కులగణన వెంటనే చేపట్టాలి

దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 76 సంవత్సరాలు గడిచింది.. ఏడు దశాబ్దాలకు పైగా రాజ్యాంగం అమలులో ఉంది.  బీసీలకు రిజర్వేషన్ల చట్టం రూపొందించి 33 సంవత్సరాలు అయింది.. పద్దెనిమిదవ లోక్​సభ కూడా కొలువుదీరింది.  అయినప్పటికీ  దేశ జనాభాలో దాదాపు 55% ఉన్న బీసీ ప్రజల సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం కేంద్రంలో కనీసం మంత్రిత్వశాఖను కూడా ఏర్పాటు చేయలేకపోయారు. 

మోదీ ప్రభుత్వం బీసీ ప్రజల సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం ప్రత్యేక బడ్జెట్ కూడా కేటాయించలేకపోయింది. 1991లో  బీసీల రిజర్వేషన్ చట్టం రూపొందినప్పటికీ  కేంద్ర ప్రభుత్వసంస్థలలో 27% రిజర్వేషన్​లో  ఇప్పటికీ కేవలం 9 శాతం ఉద్యోగాలు మాత్రమే రిజర్వేషన్ల ద్వారా లభిస్తున్నాయి.  సంవత్సరానికి 8 లక్షల ఆదాయం ఉన్న ప్రతి బీసీ కుటుంబం క్రిమీలేయర్  కోవలోకి  చేర్చడం ద్వారా  బీసీల రిజర్వేషన్​కు  కళ్లెంవేసి తొమ్మిది శాతానికి  కుదించబడుతున్నది. మొత్తం దేశ జనాభాలో  వెనుకబడిన కులాల జనాభాను శాస్త్రీయ పద్ధతి ద్వారా లెక్కించి ఈ కులాల్లో  అట్టడుగున ఉన్నవారిని అభివృద్ధి చేయవలసిన బాధ్యత  ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వంపై  ఉంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీసీ కులాల నుంచి ఎదిగివచ్చిన నాయకుడని వెనుకబడిన కులాల ప్రజలు ఎంతో ఆశపడ్డారు.  కానీ, మన ప్రధాని కులగణన గురించి  మాట్లాడడం లేదు.  ప్రతి పది సంవత్సరాలకొకసారి 2021లో జరగవలసిన జనాభా లెక్కలూ గత మూడున్నర సంవత్సరాల నుంచి దాటవేస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తున్నారు. 

కనీసం  దేశ జనాభా  లెక్కల ద్వారానైనా  ప్రజల ఆర్థిక, సామాజిక అభివృద్ధిని అంచనా వేసుకొని అభివృద్ధి పథకాలను రచించే కార్యక్రమం కూడా చేయడంలేదు.  వెనుకబడిన కులాలకు మాత్రమే నిర్దాక్షిణ్యంగా క్రిమీలేయర్ లాంటి కఠోర కళ్లెంవేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో  ఆ కాస్త వాటా దక్కకుండా చేయడం జరుగుతున్నది. 10–-15 శాతం ఉన్న ఆర్థికంగా వెనుకబడిన ఆధిపత్య కులాలకు మాత్రం కేంద్రంలో,  రాష్ట్రంలో 10%  రిజర్వేషన్లు కల్పించి పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఈ విషయంలో ఎవరికీ అభ్యంతరం ఉండకూడదు. 

 కానీ, దేశంలో అత్యధిక జనాభా ఉన్న వెనుకబడిన కులాలకు  తగిన ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయం చేయకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆరోగ్యకరమైన పద్ధతికాదని అన్ని రాజకీయ పార్టీలకు తెలిసినప్పటికీ నిర్లక్ష్యం చేస్తున్నాయి. వెనుకబడిన కులాల మధ్య  ఐకమత్యం లేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా భావించవచ్చు. ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి. పోతున్నాయి.  అయినా,  ఈ సామాజిక వర్గానికి ప్రగతి లేకుండా ప్రజాస్వామ్యంలో తగిన ఉనికి లేకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. 

కేసీఆర్ బంధువర్గానికి పెద్దపీట

తెలంగాణ రాష్ట్రం వస్తే పేద, బడుగు వర్గాల ప్రజలకు సాధికారత లభిస్తుందని.. ముందు వరుసలో ఉండి వందలాది మంది వెనుకబడిన కులాల యువకులు ప్రాణత్యాగం చేశారు.  లాఠీదెబ్బలు తిన్నారు.  రాస్తారోకోలు,  గ్రామ గ్రామాల్లో  ధూం ధాం,  ఉద్యమాలు నిర్వహించారు.  లక్షలాది మంది యువత తమ భవిష్యత్తును తాకట్టుపెట్టి ఉద్యమంలో పాల్గొని నిరర్ధక జీవితం గడుపుతున్నారు. 

ఇన్ని త్యాగాలు చేసిన పేద ప్రజలకు కల్వకుంట్ల పాలనలో మొండిచేయి మిగిలింది.  రాష్ట్ర చట్టసభలలో  కనీసం 20% కూడా అమలుచేయలేదు.  వెనుకబడిన కులాల నుంచి మంత్రిమండలిలో  కేవలం ముగ్గురు సభ్యులతో  సరిపుచ్చారు.  కానీ,  కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన కుటుంబం నుంచి ఆయన ముఖ్యమంత్రిగా, కొడుకును, అల్లుడిని,  మరో బంధుమిత్రునికి  రాష్ట్ర  కేబినెట్లో కీలకమైన అనేకశాఖలను కేటాయించారు. 

10 సంవత్సరాల పాటు రాజ్యమేలి రాష్ట్రాన్ని బుగ్గి చేశాడు.  తన కుమార్తె, తోటి అల్లుడు కొడుకు సంతోష్ రావు ఇంకా అనేకమంది ఆయన బంధువులు, సామాజికవర్గానికి చెందినవారికి పార్లమెంటులో, శాసనసభ,  శాసనమండలిలో,  ప్రభుత్వ యంత్రాంగంలో అత్యంత కీలకమైన ఉన్నత స్థాయి పదవులు కల్పించారు.  వేలాది కోట్ల కాంట్రాక్టులు ఇచ్చి తన సామాజికవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశాడు. 

 నీటిపారుదల, విద్యుత్తు, రెవెన్యూ, న్యాయశాఖ, ఫైనాన్స్, పోలీసు శాఖలలో  తన సామాజిక వర్గానికి చెందిన విశ్రాంత ఉద్యోగులను ఉన్నత స్థాయి పదవులు ఇచ్చి దశాబ్ద కాలం గౌరవించారు.  స్థానిక సంస్థలలో అమలు జరుగుతున్న బీసీ కులాల రిజర్వేషన్లను మాత్రం 33 శాతం నుంచి 18 శాతానికి తగ్గించి పేద వర్గాల పట్ల తన వ్యతిరేకతను చాటుకున్నాడు. 

అన్నిరంగాల్లో బీసీల అణచివేత

ఎంతో ఆర్భాటంతో నిర్వహించిన సమగ్ర సర్వే నివేదిక కేవలం వెనుకబడిన కులాల ఓటర్లకు గాలం వేయడానికి మాత్రమే ఉపయోగపడింది.  దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి బీసీ విద్యార్థులకు అమలుచేసిన ఫీజు రీయింబర్స్​మెంట్​ పథకాన్ని,  ఉపకార వేతనాలను  నిలిపివేశారు.  బీసీ యువతకు సబ్సిడీల ద్వారా, రుణాలు ఇచ్చే కార్పొరేషన్లకు చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా 10 సంవత్సరాల పాటు ఎండగట్టారు. 

బీసీ విద్యార్థుల హాస్టళ్లు నిధుల కొరతతో నిర్లక్ష్యం చేసి పురుగులు పడ్డ ఆహారం తినిపించాడు.  కల్వకుంట్ల పాలనలో లక్షలాది మంది బీసీ విద్యార్థులు శాస్త్ర సాంకేతిక ఉన్నత విద్యకు దూరమైనారు.  బీసీల కోసం కేటాయించిన ఆ కాస్త కొద్ది నిధులు కూడా విడుదల చేయకుండా నిరాశకు, అవమానానికి, అన్యాయానికి గురి చేశాడని ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి.  

ఈటల రాజేందర్ ను  రాష్ట్ర  మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేసి  ఆయన స్థానంలో మరో బీసీ శాసనసభ్యునికి  మంత్రివర్గంలో అవకాశం కూడా ఇవ్వలేదు.  స్వాతంత్ర్యం లభించి ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, లౌకిక సమాజం ప్రాతిపదికగా ఏర్పడిన సమాజంలో బీసీలు అన్నిరంగాల్లో అణచివేతకు గురవుతున్నారని గణాంకాలు  చెప్పవలసిన అవసరం లేదు.  కులగణన ద్వారా వెనుకబడిన కులాల ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితిగతులను అంచనావేసి, తగిన న్యాయం చేస్తారని విశ్వాసంతో  బీసీ ప్రజలు కులగణన కోసం ఆందోళనలు చేస్తున్నారు. 

కాంగ్రెస్ ​ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం

2023 శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ జాతీయ అగ్రనాయకులు రాహుల్ గాంధీ,  మల్లికార్జున్ ఖర్గే,  అప్పటి రాష్ట్ర  పీసీసీ అధ్యక్షుడు  రేవంత్ రెడ్డి ఇంకా ఇతర రాష్ట్ర నాయకులు ఎన్నికల వాగ్దానాలలో భాగంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ ఆరునెలల్లోనే  కులగణన చేయడంతోపాటు, రాష్ట్ర వార్షిక బడ్జెట్ లో ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయల నిధులు బీసీల అభివృద్ధి,  సంక్షేమ పథకాలకు కేటాయిస్తామని వాగ్దానం చేసి మేనిఫెస్టోలో  కూడా పొందుపరచడం జరిగింది.  రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఇతర వాగ్దానాలను అమలుచేస్తూ ముందుకు సాగుతున్నది.  కులగణన అంశం కేవలం చర్చలకు మాత్రమే పరిమితం

రాష్ట్రంలోనూ కులగణన త్వరగా చేయాలి

రాష్ట్రంలో కులగణన యుద్ధ ప్రాతిపదికన చేపట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే పూర్తిచేయాలి.  ఈ సామాజిక వర్గాలను అక్కున చేర్చుకోవలసిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందని బీసీ ప్రజలు విశ్వసిస్తున్నారు. కాలయాపన జరిగినకొద్దీ  బీసీ కులగణన చర్చ ఏదో ఒక పార్టీకి, నాయకులకు రాజకీయ పునరావాస కేంద్రం కాకూడదు.  దగాపడ్డ ఈ సామాజికవర్గాల ప్రజలు,  విద్యార్థులు, ఇంతకాలం బీసీలను అణగదొక్కిన ఆ నాయకులే తిరిగి ఈ ఉద్యమంలో చొరబడే అవకాశం కూడా లేకపోలేదు.  సమస్య  పరిష్కారానికి అన్ని పార్టీలు సహకరించాలి. 

 కానీ, కేవలం రాజకీయాలు చేసి మళ్లీ రాజకీయ లబ్ధి పొందడం తగదని బీసీ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకుల  జాతీయకరణ,  భూకమతాలపై  గరిష్ట పరిమితి,  పనికి ఆహారం పథకంలాంటి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలుపరిచిన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే కులగణనను నిర్వహించి తగిన న్యాయం చేయగలదనే విశ్వాసం ప్రజల్లో ఉంది.  ఈ మేరకు  రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 55% జనాభా ఉన్న సమాజానికి తగిన న్యాయం చేస్తుందని కోరుకుంటున్నారు. 

- వెంకట్​ నారాయణ,
కేయూ ప్రొఫెసర్​ (రిటైర్డ్​)