సోనియమ్మ సాహసం తెలంగాణ సాకారం

‘జయ జయహే తెలంగాణ’ అని సగర్వంగా పాడుకునే శుభ తరుణమిది. దశాబ్దాలపాటు సాగిన ఉద్యమాలు విజయతీరాలకు చేరి దశాబ్ద కాలం పూర్తవుతోంది. ఈ సంతోష సమయంలో తెలంగాణ ప్రభుత్వం వైభవంగా దశాబ్ది ఉత్సవాలను నిర్వహించనుండటం తెలంగాణ పౌరులుగా, ఉద్యమం చేసిన వ్యక్తులుగా ప్రతి ఒక్కరిని సంబరాల్లో ఓలలాడిస్తోంది. దశాబ్ది ఉత్సవాల వేళ మన కల సాకారం కావడానికి కృషి చేసినవారిని మరోసారి ఇష్టంగా తలుచుకోవాలి. వారు అందించిన స్ఫూర్తితో  మార్పు దిశగా సాగే ప్రస్థానంలో మన గమనాన్ని మరింత స్ఫష్టంగా నిర్దేశించుకోవాలి.  ఘనమైన మన ప్రయాణంలో కపటదారుల పట్ల, మాటిచ్చి మోసం చేసిన వారి పట్ల నిరంతరం జాగ్రత్తగా ఉండాలి.

తెలంగాణ ఎప్పుడూ నిత్య చైతన్యశీలి,  సహజ ప్రకృతి సంపదలతో,  కళలకు కాణాచిగా వర్ధిల్లిన పుణ్యధాత్రి.  రాజరిక వ్యవస్థల నుంచి ఆధునిక  ప్రజాస్వామ్యాల వరకూ మనదైన ప్రేమతత్త్వాన్ని ప్రపంచానికి చూపిస్తూనే ఉన్నాం, ఆ ప్రేమతత్త్వాన్ని అర్థం చేసుకుంది కాబట్టే నాటి యూపీఏ చైర్ పర్సన్​గా ఉన్న  సోనియాగాంధీ పార్లమెంట్ తలుపులు మూసైనా మన తలపుల్ని నెరవేర్చింది, 2014 జూన్ 2న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని నాలుగు కోట్ల ప్రజలకు కానుకగా అందించింది. ఈ నిర్ణయంతో  కొత్తగా  ఏర్పడే  రెండు రాష్ట్రాల్లో అధికారం పోతుందన్నా ఆమె అదరలేదు.  యావత్ యూపీఏ  ప్రభుత్వ ఏర్పాటుకు కీలకంగా ఉన్న దక్షిణాది ప్రాంతంలో పట్టు కోల్పోయినా చెక్కు చెదరలేదు. అధికారం కాదు  ప్రజలే ముఖ్యమని తలిచింది. అందుకే నాడు కలగా ఉన్న తెలంగాణ స్వప్నం సాకారమైంది. 

సోనియమ్మ కీలకపాత్ర

దేశ స్వాతంత్ర్య పోరాటం చేయడమే కాదు స్వాతంత్ర్యానంతరం విశాల భారతావనికి పటిష్ట పునాదులు వేసి, నేడు యావత్ ప్రపంచానికి మార్గదర్శనం చేస్తూ సమ్మిళిత అభివృద్దితో భారత్ దూసుకెళ్లేలా తీర్చిదిద్దింది కాంగ్రెస్ పార్టీ. యావత్ దేశానికి ప్రాతినిధ్యం వహించే పార్టీపై అనేక ఒత్తిళ్లు ఉంటాయి, దేశవ్యాప్తంగా యూపీ విభజన, విదర్భ, బుందేల్ ఖండ్ వంటి అనేక ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లున్నాయి. తెలంగాణ డిమాండ్ న్యాయబద్ధతపై ఆది నుంచి చిత్తశుద్ధితో ఉంది కాబట్టే  ఎలాంటి పొరపొచ్ఛాలు లేకుండా  దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ శక్తుల్ని తెలంగాణకు అనుకూలంగా మార్చింది కాంగ్రెస్.  పార్లమెంటరీ విధానాలపై సంపూర్ణ విశ్వాసంతో దేశాన్ని ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా మార్చేలా ప్రతి దశలోనూ తనదైన పాత్ర పోషించింది సోనియమ్మ. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో పార్టీ పరంగా తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయంతో  సోనియమ్మ తెలంగాణ సాకారానికి పునాది వేశారు, తదనంతరం కరుడుగట్టిన సమైక్య పార్టీలు సైతం అయిష్టంగా జై తెలంగాణ అనేలా చేసింది. ఎన్నో వేదికలపై నిరంతరం అనేక పార్టీలతో సంప్రదింపులు జరుపుతూ ప్రజల మధ్య వైషమ్యాలు నెలకొనకుండా జాగరూకతతో వ్యవహరించారు. పార్టీ శ్రేణుల భావోద్వేగాలను గౌరవిస్తూనే పరిధి దాటకుండా నియంత్రించారు. ఏదో జరిగిపోతుందని సృష్టించిన భయబ్రాంతుల్ని పటాపంచలు చేస్తూ పార్లమెంట్ వేదికగానే సగర్వంగా తెలంగాణ బిల్లును ఉభయ సభల్లోనూ పాస్ చేయించారు సోనియమ్మ. 

పదేండ్ల విధ్వంసం

ఏ స్వేచ్ఛా వాయువుల కోసం తెలంగాణ ప్రజలు పోరాటం చేశారో, ఏ స్వపరిపాలనను ప్రజలకు కానుకగా ఇవ్వడానికి సోనియమ్మ పరితపించారో అనంతర కాలంలో అవి నెరవేరకపోగా ప్రజలు మరింతగా ఇబ్బందుల పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ కృషితో ఏర్పాటైన తెలంగాణలో చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరిన చందంగా తయారైంది, ఒక విధానమంటూ లేకుండా చేసిన పదేండ్ల విధ్వంసం గురించి ఇంతా అంతా అని చెప్పలేం. తెలంగాణ ప్రజల స్వేదంతో తయారయ్యే రాష్ట్ర ఖజానాను ఇష్టం వచ్చినట్టుగా గుల్ల చేశారు. ఆ విధ్వంసానికి సాక్షీభూతంగా లక్ష కోట్ల కాళేశ్వరం కళ్లముందే కుప్పకూలుతుంటే గుండె లోతుల్లోని ఆవేదన గూడు కట్టుకుంటోంది. నియంతలా వ్యవహరిస్తూ ప్రజల ఆత్మాభిమానానికి విలువ ఇవ్వని ఆ పాలనా కాలమంతా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అర్థాన్ని మార్చివేశాయి. ఈ పరిస్థితుల నుంచి మార్పుకోసం యావత్  తెలంగాణ ప్రజానీకం ఏకమై సంక్షేమ పాలనకు పట్టం కట్టారు.  నాడు  తెలంగాణ కలను సాకారం చేసిన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వమే నేడు దశాబ్ది సంబురాల వేళ రాష్ట్రంలో అధికారంలోకి రావడం మన సంతోషాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. ఉమ్మడిగా ఉన్నప్పటికన్నా స్వరాష్ట్రంలో జరిగిన విధ్వంసాన్ని, ఆ భయానక అనవాళ్లు తెలంగాణ పౌరుల హృదయాల్లో చేసిన గాయాలను ఒక్కొక్కటిగా రూపుమాపడానికి రేవంత్ సర్కార్ నడుం బిగించడం సంతోషదాయకం. 

ప్రతి గుండెను కదిలించిన ‘జయ జయహే తెలంగాణ’

ముఖ్యంగా నాడు ఉద్యమంలో ప్రతి గుండెను కదిలించిన ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని అధికారిక గేయంగా నిర్ణయించడమే కాక తెలంగాణ ఆత్మ ప్రతిబింబించేలా అందెశ్రీతో ఆవిష్కరించడం, గడీల వారసత్వాలను బద్దలు కొట్టేలా తెలంగాణ చిహ్నాన్ని నిండైన తెలంగాణ ఆడబిడ్డలా రూపొందించడం,  ఉద్యమం నాడే ప్రతి బండిపై సంక్షిప్త రూపాల్లా నిలిచిన TG  అక్షరాలను అధికారికం చేయడం, ఇలా అనతికాలంలోనే  తెలంగాణ ఆత్మను తిరిగి తీసుకొచ్చేలా ప్రజా ప్రభుత్వం చేస్తున్న పనులతో మంచిరోజులు మళ్లీ వచ్చాయనే  నమ్మకాన్ని ప్రతి ఒక్కరిలో కలిగిస్తున్నాయి.  అధికారంలోకి  వచ్చిన  వందరోజుల్లోనే  ఇచ్చిన హామీల్లో ఐదు హామీలను నెరవేర్చడం,  దాదాపు మూడు నెలలకు పైగా ఎన్నికల కోడ్ అడ్డంకిగా  ఉన్న  తెలంగాణ ఆడబిడ్డలకు ఉచిత బస్సు,  రూ. 500కే సిలిండర్, ఫ్రీ కరెంటు వంటి అనేక పథకాల్ని దిగ్విజయంగా అందిస్తున్న తీరు ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలుపుతుంది. నాడు స్వరాష్ట్రాన్ని ఇచ్చి తెలంగాణను నిరంతరం ప్రేమించే త్యాగశీలి సోనియమ్మను దశాబ్ది ఉత్సవ వేళ సన్మానించాలనే నిర్ణయం హర్షదాయకం.

- బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి
సీఈవో, టిశాట్ నెట్​వర్క్,అధ్యక్షుడు, తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక