అరుదైన రాజకీయ నేత నితీశ్ కుమార్

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తరచుగా వార్తల్లో నిలుస్తారు.  కానీ,  రాంగ్ రీజన్స్ వల్ల ఆయన ఎక్కువగా వార్తల్లోకి ఎక్కుతారు. నితీశ్​ కుమార్  ఏ పార్టీకైనా పూర్తిగా నమ్మలేని, ఆధారపడలేని మిత్రుడు అన్నట్లుగా మీడియా ప్రొజెక్టు చేస్తుంటోంది. కానీ, మీడియా ఆయన చిత్తశుద్ధి, రాజకీయ విజయం గురించి ఎక్కువగా మాట్లాడదు. నితీశ్​కుమార్ బిహార్ ముఖ్యమంత్రిగా తొమ్మిదిసార్లు ప్రమాణ స్వీకారం చేశారు. 2005 నుంచి బిహార్​ సీఎం పీఠంలో నితీశ్‌‌ కుమార్​ కొనసాగుతున్నారు. చాలా సందర్భాల్లో  ీజేపీతోపాటు, లాలూ ప్రసాద్ యాదవ్ కూడా నితీశ్​ సీఎం పదవి నుంచి తొలగించడానికి ప్రయత్నించారు. అయితే, వారి ప్రయత్నం విజయవంతం కాలేదు.  నితీశ్​ తన మిత్రపక్షాలను మార్చుకుని ఉండవచ్చు. కానీ, ఆయన బీహార్​ ముఖ్యమంత్రిగా నేటికీ కొనసాగుతున్నారు.

నితీశ్ కుమార్​కి కూడా వ్యక్తిగతంగా ప్రజాదరణ  ఉంది. బిహార్ అంతటా కనీసం 16% ఓట్లను కలిగి ఉన్నారు. మెజారిటీ ప్రజలు ఆయనను సమర్థవంతుడైన ముఖ్యమంత్రిగా చూస్తున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్​ ఆయన భార్య రబ్రీ దేవి 1990 నుంచి 2005 వరకు బిహార్‌‌ను ఎకధాటిగా పాలించారు. ప్రస్తుతం లాలూ ప్రసాద్​కు  ఒక విషయం అర్థమై ఉండొచ్చు.  నితీశ్​ జీవించి ఉన్నంతకాలం.. ఆయన కుటుంబం మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడం అసాధ్యం.  నితీశ్​ను ప్రత్యర్థిగా భావించి ఎన్నికల్లో ఓడించాలని లాలూ ప్రయత్నించి విఫలమయ్యారు. అదేవిధంగా లాలూ నితీశ్​కుమార్‌‌తో స్నేహం చేసి ఆయన్ను పదవి నుంచితొలగించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. నితీశ్​ కూడా రాజకీయ అపర చాణక్యుడు. తన పదవిని కాపాడుకోవడంలో ఆయన సిద్ధహస్తుడు. నితీశ్​ కుమార్ 2005 నుంచి 10 నెలల విరామం మినహా నేటికీ బిహార్​ ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్నారు. బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా, ఓడిపోయినా నితీశ్ కుమార్‌‌ ముఖ్యమంత్రిగా కొనసాగడం గమనార్హం. 

అవినీతి ఆరోపణలు లేని నితీశ్​

నితీశ్ కుమార్ ఒక ప్రాంతీయ పార్టీ జేడీయూ​కి నాయకత్వం వహిస్తున్నారు. ఒడిశాకు చెందిన ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌‌తో పాటు ఎటువంటి అవినీతి ఆరోపణలు లేని ప్రాంతీయ నాయకుడు నితీశ్ కుమార్. యాదృచ్ఛికంగా నవీన్ పట్నాయక్, నితీశ్​ కుమార్ ఇద్దరికీ రాజకీయ వారసులు లేరు. నితీశ్​కుమార్‌‌ని లాలూ ప్రసాద్ యాదవ్‌‌తో పోల్చితే విభిన్న పరిస్థితి. లాలూ, ఆయన భార్య రబ్రీ, లాలూ ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఎమ్మెల్యేలు లేదా ఎంపీలుగా కొనసాగుతున్నారు. లాలూ కుటుంబంలోని 6 మంది సభ్యులు ఇప్పుడు లెజిస్లేటర్లుగా ఉన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో మరే ఇతర ప్రాంతీయ పార్టీలైనా, జాతీయ పార్టీలైనా  వారసులు, వంశీయులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ప్రాథమికంగా వంశపారంపర్యం లేదా కుటుంబ ఆధిపత్య పార్టీలుగా ఉండగా వీటినుంచి నితీశ్ కుమార్, నవీన్ పట్నాయక్​లను మినహాయించవచ్చు.

అర్భాటాలకు నితీశ్ దూరం

నితీశ్​ కుమార్ రాజకీయ మనుగడకు  ఒక ప్రధాన కారణం ఏమిటంటే.. ఆయన సహేతుకమైన పాలనను అందించడం. హింస లేదా రౌడీయిజాన్ని ఆయన సహించడు. వ్యక్తిగతంగా నితీశ్ అవినీతికి వ్యతిరేకం. నితీశ్ కుమార్ హయాంలో మాత్రమే బిహార్‌‌లో మజిల్​మెన్​ లేదా ‘బాహుబలి’ అనేవారు తగ్గారు. మరో  ముఖ్యమైన విషయం రాష్ట్ర ప్రభుత్వ సొమ్మును ముఖ్యమంత్రిగా నితీశ్​ జాగ్రత్తగా, పొదుపుగా ఖర్చు చేస్తారు. నితీశ్​ కుమార్ మన నేతలలాగా చార్టర్ విమానాలను ఉపయోగించరు. వ్యక్తిగత కీర్తి పెంపుకోసం ఆయన భారీ కాన్వాయ్​లు, రాష్ట్ర నిధులను వినియోగించరు.

మరోసారి నితీశ్​కే గెలుపు అవకాశాలు?

నితీశ్​ కుమార్‌‌ రాజకీయంగా బతికి ఉన్నంత కాలం లాలూ కుటుంబంలో ఎవరూ మరోసారి ముఖ్యమంత్రి పదవిని అధిష్టించలేరని రాజకీయ నిపుణుల అభిప్రాయం.  నితీశ్​కుమార్​ వయసు 73 ఏండ్లు.  కాగా, శరద్‌‌ పవార్‌‌, మల్లికార్జున్‌‌ ఖర్గే వంటి వారి వయసు 85 ఏండ్లు. భవిష్యత్తును ఎవరూ ఖచ్చితంగా అంచనా వేయలేనప్పటికీ నితీశ్​కుమార్​కు చాలా ప్రజాదరణ ఉందనడంలో  సందేహం లేదు. ఈక్రమంలో ఆయన రాష్ట్ర ఎన్నికలలో మరోసారి విజయం సాధించడం ఖాయంగానే కనిపిస్తోంది. ఎందుకంటే,  బిహార్‌‌లో నితీశ్ కుమార్‌‌ లేకుండా బీజేపీ ఏమీ చేయలేదు. బిహార్‌‌లో బీజేపీకి నమ్మకంగా ఆధారపడే ప్రజాదరణ ఉన్న శివరాజ్ సింగ్​చౌహాన్ లేదా యోగి ఆదిత్యనాథ్ లాంటి నాయకుడు లేరు. అయితే, రాజకీయ ప్రాబల్యం ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్‌‌ను అడ్డుకోవడంలో మోదీ అండ లేకుండా తాను గెలవలేనని నితీశ్​కు కూడా తెలుసు. బీజేపీ కూటమిని వీడితే నితీశ్​కుమార్‌‌కు ఏం లభిస్తుంది అనేది ఓ ప్రశ్న. మరోవైపు ఆయన ఇండియా కూటమిలో ఉన్నప్పుడు తనను కూటమి విస్మరించి పక్కనపెట్టడం వల్ల ఏమీ సాధించలేకపోయిన విషయం నితీశ్​కు బాగా తెలుసు.

ఎన్డీఏ కూటమితోనే నితీశ్ కుమార్ 

నితీశ్​కుమార్ బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిని విడిచిపెట్టకపోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే, ఆయన పార్టీకి చెందిన 12 మంది​ఎంపీలు మోదీ మద్దతుతో విజయం సాధించారు. నితీశ్ ఒకవేళ ఎన్డీఏ కూటమి నుంచి వెళ్లిపోతే జేడీయూ​ఎంపీలు కూడా ఆయనతోపాటు ఎన్డీఏ నుంచి వెళ్లకపోవచ్చు. ఆంధ్రాలో చంద్రబాబు నాయుడిలా,  నితీశ్ కుమార్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ వల్లే నాయుడు గెలిచారని రాజకీయ వాదనలు కూడా ఉన్నాయి. ఈనేపథ్యంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్‌‌ని పక్కన పెడతారా అనేది మిలియన్​ డాలర్ల ప్రశ్న.  రాజకీయంగా అసాధారణ మార్పులు జరిగితే తప్ప నాయుడు లేదా నితీశ్​కుమార్ బీజేపీని వీడరని కామన్​సెన్స్​ చెబుతోంది.

అందరికీ నితీశే చాయిస్​

2005 నుంచి నితీశ్ కుమార్ ప్రతిసారి లాలూ ప్రసాద్ యాదవ్​ సారథ్యంలోని ఆర్జేడీ,  బీజేపీ, కాంగ్రెస్‌‌లను అధిగమించి సీఎం పదవిని దక్కించుకుంటున్నారు.  ఆయన ఒక ప్రత్యేకమైన రాజకీయ నాయకుడు.  నితీశ్​కుమార్​కు రాజవంశం, కులం లేదా సంపద అండగా లేదు. ఇలాంటి రాజకీయ నాయకులు చాలామంది ఉండొచ్చు కానీ అలాంటి నాయకులందరూ ముఖ్యమంత్రులు కాలేరు. నితీశ్ కుమార్ బలం ఆయనకు ఉన్న గొప్ప రాజకీయ నైపుణ్యం.  వాజ్‌‌పేయి ప్రభుత్వంలో  నితీశ్ కుమార్ కేంద్ర రైల్వే మంత్రిగా, వ్యవసాయ శాఖల మంత్రిగా కూడా ఉన్నారు. కేంద్ర మంత్రిగా కూడా నితీశ్ కుమార్ అవినీతి ఆరోపణలను తిప్పికొట్టగలిగారు. భారతదేశానికి ఇంకా చాలా మంది నితీశ్​ కుమార్ లాంటి నాయకుల అవసరం మాత్రం ఉంది.

బీజేపీ కూటమి నుంచి.. నితీశ్ కుమార్ వైదొలుగుతారా?

లోక్‌‌సభలో అధికార బీజేపీకి సొంతంగా మెజారిటీ లేదు. కాబట్టి, బీజేపీకి అధికారంలో కొనసాగేలా నితీశ్​ కుమార్‌‌ సహాయం చేస్తున్నారు. సహజంగానే ఆయన హఠాత్తుగా బీజేపీ కూటమి నుంచి తప్పుకుంటారా అని చాలామంది సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నితీశ్​ కుమార్ డిసెంబర్ 2023లో లాలూ ప్రసాద్ యాదవ్ కూటమిని విడిచిపెట్టి తిరిగి బీజేపీ కూటమి ఎన్డీఏలోకి వచ్చారు. లాలూ ప్రసాద్ తనను బయటకు నెట్టాలని, తద్వారా ఆయన తన కొడుకును ముఖ్యమంత్రి చేయాలనుకున్నారని ప్రధాన కారణంగా చెపుతారు. నితీశ్​ కుమార్ తిరిగి బీజేపీలోకి వెళ్లలేరని లాలూ భావించారు. కానీ, నితీశ్​ కుమార్ ఎత్తుకు పైఎత్తువేసే సమర్థుడైన రాజకీయ నాయకుడు. లాలూకి షాక్​ ఇచ్చి నితీశ్​ తిరిగి బీజేపీ కూటమిలోకి వెళ్లిపోయాడు. ఈనేపథ్యంలో నితీశ్ కుమార్‌‌ను రెచ్చగొట్టకుండా ఆయనకు ప్రాధాన్యమిస్తూ బీజేపీ ఇప్పుడు తెలివిగా వ్యవహరిస్తోంది.

- డా. పెంటపాటి పుల్లారావు, పొలిటికల్​ ఎనలిస్ట్