ViduthalaiPart2: విడుదలై పార్ట్ 2 రివ్యూ.. విజయ్ సేతుపతి,వెట్రిమారన్ల థ్రిల్లర్ డ్రామా ఎలా ఉందంటే?

వెట్రిమారన్(Vetrimaaran) సినిమాలకు తమిళంలోనే కాకుండా తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. తెలుగులో డబ్ చేసిన పందెం కోడి, నారప్ప వంటి సినిమాలకు ఇతనే ఒరిజినల్ దర్శకుడు. తమిళంలో విజయ్ సేతుపతి(Vijay sethupathi) ‘విడుదలై’ సినిమా విమర్శల ప్రశంసలందుకుంది.

ఈ సినిమాతో హిట్ కొట్టిన వెట్రిమారన్ ఇవాళ శుక్రవారం (DEC 20న) విడుదలై పార్ట్ 2 (Viduthalai Part 2)తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమాని తెలుగులో చింతపల్లి రామారావు రిలీజ్ చేశారు. విడుదలై పార్ట్ 1 లో విజయ్ సేతుపతి పోషించిన 'పెరుమాళ్ వాతియార్'  పాత్రను కొనసాగిస్తూ తీసిన ఈ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే::

విడుదల పార్ట్ 1లో విజయ్ సేతుపతి పోషించిన 'పెరుమాళ్ వాతియార్' పాత్ర యొక్క శక్తివంతమైన కథను కొనసాగిస్తూ..వెట్రిమారన్ పార్ట్ 2ని తెరకెక్కించాడు. మొదటి భాగంలో కానిస్టేబుల్ సూరి ట్రైనింగ్ లో పడే బాధలు, అవమానాలు చూపించాడు. ముఖ్యంగా సూరి తన వృత్తి ధర్మానికి, తనలో ఉండే మానవత్వానికి మధ్యలో నలిగిపోయే పోలీస్ కథని తీసుకొచ్చాడు. ఇప్పుడు విడుదల పార్ట్ 2లో  విజయ్ సేతుపతి పోషించిన 'పెరుమాళ్ వాతియార్ అతని ప్రయాణం, అతని రాజకీయ తిరుగుబాటు మరియు సిస్టమ్‌తో అతనికున్న సంక్లిష్ట సంబంధాన్ని లోతుగా చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ వెట్రిమారన్. 

కరుప్పన్ అలియాస్ పెరుమాళ్ (విజయ్ సేతుపతి) అరెస్ట్ తో పార్ట్ 1 కంప్లీట్ అవ్వగా.. అతడి విచారణతో పార్ట్ 2 స్టార్ట్ అవుతుంది.  పెరుమాళ్‌ ను జైల్లో ఉన్నాడనే విషయం తన అనుచరులకు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అడవిలో ఉన్న మరో క్యాంపులోకి పెరుమాళ్‌ని షిఫ్ట్ చేయడానికి  పోలీస్ డిపార్ట్మెంట్ నిర్ణయించుకుంటుంది. అంతేకాకుండా అక్కడే తనని ఎన్ కౌంటర్ చేయాలని డిసైడ్ అవుతుంది. ఇక అడవికి తరలించే క్రమంలో పోలీసులకి తన కథను చెప్పడం స్టార్ట్ చేస్తాడు పెరుమాళ్‌. 

ఒక ఊళ్ళో సాధారణ స్కూల్ మాస్టర్ కరుప్పన్‌గా జీవితం స్టార్ట్ చేసి.. పెరుమాళ్‌గాఎలా మారాడు? అందుకు కారణమైన ఆ ఊరి జమిందారీ హత్య ఎలా చేయబడ్డాడు? ఆ హత్య చేసిన కుర్రాడిని పెరుమాళ్ ఎందుకు రక్షించాల్సి వచ్చింది? ఇక చివరికి రక్షించిన కుర్రాడు సైతం ఎలా చంపబడ్డాడు? ఈ క్రమంలో పెరుమాల్ కు జమిందారులను మధ్య జరిగే పోరు ఎటువంటిది? అందులో తీవ్రంగా గాయపడ్డ పెరుమాళ్ ని రక్షించే కమ్యూనిస్ట్ నాయకుడు ఎవరు? అతని సిద్ధాంతాలు పెరుమాళ్ ని ఎలా ప్రభావితం చేశాయి?

Also Read :- ఐశ్వర్య, అభిషేక్ విడాకుల పుకార్లకు చెక్

మొదట చెప్పుకున్నట్లు.. పోలీసులకి కథ చెప్పడం స్టార్ట్ చేసిన పెరుమాళ్ వారి నుంచి ఎలా తప్పించుకున్నాడు?  ఈ క్రమంలో కానిస్టేబుల్ కుమరశన్ పాత్ర ఏంటీ? మహాలక్ష్మి (మంజు వారియర్) రాకతో పెరుమాళ్ లో వచ్చిన మార్పేంటీ? భూస్వామ్య వ్యవస్థతో పెరుమాళ్ చేసిన పోరాట స్ఫూర్తి ఎలాంటిది? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే విడుదల పార్ట్ థియేటర్లో చూడాల్సిందే.

ఎలా ఉందంటే:: 

‘అహంకారంతో పాలకులు అణచివేసిన సామాన్యుల నుంచి పుట్టుకొచ్చిన ఒక అసామాన్యుడి వీర విప్లవ గాథే ‘విడుదల-2’.యదార్థ సంఘటనల ఆధారంగా తమిళంలో తీసినప్పటికీ తెలుగు నేటివిటీ ఉన్న కథ ఇది. తెలుగు రాష్ట్రాల్లోని సమస్యలు, ఇక్కడి సంఘటనలు ఉన్న సినిమా కనుక మన నేటివిటీకి సరిగ్గా సరిపోతుంది.పెరుమాళ్ వాతియార్' పాత్ర యొక్క శక్తివంతమైన కథను కొనసాగిస్తూ.. అతని ప్రయాణం, అతని రాజకీయ తిరుగుబాటు మరియు సిస్టమ్‌తో అతనికున్న సంక్లిష్ట సంబంధాన్ని లోతుగా చూపించారు.

కుల మత రాజకీయాలను అడ్డుపెట్టుకుని కొందరి వ్యక్తుల మోసం.. అందుకు తిరగబడిన ఓ సామాన్యుడు.. పూర్తిస్థాయి మావోయిస్ట్‌గా ఎలా మారడనేది కథాంశంగా తెరకెక్కించిన విధానం బాగుంది. అలాగే ఇందులో కులం అనే సామాజిక అంశాన్ని దర్శకుడు సబ్జెక్టుగా ఎంచుకున్నాడు. సహజమైన యాక్షన్ సన్నివేశాలు, అక్కడక్కడా ఒళ్లు గగుర్పొడిచే సీన్లు ఆడియన్స్ ని మరింత ఆకర్షిస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఈ చిత్రంలో ఓపెనింగ్ సీన్, ఇంటర్వెల్, ప్రీ క్రైమాక్స్, క్రైమాక్స్ గూస్బంప్స్.  

ఎవరెలా చేశారంటే::

సినిమా ఏదైనా.. పాత్ర ఎలాంటిదైనా.. విజయ్ సేతుపతి నటిస్తున్నాడంటే దాని రేంజే మారిపోతుంది. తనదైన నటనతో మెస్మరేజ్ చేసేస్తాడు. ఇక మేకోవర్ విషయంలోనూ మనసులు దోచుకుంటాడు. ఇందులో కూడా మరోసారి పెరుమాళ్ వాతియార్ పాత్రలో జీవించేశాడు. మధ్య వయస్కుడైన పల్లెటూరి వ్యక్తిగా.. నక్సలైట్ గా నటించి మెప్పించాడు.  అణగారిని వర్గాల కోసం పోరాడే పెరుమాళ్ అనే నాయకుడు గుర్తుండిపోతాడు.  అలాగే  కానిస్టేబుల్ పాత్రలో కనిపించిన సూరి నటన ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. మంజూ వారియర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, అనురాగ్ కశ్యప్, కిశోర్, రాజీవ్ మీనన్, భవానీ శ్రీ కీలకపాత్రల్లో నటించి మెప్పించారు.

సాంకేతిక అంశాలు:: 

ఇళయరాజా నేపథ్య సంగీతం సినిమాకు ప్రాణం పోసింది. ఇందులోని సంగీతంతో ఆయన ప్రళయరాజాలా అనిపిస్తారు. ఫైట్ మాస్టర్  పీటర్ హెయిన్ నేచురల్ యాక్షన్ కొరియోగ్రఫీ గూస్బంప్స్ కలిగిస్తోంది. వేల్‌రాజ్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. సినిమాని మరో లెవెల్‌కి తీసుకెళ్లడంలో వేల్‌రాజ్ సక్సెస్ అయ్యాడు. ఇక చివరగా డైరెక్టర్ వెట్రిమారన్ తనదైన కోణాన్ని మరోసారి వెండితెరపై చూపించి అదరగొట్టారు.. ఆలోచింపజేసేలా చేశాడు.