మానవాళి మనుగడలో అడవులు కీలకపాత్ర 

ప్రతి సంవత్సరం మార్చి 21న అంతర్జాతీయ అటవీ దినోత్సవంగా పాటించాలని ఐక్యరాజ్యసమితి 21 డిసెంబర్ 2012న తీర్మానించింది. ఈ తీర్మానం ముఖ్య ఉద్దేశం ఐక్యరాజ్యసమితి  సభ్య దేశాలను అడవుల పెంపకంపై ప్రోత్సహించడం. ప్రజలకు అడవుల ఆవశ్యకతపై అవగాహన కల్పించడం. మొదటి అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని 2013లో  మార్చి 21న జరుపుకున్నారు. 2024 సంవత్సరపు అంతర్జాతీయ అటవీ దినోత్సవం థీమ్ ‘ఫారెస్ట్స్​అండ్ ఇన్నోవేషన్’.

భూమి జీవావరణ వ్యవస్థలో వృక్షాలదే ప్రథమ స్థానం

భూమి ఒక అతి పెద్ద జీవావరణ వ్యవస్థ. ఈ అతి పెద్ద జీవావరణ వ్యవస్థలోనే  కొన్ని వందల చిన్న జీవావరణ వ్యవస్థలు ఇమిడి ఉన్నాయి. ఉదాహరణకు నీటి జీవావరణ వ్యవస్థ, గడ్డి భూముల జీవావరణ వ్యవస్థ.  ఎడారి జీవావరణ వ్యవస్థ మొదలగునవి. ప్రతి జీవావరణ వ్యవస్థలో  మొదటి స్థానం వృక్షాలు లేదా మొక్కలు ఆక్రమిస్తాయి. కాబట్టి, వీటిని ఉత్పత్తిదారులుగా కూడా వ్యవహరిస్తారు.

దీనికి కారణం  ప్రతి జీవావరణ వ్యవస్థ మనుగడ సాగించాలి అంటే ఆహార శక్తి,  ప్రాణవాయువు ఆక్సిజన్ అవసరం. భూమి మీద శక్తికి మూలం సౌరశక్తి.  ఈ సౌర శక్తిని ఏ జీవి కూడా ప్రత్యక్షంగా వినియోగించుకోలేవు.  సొంతంగా ఆక్సిజన్ తయారు చేసుకోలేవు. ఈ  సౌర శక్తిని కేవలం వృక్షాలు మాత్రమే కిరణజన్య సంయోగ ప్రక్రియకు  వినియోగించుకోగలవు. కిరణజన్య సంయోగ ప్రక్రియలో వృక్షాలు సూర్యకాంతి సమక్షంలో వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్,  నీటి అణువుల సహాయంతో ఆహారం తయారు చేయడంతో పాటుగా  జీవులకు కావలసిన  ప్రాణవాయువు ఆక్సిజన్ విడుదల చేస్తాయి.  వృక్షాలు తయారుచేసిన ఆహారం “ఆహార గొలుసు”(ఫుడ్ చైన్) ద్వారా భూమి మీద ఉన్న జీవులన్నిటికీ లభిస్తుంది. 

మానవాళికి కోట్ల విలువచేసే సేవలు

మనిషి రోజుకు సుమారు 2,100  రూపాయల విలువచేసే ఆక్సిజన్​ను వినియోగించుకుంటాడు. మనిషి సరాసరి జీవితకాలం 65 సంవత్సరాలుగా పరిగణిస్తే  ప్రతి మనిషికి సుమారు రూ.5 కోట్లు విలువ చేసే  ఆక్సిజన్​ను వృక్షాలు ఉచితంగా అందిస్తున్నాయి.  అమెజాన్  రెయిన్‌ ఫారెస్ట్​ను భూమి ఊపిరితిత్తులుగా పిలుస్తారు. కారణం అమెజాన్ రెయిన్‌ ఫారెస్ట్ భూమిపై దాదాపు 20% ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తోంది.

అమెజాన్ ప్రపంచంలోనే అతిపెద్ద ఫారెస్ట్. ఇది 9  దేశాల మధ్య విస్తరించి ఉంది.  ఐక్యరాజ్యసమితి పేర్కొన్న దాని ప్రకారం ప్రపంచంలోని అడవులు ఉచితంగా అందించే పర్యావరణ వ్యవస్థ సేవల ఆర్థిక విలువ సంవత్సరానికి $16.2 ట్రిలియన్ల వరకు ఉంటుంది. పర్యావరణ సేవల రూపంలో,  ఔషధాల రూపంలో ఒక వేప చెట్టు ఉచితంగా అందిస్తున్న సేవల విలువ కోట్ల రూపాయలలో ఉంటుంది.  అడవులు మానసిక ఒత్తిడిని తగ్గించడానికి మరింత సానుకూల మనోభావాలు పెంపొందించడానికి  దోహదం చేస్తాయి. 

సమాజానికి స్ఫూర్తి చిప్కో ఉద్యమం

చిప్కో ఉద్యమం అంటే చెట్లకు హత్తుకొని చెట్లను నరకకుండా వాటిని కాపాడుకోవడం.  ప్రసిద్ధ 'చిప్కో ఉద్యమం' అమృతా దేవి బిష్ణోయ్ నుంచి ప్రేరణ పొందింది. ఈ ఉద్యమం  భారతదేశంలోని రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాలోని ఖేజర్లీ అనే గ్రామంలో జరిగింది.  చిప్కో ఉద్యమం క్రీ.శ.1730 నాటిది. బిష్ణోయ్ జాతి ప్రజలు అడవి, వన్యప్రాణుల సంరక్షణ అనేది ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంగా భావిస్తారు. చెట్లు, వన్యప్రాణుల సంరక్షణ కోసం 363 మందితో కలిసి తన ప్రాణాలను త్యాగం చేసిన అమృతా దేవి బిష్ణోయ్ జ్ఞాపకార్థం భారత ప్రభుత్వం “అమృతా దేవి బిష్ణోయ్ జాతీయ అవార్డు”ను ప్రవేశపెట్టింది. బిష్ణోయ్ జాతి ప్రజలు కృష్ణ జింకను తమ ఆధ్యాత్మిక నాయకుడైన భగవాన్ జాంబేశ్వర్ గా భావిస్తారు. కృష్ణ జింకను 1998వ సంవత్సరంలో బాలీవుడ్​ నటుడు సల్మాన్ ఖాన్ వేటాడినప్పుడు బిష్ణోయ్ జాతి ప్రజలు అతన్ని కోర్టుకు ఈడ్చారు. అందుకనే బిష్ణోయ్ జాతి ప్రజలు అడవులను, వన్యప్రాణులను సంరక్షించుటలో ఆదర్శంగా నిలుస్తారు. 

అడవుల పునరుద్ధరణ భవిష్యత్తుకు కీలకం 

ప్రపంచవ్యాప్తంగా క్షీణించిన రెండు బిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధరించే అవకాశం ఉందని అంచనా. 2030 నాటికి ప్రపంచ అటవీ విస్తీర్ణాన్ని 3 శాతం పెంచాలనే యూఎన్​లక్ష్యాన్ని చేరుకోవడానికి క్షీణించిన అడవులను పునరుద్ధరించడం చాలా కీలకం.  అలా చేయడం వల్ల  నేల కోత తగ్గుతుంది. వాతావరణ మార్పులు తగ్గుతాయి.  జీవవైవిధ్యం మనుగడ సాగించగలదు. ప్రజా ఆరోగ్యం కాపాడుటలో అడవుల పాత్ర కీలకం.   పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యాన్ని గ్రహించి తద్వారా శ్వాసకోశ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. అడవులతో మానసిక, శారీరక ఆరోగ్య ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. 

ప్రపంచ అతి పెద్ద సమస్య గ్లోబల్ వార్మింగ్

వార్షికంగా మనం 7 మిలియన్ హెక్టార్లకు పైగా సహజ అడవులను నష్టపోతున్నాం. అడవులను తొలగించి ఆ భూమిని పెద్ద పెద్ద వాణిజ్య  వ్యవసాయ అవసరాల కోసం, ఇతర ఆర్థిక కార్యకలాపాలకు వినియోగించుకుంటున్నారు. అడవుల తొలగింపు వాతావరణ మార్పులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి.  గ్లోబల్ వార్మింగ్ (భూమి వేడెక్కటం) ప్రపంచానికి అతి పెద్ద సమస్య.  

దీనికి ప్రధాన కారణం వాతావరణంలో హరిత వాయువుల  పరిమాణం పెరగటం ముఖ్యంగా  కార్బన్ డయాక్సైడ్  వాయువు పరిమాణం పెరగటం. ఈ సమస్యకు పరిష్కారం శిలాజ ఇంధనాల  వాడకం తగ్గించడం,  అధికంగా అడవులను పెంచడం.  అడవులు వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్​ను గ్రహించి  గ్లోబల్ వార్మింగ్ (భూమి వేడెక్కటం) ను తగ్గిస్తుంది. అదేవిధంగా వాతావరణం వేడెక్కినప్పుడు వృక్షాలు భూమిలోని నీటిని  వేర్ల సాయంతో గ్రహించి ఆకుల ద్వారా నీటిని వాతావరణంలోకి విడుదల చేయడం ద్వారా వాతావరణం  చల్లబడుతుంది. అంటే వృక్షాలు సహజ సిద్ధమైన ఎయిర్ కండిషనర్స్​గా పనిచేస్తాయి. 

డా.శ్రీధరాల రాము,ఫ్యాకల్టీ ఆఫ్  కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్