ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ పుష్ప2 : ది రూల్ (Pushpa 2 The Rule). భారీ అంచనాల మధ్య ఇవాళ గురువారం (2024 డిసెంబర్ 5న) 12,500 థియేటర్లలో ప్రేక్షుకుల ముందుకొచ్చింది. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న నటించగా.. శ్రీలీల స్పెషల్ సాంగ్ చేసింది. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, అనసూయ, సునీల్ కీలక పాత్రలు పోషించారు.
దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో మైత్రి మూవీ మేకర్స్ పుష్ప 2 మూవీని రూపొందించింది. ఈ సారి నేషనల్ కాదు.. ఇంటర్నేషనల్.. ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అంటూ ఆడియన్స్ ముందుకొచ్చిన పుష్ప 2 ఎలా ఉంది? రూ.1,500 కోట్ల వరకూ బాక్సాఫీస్‌ను రూల్ చేసే సత్తా పుష్ప 2 కంటెంట్‌లో ఉందా? లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం.
కథేంటంటే::
పుష్ప పార్ట్ 1 పూర్తయిన కొన్ని వారల తర్వాత పుష్ప పార్ట్ 2 స్టార్ట్ అవుతుంది. పుష్పరాజ్ (అల్లు అర్జున్) కూలీగా ప్రయాణం మొదలుపెట్టి ఎర్రచందనం సిండికేట్ సామ్రాజ్యానికి తిరుగులేని నాయకుడిగా మారతాడు. తన దారికి ఎవ్వరు అడ్డొచ్చిన తనదైన మార్క్‌తో దూసుకెళ్లిపోవడం అతనికి అలవాటు. వారు ఎంత పెద్దోళ్ళయినా తగ్గేదేలే అంటూ ఢీ కొట్టడమే అతడికి తెలుసు. ఈ క్రమంలో పుష్ప రాజ్‌కు ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ (ఫాహద్ ఫాజిల్) అడ్డు తగులుతాడు. ముందే భన్వర్ సింగ్‌ని పుష్ప ఘోరంగా అవమానించడంతో అతను ప్రతీకారం కోసం ఎదురుచూస్తుంటాడు. పుష్ప రాజ్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎర్రచందనం స్మగ్లింగ్‌కు షెకావత్ అడుగడుగునా అడ్డు తగులుతుండడం.. సిండికేట్‌లో కీలకమైన వ్యక్తిని చంపేయడంతో సమస్య తలెత్తుతుంది.
Also Read : పుష్ప 2 ప్రీమియర్స్‌కి కలెక్షన్ ఎంత వచ్చింది
తన స్మగ్లింగ్‌ని దేశం మొత్తం విస్తరిస్తూనే.. పుష్ప రాజ్ అటు భార్య శ్రీవల్లీ (రష్మిక)తో వ్యక్తిగతం జీవితాన్ని హ్యాపీగా సాగిస్తుంటాడు. పుష్ప బయట ఫైర్ కానీ.. ఇంట్లో మాత్రం పెళ్లాం శ్రీవల్లి మాట జవదాటడు. తను ఏం చెప్పిన అది చేసేయడం పుష్ప రాజ్ సొంతం. ఈ క్రమంలో ఎంపీ సిద్దప్ప(రావు రమేశ్) అండతో తన స్మగ్లింగ్ వ్యాపారానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకుంటాడు. సిద్ధప్ప కూడా తన పార్టీకి పుష్ప ద్వారా ఫండ్ ఇప్పిస్తుంటాడు.
అలా ఓ సారి చిత్తూరుకి వచ్చిన ముఖ్యమంత్రి నరసింహారెడ్డిని కలిసేందుకు పుష్పరాజ్ వెళ్తాడు. శ్రీవల్లి తన భర్త పుష్పని ముఖ్యమంత్రితో ఫోటో దిగి రమ్మని ఒక కోరిక కోరుతుంది. సిద్దప్పతో పాటు ముఖ్యమంత్రిని కలుస్తాడు పుష్ప. కానీ ఒక స్మగ్లర్‌తో ఫోటో దిగితే రాజకీయంగా కొంపలంటుకుంటాయని చెప్పి..ఫోటో దిగడానికి సీఎం ఒప్పుకోడు. అంతేకాకుండా శ్రీవల్లీని అవమానించేలా మాట్లాడుతాడు. దాంతో పుష్ప ఈగో హర్ట్ అవుతుంది. సీఎంను ఆ కుర్చీలోంచి దించేసి ఆ పదవిలో సిద్ధప్పను (రావురమేష్) కూర్చోపెట్టాలని పుష్ప నిర్ణయించుకుంటాడు. అందుకోసం పుష్ప రాజ్ ఎలాంటి డీల్ చేస్తాడు?
ఈ క్రమంలోనే కేంద్రమంత్రి ప్రతాప్‌రెడ్డి(జగపతి బాబు), పుష్పరాజ్ మధ్య ఎందుకు గొడవ వచ్చింది? ప్రతాప్‌రెడ్డి తమ్ముడు కొడుకు (తారక్ పొన్నప్ప) పుష్పరాజ్‌పై వైరం పెంచుకోవడానికి గల కారణం ఏంటి? తనను తప్పించి సిండికేట్ లీడర్‌గా ఎదిగిన పుష్పరాజ్‌ను ఎలాగైనా అణగతొక్కలనే పగతో ఉన్న మంగళం శ్రీను(సునీల్), దాక్షాయణి(అనసూయ)ల ఎత్తుగడలు ఏంటి?
షెకావత్‌ని ఢీ కొంటూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని పుష్ప ఎలా విస్తరించాడు? జపాన్‌లో పుష్పరాజ్‌కు ఎదురైన సమస్య ఏమిటి? సవతి అన్నయ్య (అజయ్) కెలుకులాటతో ఇంటిపేరును ఎలా దక్కించుకున్నాడు? చివరకి పుష్పని తన తమ్ముడిగా అజయ్ ఒప్పుకున్నాడా? లేదా అనే తదితర ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమాను థియేటర్లో చూడాల్సిందే.
ఎలా ఉందంటే::
కొన్ని సినిమాలకు కథతో అక్కర్లేదు. ప్రమోషన్స్‌తో అసలే అక్కర్లేదు. అలాంటి బ్రాండ్ తోనే వచ్చిన మూవీ పుష్ప 2. సరిగ్గా ఈ మూవీలో కథ కంటే కథనంతోనే దర్శకుడిగా సుకుమార్ ఎక్కువగా మ్యాజిక్ చేశారు. ఇందులో పుష్ప రాజ్ పాత్రను మరింత పదునుగా చెక్కారు సుకుమార్. ఎవ్వరు గుర్తించని ఒక కూలీగా మొదలుపెట్టి సిండికేట్ సామ్రాజ్యాన్ని విస్తరించే నాయకుడిగా గుర్తించబడ్డ పుష్ప రాజ్ జర్నీఈ స్టొరీ. పార్ట్ 1 లో ఎర్రచందనం సిండికేట్‌కి ఛైర్మన్‌గా ఎదిగిన క్రమం తెలుగుతో పాటు ఇతర భాషల ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది.
హీరో అంటే.. మంచివాడై ఉండాలి. చెడ్డపనులు చేసే విలన్స్‌ను చితకబాది సమాజానికి మంచి చేయాలి. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు హీరోయిజం మారింది. హీరోలోనూ ఓ విలన్ ఉంటున్నాడు. పాజిటివ్, నెగిటివ్ రెండూ తనలోనే ఉంటున్నాయి. అలాంటి హీరోయిజమే ఇప్పుడు ప్రేక్షకులను మెప్పిస్తోంది... బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొడుతోంది. సరిగ్గా అలానే ఉంది పుష్ప 2. పుష్ప రాజ్ పాత్ర.
ఇంటర్నేషనల్ టచ్ ఇస్తూ సినిమాని స్టార్ట్ చేసిన దర్శకుడు అడుగడుగునా ఎలివేషన్స్‌తో కట్టిపడేసే ప్రయత్నం చేశాడు. పుష్ప రాజ్-షెకావత్ మధ్య జరిగే హోరా హోరీ పోరు.. ఇంతలోనే షేఖావత్ వేసే ఎత్తులు ఆకట్టుకుంటాయి. షేఖావత్ పట్టుకున్న తన మనుషుల్ని పోలీస్ స్టేషన్‌కి వెళ్లి విడిపించడం, మొదలుకుని ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి తన మార్క్ రాజకీయం చేయడం వరకూ సాగే సన్నివేశాలతో పుష్ప రాజ్ క్యారెక్టర్ బలం, అందులో ఉన్న నైజం ఎలాంటిదో ఆవిష్కరించాడు దర్శకుడు సుక్కు. దీంతో ఫస్ట్ హాఫ్‌లో కథ కంటే పుష్ప క్యారెక్టర్‌ను ఎలివేట్ చేసే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. మొత్తానికి పుష్ఫ శ్రీవల్లి రిలేషన్, మరోవైపు పుష్పరాజ్‌కు, భన్వర్ సింగ్ షెకవాత్ మధ్య గొడవల చుట్టూ ఫస్ట్ హాఫ్‌ను నడిపించాడు.
సెకండాఫ్‌లో వచ్చే జాతర ఎపిసోడ్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తోంది. అల్లు అర్జున్ చీర కట్టుకున్నప్పుడంతా థియేటర్ అరుపులతో దద్దరిల్లిపోతుంది. జాతర ఎపిసోడ్లో హీరోయిజం, భావోద్వేగాలు పీక్ స్థాయిలో వెళతాయి. ఈ ఎపిసోడ్ లో శ్రీవల్లీ పాత్ర చాలా కీలకంగా మారుతుంది. మొత్తానికి సెకండాఫ్ లో ఎమోషన్స్‌పై ఎక్కువ దృష్టి పెట్టారు సుకుమార్.
చివరి అరగంటను విలన్ షేఖావత్ తో కాకుండా కొత్త విలన్ తో ఇంకో సినిమా చూపించాడు దర్శకుడు. అలా అర్ధాంతరంగా ఫహద్ క్యారెక్టర్‌ను ముగించడం బాగాలేదు. అది ఆడియన్స్ కు మిశ్రమానుభూతిని కలిగిస్తుంది. అన్న కూతురిని కాపాడటం కోసం పుష్ప చేసే క్లైమాక్స్ ఫైట్ ఫ్యాన్స్‌కు హై మూమెంట్‌ను ఇస్తాయి. యాక్షన్, రిలేషన్, ఎమోషన్స్ తో పుష్ప 2 నడిపించిన సుకుమార్.. ఓ ఆసక్తికర మలుపుతో ‘పుష్ప3’కు ఎంట్రీ సిద్ధం చేస్తాడు. ఓవరాల్‌గా.. అల్లు అర్జున్ వైల్డ్ ఫైర్ చూపించాడు. తగ్గేదేలే.. అస్సలు తగ్గేదేలే అన్న డైలాగ్‌కి తగట్టుగానే అస్సలు తగ్గలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే పుష్ప 2 లో అల్లు అర్జున్ తన నట విశ్వరూపం చూపించాడు.
ఎవరేలా చేశారంటే::
పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ మరోసారి తన మార్క్ ని చూపించాడు. ఫస్ట్ పార్ట్‌లో ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ అంటూ ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే ‘పుష్పరాజ్’ పాత్రతో అలరించగా.. ఇందులో రూల్ చేసే వాడిగా ఇరగదీశాడు. చిత్తూర యాస, హావభావాల విషయంలో మరింత పదును పెట్టి ఆడియన్స్‌లో జోష్ పుట్టించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే అల్లు అర్జున్ అనే విషయాన్ని పూర్తిగా మరిచిపోయి పుష్పతో కలిసి ప్రయాణం చేసేలా చేశాడు. గంగాలమ్మ గెటప్‌లో అల్లు అర్జున్ నటనతో మరో స్థాయికి వెళ్ళాడు.
శ్రీవల్లిగా రష్మిక మందన్న తన నటనతో మెప్పించింది. గ్లామర్ డోస్ తో పాటు ఎమోషన్స్ సీన్స్ లో బాగా అదరగొట్టింది. జాతర ఎపిసోడ్లో అల్లు అర్జున్ తో పోటీ పడి నటించింది.
డీఎస్పీ షెకావత్‌గా ఫహద్ పాజిల్ తనదైన కామెడీతో, విలనిజంతో చెలరేగిపోయాడు.కానీ, కొన్ని చోట్ల మరింత పవర్ ఫుల్ గా ఉంటే బాగుంటుందనే ఫీలింగ్ ఇస్తోంది. రావురమేష్, జగపతిబాబు, సునీల్, అనసూయ ఇలా ప్రతిఒక్కరు తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక అంశాలు::
దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంపాక్ట్ గా ఉంది. జాతర ఎపిసోడ్.. క్లైమాక్సులో దేవి శ్రీ మ్యూజిక్ మాస్ కు పూనకాలు తెప్పిస్తుంది. సామ్ సీఎస్ కూడా నేపథ్య సంగీతంలో కీలక పాత్ర పోషించాడు. కొన్ని చోట్ల తనదైన శైలి మ్యూజిక్ వినిపిస్తోంది. సినిమాటోగ్రాఫర్ మిరోస్లా కుబా బ్రోజెక్ ప్రతి సీన్ చాలా రిచ్‌గా, వాస్తవాన్ని ప్రతిబింబించేలా చూపించాడు.
ఎడిటర్ నవీన్ నూలి పనితనం బాగుంది. ఇక చివరగా డైరెక్టర్ సుకుమార్ బ్రిలియన్స్ సినిమాలో అడుగడుగునా కనిపిస్తోంది. తనదైన స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేశాడు. కేవలం మాస్ యాక్షన్ అంశాలే కాకుండా కుటుంబ భావోద్వేగాలకు చోటిచ్చాడు. సుక్కు తన మార్క్ తో ఈ సారి పాన్ ఇండియా స్థాయిని తాకాడు. పుష్ప తోనే నేషనల్ అవార్డు సాధించేలా చేసిన సుకుమార్.. పుష్ప 2 తో ఆస్కార్ అవార్డు దక్కించుకునేలా చాలా అంశాలనే ముందుంచాడు.