అట్టహాసంగా విశ్వక్రీడల సంబురం.. ఒలింపిక్స్‌లో మన ప్రతిభ చాటాలి

ప్రపంచ క్రీడా పండుగ ఒలింపిక్స్.  విశ్వక్రీడల సంబురం అట్టహాసంగా షురూ అయింది. ఈసారి యూరప్  దేశమైన  ఫ్రాన్స్ ఒలింపిక్స్​కు వేదికైంది. లవ్ ఆఫ్​ సిటీగా పేరుపొందిన ప్యారిస్​ ఈ వేడులకు ఆతిథ్యమిస్తోంది. 1900లో తొలిసారిగా ఆధునిక ఒలింపిక్స్ షురూ చేసిన తొలి దేశం కూడా ఇదే.  వందేండ్ల తర్వాత ముచ్చటగా మూడోసారి  నిర్వహిస్తోంది.  జులై 26 నుంచి  ఆగస్టు11 తేదీల మధ్య  జరిగే  ఒలింపిక్స్ లో ప్రపంచస్థాయి క్రీడాకారులెందరో  పాల్గొంటున్నారు.  

వివిధ  క్రీడాంశాల్లో  నువ్వా.. నేనా.. అన్నట్టుగా పోటీపడి పతకాలు సాధిస్తుంటారు.  ఈసారి ఒలింపిక్స్ లో  పలు ప్రత్యేకతలు ఉన్నాయి.  తొలిసారి 200లకుపైగా దేశాల నుంచి 10 వేలమందికిపైగా క్రీడాకారులు పాల్గొంటున్నారు. పురుష క్రీడాకారులతో సమానంగా 5 వేల మందికిపైగా మహిళా క్రీడాకారిణులు పాల్గొంటుండడం విశేషం.  ఇలాంటి ప్రత్యేకతలకు ప్రస్తుత ఒలింపిక్స్ వేదికగా నిలిచింది.

ఇక ప్రతి నాలుగేండ్లకు ఒకసారి జరిగే ఒలింపిక్స్ పతకాల వేటకు మనదేశం కూడా క్రీడాకారులను పంపింది.  స్వాతంత్య్రానికి ముందు బ్రిటీష్ హయాంలో 1900 సంవత్సరం నుంచే  భారత్​ ఒలింపిక్స్​లో  పాల్గొంటోంది. వందేండ్లుగా క్రీడాకారులను పంపుతున్నా పతకాలు సాధించే దేశాల జాబితాలో మన ర్యాంక్  నామమాత్రంగానే ఉంది.

ఒలింపిక్స్​కు  భారత్ ఆతిథ్యమిచ్చేనా?

మనదేశం ఇప్పటికే  క్రికెట్ ప్రపంచ కప్​లు,  ప్రపంచ హాకీ కప్, ఒకసారి ఆసియా క్రీడలు,  కామన్​వెల్త్  గేమ్స్​ వంటి అంతర్జాతీయ క్రీడల పోటీలకు ఆతిథ్యమిచ్చింది.  ఒలింపిక్స్ మాత్రం నిర్వహించలేక పోయింది. యూరప్​లోని చిన్నదేశమైన గ్రీస్  రెండు దశాబ్దాల కిందటే విశ్వక్రీడలకు ఆతిథ్యమిచ్చింది. అమెరికా నాలుగుసార్లు నిర్వహించి..  ఎక్కువసార్లు ఆతిథ్యమిచ్చిన దేశంగా నిలిచింది.

దక్షిణాసియా దేశాల్లో చూస్తే.. జపాన్,  దక్షిణకొరియా, చైనా కూడా ఒలింపిక్స్​ నిర్వహించాయి. భారత్​ మాత్రం ఆ దిశగా దృష్టి సారించడంలేదు. ఇప్పటికిప్పుడు నిర్వహణకు సిద్ధపడినా 2036 వరకూ ఆ చాన్స్ లేదు. 2028లో  ఇటలీ,  2032లో ఆస్ట్రేలియా ఆతిథ్య దేశాలుగా ఖరారు అయ్యాయి.  

ఆతిథ్య దేశం ఎంపిక ఇలా..

ఒలింపిక్స్ నిర్వహణకు ఆసక్తి చూపే దేశాలు ముందుగా బిడ్​లను అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ( ఐఓసీ)కి అందజేస్తాయి.  వివిధ దశల్లో వడపోత తర్వాత నిర్వహణ దేశాన్ని ఎంపిక చేస్తారు. ఇది కూడా ఏడేండ్ల ముందే నిర్ణయిస్తారు. ఐఓసీ సభ్య దేశాల ప్రతినిధులు రహస్య బ్యాలట్ ఓటు ద్వారా ఎన్నుకుంటారు.  ప్రస్తుతం ఐఓసీలో 100 మందికి పైగా సభ్యులుంటే.. భారత్ నుంచి నీతా అంబానీ మెంబర్​గా ఉన్నారు.  ఒలింపిక్స్ నిర్వహణకు పోటీ పడే దేశం ముందుగా.. 
రూ. కోటిన్నరకు పైగా  ఫీజు చెల్లించాలి.

అనంతరం పోటీ పడే దేశాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్రీడా స్టేడియాలు, సదుపాయాలూ ఉన్నాయా లేవా అని పరిశీలిస్తారు. వేల సంఖ్యలో వచ్చే అథ్లెట్లు, లక్షల సంఖ్యలో తరలివచ్చే క్రీడా అభిమానులే కాకుండా.. క్రీడలకు సంబంధించిన వివిధ రంగాలకు చెందిన నిపుణులు, అతిథులు, అంతర్జాతీయ మీడియా వంటి రంగాల నుంచి వచ్చేవారికి వసతి, భద్రత సదుపాయాలు, ట్రాన్స్ పోర్ట్ వంటి వాటిని కూడా పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేస్తారు. ఒలింపిక్స్​కు  రూ. లక్ష కోట్లకుపైగా  నిధులు ఖర్చు అవుతాయి. ఇలాంటి ప్రాధాన్యత అంశాలనూ ఐఓసీ పరిగణనలోకి తీసుకుంటుంది.  ఇకనైనా ఒలింపిక్స్ నిర్వహణలో మనదేశం నిర్వహించే స్థాయిలో ఉందో లేదో  మన పాలక ప్రభుత్వాలు ఆత్మపరిశీలనలు, సమాలోచనలు చేసుకోవాల్సి ఉంది. 

పుష్కలమైన మానవ వనరులున్నా..

దేశంలో పుష్కలమైన మానవ వనరులు ఉన్నాయి. ఏ దేశానికీ లేని యువ శక్తి సామర్థ్యాలను కలిగి ఉన్నాం. అయినా.. ఒలింపిక్స్ నిర్వహణలో.. పతకాల సాధనలో ఇంకా వెనకబడే ఉన్నాం.  గ్రామీణ స్థాయి నుంచే.. పాఠశాల చదువుల్లో  క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇచ్చే పరిస్థితులు ఎన్నడో సన్నగిల్లాయి. పాఠశాల స్థాయిలో వ్యాయామ విద్యకు పాలకుల ఆదరణ కరువైంది.  

దేశంలో క్రీడలు అంటే క్రికెట్,  హాకీనే చూస్తాం. ఈ రెండింటి పైనే ప్రభుత్వాలు కూడా ఎక్కువగా దృష్టిపెడతాయి. నిధులు ఖర్చు చేస్తాయి. క్రికెట్ మ్యాచ్ అవుతుందంటే..రాష్ట్రపతి, ప్రధానమంత్రి స్థాయి వంటి వ్యక్తులు కూడా స్టేడియానికి వెళ్లి వీక్షిస్తుంటారు. మన దేశ క్రీడల పరిస్థితికి అద్దంపట్టే నిదర్శనం ఇది. మిగతా ఆటలపై ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తుంటాయి.  

క్రీడాకారులు తమ ప్రతిభతో అంతర్జాతీయ పతకాలు, గుర్తింపు సాధించినప్పుడు తప్ప  మౌలిక సదుపాయాలు కూడా పెద్దగా కల్పించవు.  మొత్తంగా చూసుకుంటే క్రీడల పట్ల  ప్రభుత్వాలు ఉదాసీనత ప్రదర్శిస్తుంటాయి. ముఖ్యంగా క్రీడల్లో రాజకీయవ్యవస్థ పాతుకుని ఉండడం ప్రధాన వైఫల్యంగా చెప్పవచ్చు.

కోట్లాది ప్రజల ఆకాంక్ష నెరవేరెదెన్నడో...

 భారత వందేండ్ల ఒలింపిక్స్ చరిత్రను పరిశీలిస్తే..ఇండియాకు వచ్చిన స్వర్ణ పతకాలు 10 మాత్రమే.  బ్రిటీష్ హయాంలో హాకీ తొలిసారి ఒక స్వర్ణం సాధిస్తే.. స్వతంత్ర దేశంలో వరుసగా మూడుసార్లు స్వర్ణ పతకాలు గెలుచుకుంది.  ఇప్పటివరకూ భారత్​కు అత్యంత విజయవంతమైన ఒలింపిక్స్​ అంటే 2020  టోక్యో ఒలింపిక్స్. ఇందులో జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్​చోప్రా స్వర్ణం సాధించగా.. మరో ఏడు పతకాలు గెలుచుకున్నాం.

ఈసారి ప్యారిస్  ఒలింపిక్స్​లో భారత్​నుంచి 117 మంది క్రీడాకారులు.. 16 క్రీడాంశాల్లో పోటీపడనున్నారు.  గతం కంటే పారిస్ ఒలింపిక్స్​ పతకాల సంఖ్య రెండంకె
ల్లోకి వస్తుందని ఆశిస్తున్నారు. ఇలాంటి అంచనాలు, ఆశలు క్రీడాభిమానుల్లో.. దేశ ప్రజల్లో నెలకొని ఉన్నాయి.

– వేల్పుల సురేష్,  సీనియర్ జర్నలిస్ట్