం అంకితం చేసిన పోరాట యోధుడు.  ఉద్యమ స్ఫూర్తి ప్రధాతగా  ప్రజలను ముందుకు నడిపారు. ముందుండి నడిచారు.

ప్రత్యేక రాష్ట్ర కాంక్షను  నిత్యనూతనంగా ఊపిరిలూదారు. తెలంగాణ గుండెలో శాశ్వతంగా నిలిచిపోయారు. రాష్ట్ర  చరిత్రలో ఆయన నిరంతర కృషి,  దృఢసంక‌‌ల్పాన్ని ఎన్నటికీ మరువరు.  స్వరాష్ట్ర పోరులో ఉద్యమకారుడి నుంచి మహోపాధ్యాయుడి దాకా సార్ ప్రస్థానం అంచలంచెలుగా కొనసాగించారు. మొత్తంగా తెలంగాణ స్వరాష్ట్ర కలకు దిక్సూచిగా నిలిచారు. దశాబ్దాల స్వరాష్ట్ర భావజాలం వ్యాపింపజేశారు. భవిష్యత్ తరాలకు గుర్తుండిపోయేలా తన సంకల్పబలంతో నిర్విరామంగా అలుపెరుగని పోరు సాగించారు. ఎప్పటికప్పుడు తన ఆశయాలు, ఆలోచనలకు పదును పెడుతూ, స్వరాష్ట్ర సాధనకు ఆయువుపట్టుగా నిలిచారు. అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.  

భావ వ్యాప్తి చేశారు

1999లో తెలంగాణ డెవలప్‌‌మెంట్ ఫోరం ఏర్పాటులో కీలకభూమిక  పోషించారు. అమెరికాలోని ప్రముఖ నగరాల్లో  తెలంగాణ ఉద్యమ కాంక్ష, ప్రజల ఆకాంక్షలపై వివిధ కోణాల్లో వరుస ఉపన్యాసాలు ఇచ్చారు. అక్కడి ప్రజలకు తెలంగాణ ఏర్పాటు ఎందుకనే దానిపై వివరించి చెప్పారు.  తన రాతల ద్వారా, ప్రసంగాల ద్వారా స్వ రాష్ట్ర కాంక్షను ఏర్పాటు కాంక్షను బలంగా వినిపించారు.  ప్రజల్లో నిత్య చైతన్య జ్వాలను రగిలించారు. తెలంగాణ సాకారంలో యోధుడై నిలిచారు.  

దశాబ్ద కాలానికే సార్​ను మరిచారా?

పదేండ్ల స్వరాష్ట్రంలో తెలంగాణ జాతిపిత జయశంకర్ సార్​ను మరిచారా?  తెలంగాణ ప్రజల ఉనికిని..బతుకును.. అస్తిత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిన సిద్ధాంతకర్త ఆశయాలు పదేండ్లలో నెరవేరాయా? అంటే.. నెరవేరలేదనే చెప్పాలి.  స్వరాష్ట్ర అస్తిత్వాన్ని దశదిశలా నినదించిన ఆయన ఆశయాలు  విద్య, వైద్యం, వ్యవసాయం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నది ఎందుకు? పదేండ్లలో  ఉద్యోగాల భర్తీని  నిర్లక్ష్యం చేశారెందుకు?  

పదేండ్ల బీఆర్​ఎస్​ పాలనలో సార్​ ఆశయాలను పట్టించుకోలే..

రాష్ట్ర ఏర్పాటులో సార్ ఆశయ సాధన ఎలాంటిదో ప్రతి బిడ్డకు తెలుసు. తెలంగాణ స్వరాష్ట్ర సాధన పునాదులపై పుట్టిన ఉద్యమ పార్టీ అధినేతకు సార్ ఇచ్చిన సలహాలు, సూచనలు ఏమేర పనిచేశాయో కూడా తెలిసిందే.  అలాంటి మహనీయుడికి  స్వయంపాలనలో ఎలాంటి గౌరవం దక్కింది.. ఆయన కన్న కలలు ఎంతమేర నెరవేరాయనేవే ఇక్కడ ప్రశ్నలు.

స్వయంపాలనలో సార్ జయంతి  సందర్భంగా అధికార పెద్దలు ఎక్కడా కూడా ఆయన పేరు ప్రస్తావించకుండా జాగ్రత్తపడిన ఘటనలు మీడియా లోనూ.. సోషల్ మీడియాలో చూశాం. తెలంగాణ ప్రజల గురించి ఎట్టికైనా, మట్టి కైనా మనోడే ఉండాలంటే, చితి వెలిగించాలన్నా, వ్యవసాయం చేయాలన్నా మన వాళ్లే కావాలి. అని పేర్కొన్న సార్.. రాష్ట్రం వచ్చే నాటికి ఆయన సజీవంగా లేకున్నా.. తెలంగాణ బిడ్డల గుండెల్లో చిరస్థాయిగా  
నిలిచిపోయారు.

తెలంగాణ జాతిపిత

తెలంగాణ జాతిపితగానూ గుర్తింపునకు నోచుకోలేదు.  ప్రస్తుత ముఖ్యమంత్రి  రేవంత్​ రెడ్డి ఇటీవల జయశంకర్​ సార్​ను తెలంగాణ జాతిపితగా అభివర్ణించారు. అదే మాటపై నిలబడి జయశంకర్​ సార్​ను తెలంగాణ జాతిపితగా అధికారికంగా ప్రకటించాలి. ఈరోజే జయశంకర్​ సార్​ జయంతి. ఆయన్ను  తెలంగాణ జాతిపితగా అధికారికంగా ప్రకటించడానికి సరైన సందర్భం కూడా ఇదే.  ప్రస్తుత ప్రజా పాలకులు జయశంకర్ సార్ ఆశయాలకు

ఆలోచనలకు తగిన గుర్తింపును ఇవ్వాలి. పాలనలో ఆయన ఆశయాలను నెరవేర్చాలి. ఆయన ఆశయాల్లో తెలంగాణ సకల జనుల ఉచిత విద్య, వైద్యం, వ్యవసాయం ఉంది.  ఉమ్మడి రాష్ట్రంలో కోల్పోయిన ఉద్యోగాలూ ఉన్నాయి. నీటి వాటా ఉంది.  ఆ  మహనీయుడి జయంతి సందర్భంగా  తెలంగాణ జాతిపితగా  గుర్తు చేసుకుందాం. నివాళి అర్పిద్దాం.

తెలంగాణ కాలజ్ఞాని

జయశంకర్ సార్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే తెలంగాణ కాలజ్ఞాని అనడంలో  ఎలాంటి సందేహం లేదు.  స్వరాష్ట్ర సాధనకు అడ్డొచ్చిన చీకట్లను చీల్చుకుంటూ కాంతిరేఖగానూ మారారు. ఇంటర్ చదివే రోజుల్లోనే విద్యార్థిగా నిరసన గళం వినిపించా రు. తిరుగుబాటు జెండా ఎగురవేశారు. 1950లో  ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ నుంచి మొదలుకుని నాన్ ముల్కీ పోరాటాల నుంచి తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల వరకు అన్నింటా ప్రత్యక్షంగా పాల్గొన్నారు.  

అధ్యాపకుడిగా చేస్తూనే తన పోరాటాన్ని పరిశోధనలుగా చేసుకుని  ప్రజలకు అవగాహన కల్పించారు. 1969లో తొలిదశలో స్వయంగా స్వరాష్ట్ర ఆందోళనకు నాయకత్వం వహించారు. అనంతరం  ప్రజాఉద్యమంగానూ రూపొందించి ముందుకు నడిపించారు. ఇందుకు తెలంగాణ నినాదం వినిపించి న ప్రతిచోటకు వెళ్లారు. ప్రతి నాయకుడికి అండగా నిలిచారు.

- వేల్పుల సురేష్, సీనియర్ జర్నలిస్ట్