తల్లి రుణం తీర్చుకునే వేళ

దశాబ్దాల తెలంగాణ ఆకాంక్షలు నెరవేరిన వేళ  తల్లి  సోనియా గాంధీ ఋణం తీర్చుకుందాం. సోనియమ్మ పట్టుదల కారణంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ఎవరు అడ్డుకున్నా , వ్యతిరేకించినా ఆరు దశాబ్దాల కల సాకారం చేసి తెలంగాణ ప్రజలకు స్వరాష్ట్రం కానుకగా ఇచ్చింది. ఆ తరువాత కేసీఆర్​ ప్రభుత్వం ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైంది.  పైగా ఉద్యమ ఆకాంక్షలకు వ్యతిరేకంగా వ్యవహరించింది.  ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఏర్పాటు కోసం తల్లి సోనియా గాంధీ త్యాగం మరువలేనిది. 

తెలంగాణ రాష్ట్రం కోసం ఢిల్లీ వీధుల్లో అహర్నిశలు పండుగ, పబ్బం లేకుండా ఎంపీలంతా  కలిసి పోరాడాం.  తెలంగాణ ఉద్యమాన్ని జాతీయస్థాయిలో తీసుకువెళ్లేందుకు..ఢిల్లీలో జంతర్ మంతర్ వేదికగా ఉద్యమ ఆకాంక్షలు చాటిచెప్పడానికి వచ్చిన ఉద్యమకారులకు డిల్లీలో నీడనిచ్చేవాళ్ళం.  ప్రజాసంఘాలు, కుల సంఘాలు, మేధావులు, సబ్బండ వర్గాలు, జర్నలిస్ట్ ఫోరాలు,  ఢిల్లీలో ధర్నాకి వచ్చినప్పుడు వారికి ఆతిథ్యం ఇచ్చి  తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని చాటిచెప్పే విధంగా అన్ని రకాల  అండదండగా నిలబడ్డాం.   

ఉద్యమ ఆకాంక్షతో యువతకు స్ఫూర్తి

ఢిల్లీలో పార్లమెంట్ వీధి, జనపథ్, అశోక వీధి, అక్బర్ రోడ్,  రికాబ్ గంజ్ రోడ్డులో  నిత్యం  పోరాటం కొనసాగిస్తూ  అధిష్టానాన్ని ఒప్పించి  తెలంగాణ కల సాకారం చేశాం.  సమైక్యవాదులు తల్లి సోనియా గాంధీని కలవకుండా కుట్రలు పన్నితే  ప్రణబ్ ముఖర్జీ దగ్గర పట్టుపట్టి అపాయింట్​మెంట్​ ఇప్పించుకుని తెలంగాణ కల సాకారం అయ్యేలా చేశాం. ఉద్యమ ఆకాంక్షను తెలంగాణ యువతలో మరింత స్ఫూర్తిని నింపాం. అప్పటి  సీఎం కిరణ్​కుమార్​ రెడ్డి తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకిస్తూ  ఢిల్లీకి  వచ్చి మీడియా సమావేశం 
నిర్వహిస్తే అడ్డుకున్నాం.  

పెప్పర్ స్ప్రేతో దాడి

పార్లమెంటుకి  బిల్లు వచ్చినప్పుడు అప్పటి హోంమంత్రి చిదంబరం బిల్లు చదివే సమయంలో దాడి జరగ
కుండా తెలంగాణ ఎంపీలమంతా రక్షణ గోడలా నిలబడ్డాం. తీరా బిల్లు పెడుతున్న సమయంలో నాపై  పెప్పర్ స్ప్రేతో  దాడి జరిగినా  ప్రాణాలకు తెగించి బిల్లు పాస్ అయ్యే వరకు అక్కడే ఉన్నాం.   రాష్ట్ర  ఏర్పాటు ప్రకటనతో  పుట్టిన గడ్డ రుణం తీర్చుకున్నాం.   

తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించిన కేసీఆర్​

గత 10 ఏండ్లలో  కేసీఆర్  తెలంగాణలో రాచరికపు దొరల పోకడలతో రాష్ట్రం కోసం ఉద్యమించిన కవులు, రచయితలు,  గాయకులు,  విద్యావంతులు,  మేధావులను అణగదొక్కి వారికి కనీసం అపాయింట్​మెంట్ కూడా ఇవ్వకుండా అవమానించి, వేధించారు.  ప్రజా యుద్ధనౌక గద్దర్ లాంటి వారు, కేసీఆర్​ను కలవడానికి  ప్రగతి భవన్ ముందు పడిగాపులు పడటం చూసి దొరల అహంకారానికి  ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరు కూడా ఇవ్వకముందే  కాళేశ్వరం ప్రాజెక్ట్​కు పగుళ్లు రావడంతో  దాని భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. కేసీఆర్ ప్రభుత్వం అవినీతి  దీనికి కారణం. కేసీఆర్ అరాచకాలు భరించలేక ఇందిరమ్మ రాజ్యం రావాలని,  కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు కోరుకున్నారు.  

తెలంగాణ అంటే ఒక కుటుంబం సొంతం కాదు ఇది ప్రజాపాలన,  ప్రజా ప్రభుత్వం,  ఇందిరమ్మ ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది.  ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజే  ప్రగతి భవన్ ముందున్న కంచెలను బద్దలుకొట్టాం.  ప్రగతి భవన్​ను  జ్యోతిరావు ఫూలే  ప్రజా భవన్​గా  మార్చుకొని  ప్రజలకు అందుబాటులోకి తెచ్చాం.  గతంలో  సచివాలయంలోకి ఎమ్మెల్యేలు కూడా వెళ్ళే పరిస్థితి ఉండకపోయేది ఇప్పుడు సచివాలయంలోకి నేరుగా ప్రజలు వెళ్లి తమ సమస్యలు అధికారులకు చెప్పుకునే విధంగా స్వేచ్ఛను 
తీసుకొచ్చాం. 

తెలంగాణలో ప్రజాపాలన

దాదాపు 30 వేల పోస్టులను కోర్టు కేసులు క్లియర్ చేసి భర్తీ చేశాం.  మాది పేదల ప్రభుత్వం,  ప్రజా ప్రభుత్వం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నాం.  500కి గ్యాస్ అందిస్తున్నాం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం, కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇండ్లు అన్ని త్వరలోనే ఇస్తాం.  ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుస్తం. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలను గౌరవించుకుంటాం.    ఉద్యమకారుల కుటుంబాలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తాం. 

తాము ఇచ్చిన ఆరు గ్యారంటీ లకు తోడు ఏడవ గ్యారంటీగా ప్రజాస్వామ్యాన్ని  ప్రజల ముందు ఉంచుతున్నాం.  కులగణన  తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెట్టాం. దానికి కోసం 150 కోట్లు కూడా విడుదల చేశాం.  ఉద్యమంలో వేనోళ్ల పాడుకున్న 
‘జయ జయహే తెలంగాణ’  జననీ జయకేతనం గీతాన్ని రాష్ట్ర గీతంగా పెట్టుకున్నాం. చిహ్నాలకు సంబంధించి కూడా ప్రజల డిమాండ్ల మేరకు మార్పులు చేర్పులు చేస్తున్నాం. అసెంబ్లీలో చర్చ చేసిన తరువాతనే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది. 

- పొన్నం ప్రభాకర్​
రవాణాశాఖ మంత్రి