బీజేపీ తిరుగులేని ప్రస్థానం

కులం,  మతం,  ప్రాంతం పేరు మీద రాజకీయాలు చేసే పార్టీలకు కాలం చెల్లింది. జాతీయతే ప్రధాన అంశంగా ఉన్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే.  ప్రపంచంలోనే అత్యధికంగా దాదాపు 15 కోట్లకు పైగా కార్యకర్తలు ఉన్న అతిపెద్ద రాజకీయ పార్టీ బీజేపీ. 1951లో జనసంఘ్ ​వ్యవస్థాపక సభ్యులు శ్యామా ప్రసాద్‌‌‌‌ ముఖర్జీ, దీన్​దయాళ్​ఉపాధ్యాయ, నానాజీ దేశ్​ముఖ్, వాజ్‌‌‌‌పేయి వంటి మహానేతల సారథ్యంలో జాతీయవాద రాజకీయ ప్రస్థానం మొదలైంది.  

1977లో జేపీ నేతృత్వంలో జనతా పార్టీలో జనసంఘ్​ విలీనమైంది. తదుపరి1980 ఏప్రిల్‌‌‌‌ 6న బీజేపీ ఏర్పడింది. ఈ 44 ఏండ్ల ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసింది. రెండు సార్లు వాజ్​పేయి నేతృత్వంలో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. పటిష్టంగా ఎదిగిన పార్టీ 2014 నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌‌‌‌షా నేతృత్వంలో సంస్థాగతంగా మరింత బలోపేత మైంది. దేశాన్ని సుస్థిరంగా ఏలుతున్నది.  

ఎదిగిన క్రమం..

1984 ఎన్నికల్లో బీజేపీ 2 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.1989 ఎన్నికల్లో 87 లోక్​సభ స్థానాలను గెలుచుకుంది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా లోక్​సభలో తన బలాన్ని పెంచుకుంటూ వచ్చింది. ఇపుడు తిరుగులేని జాతీయపార్టీగా మారింది. 1996లో జరిగిన లోకసభ ఎన్నికల్లో బీజేపీ బలం 161 స్థానాలకు పెరిగింది. అటల్‌‌‌‌ బిహారి వాజ్‌‌‌‌పేయి ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. అయితే లోక్‌‌‌‌సభలో  మెజారిటీ  లేక ఆ ప్రభుత్వం 13 రోజులకే పతనమైంది. 1998లో మధ్యంతర ఎన్నికల్లో,  ఎన్డీయే కూటమిని ఏర్పాటు చేసిన బీజేపీ మెజారిటీ స్థానాలు గెలుచుకుంది. మళ్లీ వాజ్‌‌‌‌పేయి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.  అన్నాడీఎంకే  మద్దతు ఉపసంహరించుకోవడంతో వాజ్‌‌‌‌పేయి ప్రభుత్వం 13 నెలలకే  గద్దె దిగాల్సి వచ్చింది. 1999లో ఎన్డీయే కూటమి పూర్తి మెజారిటీ సాధించింది.  2004లో ఎన్టీయే కూటమి ఓటమిపాలైనా బీజేపీకి 138 సీట్లు వచ్చాయి.

2009 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ బలం 116 స్థానాలకు పరిమితమైంది. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో అసాధారణ రీతిలో 282 స్థానాలతో సంపూర్ణ మెజారిటీ సాధించింది. 2019లో 303 స్థానాలు సాధించింది.  నరేంద్ర మోదీ  ప్రధానమంత్రి అయ్యారు.    ప్రపంచంలోకెల్లా అత్యధిక కార్యకర్తలున్న రాజకీయ పార్టీగా బీజేపీ రికార్డు సృష్టించింది.  చైనాలో కమ్యూనిస్టు పార్టీ 8.8 కోట్ల మంది సభ్యులతో అతి పెద్ద రాజకీయ పార్టీగా రికారుల్లో ఉంది. ఆ రికార్డును బీజేపీ బద్దలు కొట్టింది.  ప్రస్తుతం బీజేపీ  సభ్యుల సంఖ్య సుమారు 15కోట్ల పైనే.  దశాబ్ద కాలంగా అనేక సంస్కరణలతో నరేంద్ర మోదీ ప్రభుత్వం సబ్‌‌‌‌ కా సాత్‌‌‌‌,  సబ్‌‌‌‌ కా వికాస్‌‌‌‌,  సబ్‌‌‌‌ కా విశ్వాస్‌‌‌‌,  సబ్ కా ప్రయాస్ నినాదంతో ముందుకు వెళ్తున్నది. 

ట్రిపుల్‌‌‌‌ తలాక్​ రద్దు

ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ చట్టాన్ని ఆమోదింపజేసి ట్రిపుల్‌‌‌‌ తలాక్​ను రద్దు చేయడం ద్వారా కోట్లాది ముస్లిం మహిళల జీవితాల్లో వెలుగు నింపింది మోదీ ప్రభుత్వం. పాకిస్తాన్‌‌‌‌, అఫ్గనిస్తాన్‌‌‌‌, బంగ్లాదేశ్‌‌‌‌లోని హిందువులు,  సిక్కులు,  బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రైస్తవులు ఈ  ఆరు మతాలకు చెందిన  మైనారిటీలు ఆయా దేశాల్లో మతపరమైన పీడనకు గురై మన దేశానికి శరణార్థులుగా వస్తే వారికి భారతదేశ పౌరసత్వం కల్పించడం పౌరసత్వ సవరణ చట్టం ముఖ్య ఉద్దేశ్యం.  చొరబాట్లను నియంత్రించి, దేశ ప్రజలకు భద్రతను కల్పించేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకురావడం జరిగింది. భారతదేశ పర్యాటక అభివృద్ధి, ఆర్థిక పరిపుష్టి  కోణంతో పాటు మన సాంస్కృతిక వైభవ ప్రాభవాన్ని ప్రపంచ నలుదిశలా పెంచుతుంది.   అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా నడిపి  దేశాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడంలో మోదీ అనేక విజయాలు సాధించారు.

జీ20 అధ్యక్షతతో అగ్రస్థాయి

జీ20 అధ్యక్షత బాధ్యతలలో భాగంగా ఇదే దృక్పథంతో మహిళా నాయకత్వానికి అగ్ర ప్రాధాన్యమిస్తూ అంతర్జాతీయ సమాజానికి కొత్త దిశను నిర్దేశించాలని భారత్ నిర్ణయించింది. 10 సంవత్సరాలుగా ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలన,  బలమైన విదేశాంగ విధానం, అద్భుతమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి, సులభతర వ్యాపారం కోసం తీసుకొచ్చిన సంస్కరణలు భారతదేశాన్ని నేడు  ప్రపంచపటంలో అగ్రశ్రేణిగా నిలబెట్టింది.  అవినీతిపై పోరు నుంచి ముస్లిం మహిళలకు రక్షణగా ఉండే ట్రిపుల్‌‌‌‌ తలాక్‌‌‌‌ రద్దు చట్టం వరకు, కాశ్మీర్‌‌‌‌ నుంచి రైతు సంక్షేమం వరకు ఇలా ప్రజల కోసం పని చేయాలనుకునే ప్రభుత్వం, ప్రజలు కోరుకున్న మోదీ ప్రభుత్వం ప్రజల మన్ననలను పొందడమే కాకుండా సామాన్య ప్రజలకు చేరువైంది.  73 ఏళ్లు  జనసంఘ్​/ బీజేపీల సుదీర్ఘ జాతీయవాద రాజకీయ ప్రయాణం ఈ దేశానికి దిశానిర్దేశం చేయగలుగుతున్నది. దేశం సుస్థిరంగా, ప్రజలు సుపరిపాలనతో ఎదగాలంటే, ఈదేశానికి ఒక రాజకీయ పార్టీగా బీజేపీ ఎప్పుడూ అవసరమే.

సాధించిన విజయాలు

శ్రీరామచంద్రుడి జన్మస్థానం అయోధ్యలో భవ్యరామమందిర నిర్మాణం, దివ్య బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠతో
140 కోట్ల భారతీయుల కల సాకారమైంది. జమ్మూ కాశ్మీర్‌‌‌‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌‌‌‌ 370ని రద్దు చేశారు. కాశ్మీర్‌‌‌‌ను భారతదేశం నుంచి వేరుపరిచేందుకు జరిగిన కుట్రలు, కుతంత్రాలకు నరేంద్ర మోదీ ప్రభుత్వం చరమగీతం పాడింది. ఒకే దేశం, ఒకే జెండా, ఒకే రాజ్యాంగం అనే ఈ నిర్ణయం జాతీయ సమగ్రతను బలపరిచి అఖండ భారత్‌‌‌‌గా నిలిచేలా చేసింది.

- బింగి కరుణాకర్,
రంగాపూర్, కరీంనగర్ జిల్లా

  • Beta
Beta feature
  • Beta
Beta feature