భాగ్యనగరంలో బోనాల సందడి

ఆషాఢ మాసం వచ్చిందంటే భాగ్యనగరం బోనాల జాతరతో సందడిగా ఉంటుంది.  రేపటి నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో బోనాల జాతర జరగబోతోంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ఆషాఢ మాసం బోనాల జాతర. ఈ జాతర గ్రామ దేవతలకు జరిపే పండుగ. బోనం అంటే భోజనం అని అర్థం. అమ్మవారికి సమర్పించే నైవేద్యాన్ని బోనం అంటారు. 

కొత్త మట్టి లేదా ఇత్తడి కుండలో పాలు, బెల్లం, బియ్యం వేసి పరమాన్నం చేస్తారు. వేప ఆకులు, పసుపు, కుంకుమతో కుండను అలంకరిస్తారు. మహిళలు అందంగా ముస్తాబై తల మీద బోనాన్ని ఎత్తుకొని ఆలయాలకు వెళతారు. గ్రామ దేవతలైన ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, పెద్దమ్మ, పోలేరమ్మ, అంకాలమ్మ, మారెమ్మలకు బోనాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. పోతురాజు లేకుండా బోనం సందడే ఉండదు. తెలంగాణ ప్రజలు ఎంతో ఉత్సాహంతో బోనాల జాతరను జరుపుకుంటారు.

- కూర సంతోష్,  సీనియర్ జర్నలిస్ట్