TheGreatestOfAllTime Review: ది గోట్‌ మూవీ రివ్యూ..విజయ్ సైన్స్ ఫిక్షన్ థ్లిల్లర్ ఎలా ఉందంటే?

దళపతి విజయ్ (Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ 'ది గోట్' (The Greatest of All Time). మీనాక్షి చౌదరి హీరోయిన్. వెంకట్ ప్రభు దర్శకుడు. ఇవాళ గురువారం (సెప్టెంబర్ 5న ) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయింది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ తండ్రి కొడుకులుగా కనిపించాడు. పాటలకు, టీజర్, ట్రైలర్  విజువల్స్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.అంతేకాకుండా ఈ సినిమా విజయ్ కి చివరి సినిమా అనే ప్రచారం కూడా ఉంది.మరి ఇన్ని అంచనాలతో ఆడియన్స్ ముందుకొచ్చిన ‘గోట్‌’ ఎలా ఉంది? ఆ అంచనాలను అందుకుందా..విజయ్ డ్యూయల్ రోల్ లో ఎలా మెప్పించాడో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. 

కథేంటంటే::

గాంధీ (విజయ్) నిజాయితీ పరుడు. ఇండియా తరఫున స్పెషల్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్కాడ్‌లో అతనో రహస్య ఉద్యోగి. గాంధీ తన టీమ్  సునీల్ ( ప్రశాంత్), అజయ్ (అజ్మల్), కళ్యాణ్ సుందరం (ప్రభుదేవా)తో కలిసి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ గా స్పెషల్ మిషన్స్ చేస్తూ ఉంటాడు. ఈ విషయం వాళ్ళ ఇళ్లల్లో కూడా తెలీదు. ఓ మిషన్‌పై కెన్యాలో తన మిత్రుడితో కలిసి చేసిన ఓ ఆపరేషన్‌లో పేరు మోసిన మాఫియా డాన్‌ మీనన్‌(మైక్‌ మోహన్‌)ని అనుకోకుండా చంపేస్తాడు.

ఆ తర్వాత థాయిలాండ్ లో జరిగే మరో మిషన్ కి గాంధీ కడుపుతో ఉన్న తన భార్య(స్నేహ), కొడుకు జీవన్‌ని తీసుకెళ్లాల్సి వస్తుంది. ఆ సమయంలో వారిపై అటాక్ జరగడం, తన భార్యకి తనేం చేస్తాడో తెలియడం, తన కొడుకు తప్పిపోవడం జరుగుతాయి. అయితే తన కొడుకు ఒక యాక్సిడెంట్ లో చనిపోయాడని అందరూ అనుకుంటారు. కానీ కొన్నేళ్ళ తర్వాత తన పోలికలతో ఉన్న మరో వ్యక్తి సంజయ్ (విజయ్)ను కలుస్తాడు గాంధీ.  దీంతో ఆ ఫీల్డ్ కి దూరమయి, భార్య, కూతురుకు దూరమయి బతుకుతుంటాడు.

ఇలాంటి టైంలో గాంధీ ఒకపని మీద మాస్కోకి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్ లో చనిపోయిన తన కొడుకు ఎదురువుతాడు. తన కొడుకే మళ్లీ వచ్చాడని నమ్ముతాడు గాంధీ. ఓ రౌడీ బృందం ఉచ్చులో చిక్కుకొని ఉన్న త‌న బిడ్డ‌ను కాపాడి భార‌త్‌కు తీసుకొస్తాడు. కొడుకు రాక‌తో గాంధీ కుటుంబం మ‌ళ్లీ క‌లుస్తుంది. ఇక అంతా బాగుంద‌నుకున్న టైమ్‌లో గాంధీ స్క్వాడ్ టీమ్ బాస్ న‌జీర్ (జ‌య‌రామ్‌)ను ఎవ‌రో చంపేస్తారు. ఆ త‌ర్వాత ఆ టీమ్‌లోని ఒక్కొక్కరూ వ‌రుస‌గా హ‌త్య‌కు గుర‌వుతుంటారు. మ‌రి ఈ హ‌త్య‌ల‌కు కార‌ణ‌మెవ‌రు? జీవ‌న్‌కు ఈ హ‌త్య‌ల‌కూ ఉన్న లింకేంటి?

అసలు 16 ఏళ్ళు కనిపించని కొడుకు ఒక్కసారిగా ఎక్కడ్నుంచి వచ్చాడు..? తండ్రీకొడుకుల మధ్య ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయి? మిషన్ లో భాగంగా గాంధీపై అటాక్ చేసే ఆ వ్యక్తి ఎవరు? జీవన్ తిరిగొచ్చాక గాంధీ లైఫ్ లో ఎలాంటి మార్పులు వచ్చాయి? జీవ‌న్‌ను పెంచి పెద్ద చేసిన మేన‌న్ (మోహ‌న్‌)కు.. గాంధీకీ ఉన్న విరోధం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే  ది గోట్  తెరపై చూడాల్సిందే.

ఎలా ఉందంటే::

విజయ్ సినిమా అంటేనే ఫ్యాన్స్‌కు సెలబ్రేషన్. ఇది పూర్తిగా విజయ్‌ మార్క్‌ సినిమా. ఒక్కడే భుజాలపై సినిమాను మోశాడనాలి. ఇక కథ ఎలా ఉందంటే..దేశ ర‌క్ష‌ణ కోసం ఎంత‌కైనా తెగించే ఓ ఏజెంట్ క‌థ ఇది. అనుకోని ప‌రిస్థితుల్లో అత‌ను ఓ మిష‌న్‌లో త‌న కొడుకును కోల్పోవ‌ల‌సి రావ‌డం.. క‌ట్ చేస్తే ఆ కొడుకే 15ఏళ్ల త‌ర్వాత త‌న పాలిట య‌ముడిలా మారి దేశానికి పెను స‌మ‌స్య‌లా మార‌డం..ఇవ్వన్నీ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో నడిపించడం బాగుంది. ముఖ్యంగా ఆ నెగిటివ్‌ షేడ్‌లో విజయ్ అయితే అదరగొట్టేశాడు. అయితే.. సినిమా నిడివి పెద్దది కావడంతో ల్యాగ్‌ ఎక్కువగా అనిపిస్తుంది. 

ఫస్టాఫ్ విషయానికి వస్తే..గాంధీ గురించి, గాంధీ చుట్టూ పక్కల పాత్రలు ఎస్టాబ్లిష్ చేయడం, కొడుకు తప్పిపోవడం పెద్దయ్యాక కొడుకు మళ్ళీ తిరిగి రావడంతో సాగుతుంది.మాస్కోలోని విల‌న్ గ్యాంగ్‌తో గాంధీ చేసే ఛేజింగ్ యాక్ష‌న్ సీక్వెన్స్ అల‌రిస్తుంది. విరామానికి ముందు జీవ‌న్ పాత్రతో ద‌ర్శ‌కుడు ఇచ్చిన ట్విస్ట్ ఆస‌క్తిరేకెత్తిస్తుంది. దానికి ముందు తండ్రీకొడుకులు మ‌ధ్య మెట్రోలో జ‌రిగే యాక్ష‌న్ సీక్వెన్స్ హైలైట్‌.

సెకండాఫ్లో తండ్రీకొడుకుల మ‌ధ్య పోరు ఎలా ఉండ‌నుందా? అన్న ఆస‌క్తి ప్రేక్ష‌కుల్లో మొద‌లైపోతుంది. అందులో భాగంగానే గాంధీ, జీవన్ మధ్యలో జరిగే సంఘటనలు..ఎత్తుకుపైఎత్తు అన్నట్టు సాగుతాయి. గాంధీ తన కొడుకే విలన్ అని ఎలా కనిపెట్టాడు, ఏం చేసాడు అనేది కొంచెం ఆసక్తిగానే చూపించారు. అలాగే రెగ్యులర్ కథే కావడం, ట్విస్ట్ లు ముందే ఊహించడం ఒక్కటి మైనస్ అనిపిస్తోంది. క్లైమాక్స్‌లో వ‌చ్చే యాక్ష‌న్ సీక్వెన్స్‌.. దానితో ముడిప‌డి సాగే ఐపీఎల్ ట్రాక్ ప్రేక్ష‌కుల్లో కాస్త జోష్‌ను నింపుతాయి. ధోని ఫ్యాన్స్ కి మాత్రం మంచి ఫీస్ట్ ఉంటుంది. క్లైమాక్స్ ఎపిసోడ్ అదిరిపోయింది. ముఖ్యంగా స్టార్టింగ్ లో హీరో విజయ్.. దివంగత కెప్టెన్ విజ‌య్‌కాంత్ లుక్‌లో ఎంట్రీ ఇచ్చిన తీరు ప్రేక్ష‌కుల్ని బాగా అల‌రిస్తుంది. 

ఎవ‌రెలా చేశారంటే: 

విజయ్ స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది. మల్టీ టాలెంట్‌కు పేరొందిన దళపతి విజయ్ మరోసారి తన యాక్టింగ్ తో ఇరగదీసాడు. కథ, కథనాలు ఎలాగున్నా..విజయ్‌ మాత్రం తన నటనతో సినిమాను మరోస్థాయిలో నిలబెటట్టాడు. తండ్రీకొడుకులుగా విజ‌య్ ద్విపాత్రాభిన‌యం ఆక‌ట్టుకుంటుంది. స్నేహ డీసెంట్‌ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. స్నేహ కొన్ని సీన్స్ లో ఎమోషనల్ గా మెప్పిస్తుంది యూత్ క్రష్ మీనాక్షి చౌదరి అందాల ఆరబోతకే పరిమితం అయ్యింది. స్క్వాడ్ ఏజెంట్స్‌గా జ‌య‌రామ్‌, ప్ర‌భుదేవా, ప్ర‌శాంత్‌, అజ్మ‌ల్ పాత్ర‌లు ప‌రిధి మేర‌కు ఉన్నాయి. కమెడియన్స్ యోగిబాబు, ప్రేమ్ జీ అమరన్ రెండు మూడు చోట్ల నవ్వించారు.

సాంకేతిక అంశాలు::

సినిమాటోగ్రఫీ సిద్ధార్థ్‌ నూని విజువల్స్ బాగున్నాయి. యువన్ శంకర్ రాజా పాటలు పెద్దగా ఆకట్టుకోవు కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయింది. వెంకట్‌ రాజన్‌ ఎడిటింగ్‌ బాగున్నా .సినిమా లెంత్ అవ్వడం వల్ల కాస్తా వీక్ అనిపించేలా ఉంది. డైరెక్టర్ గా వెంకట్ ప్రభు  సక్సెస్ అయ్యాడు. విజ‌య్ యంగ్ లుక్ కోసం ద‌ర్శ‌కుడు వెంకట్ ప్రభు  వాడిన టెక్నాల‌జీ కొన్ని చోట్ల తేడా కొట్టింది. గతంతో వచ్చిన సినిమాలతో పోలిస్తే ఇది చాలా బెటర్ అనే చెప్పుకోవాలి. అలాగే డైరెక్టర్ కథలో ఎమోషన్స్ పెట్టి ఉంటే మరోలా ఉండేది.నిర్మాణ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాకి బాగానే ఖర్చుపెట్టారు.