గ్రంథాలయాలు విఫలమవుతున్నాయా?

  • నేడు జాతీయ గ్రంథాలయ దినోత్సవం

విజ్ఞానతృష్ణతో, జ్ఞానపిపాసతో  మేధావులే కాకుండా సామాన్యులు కూడా నిత్యం  గ్రంథాలయాలలో అడుగుపెడుతుంటారు. పాఠకులను గౌరవంగా గ్రంథాలయాలు ఆహ్వానిస్తూనే ఉంటాయి. యునెస్కో (UNESCO), ఇఫ్లా (ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ లైబ్రరీ అసోసియేషన్) 1995, 2001, 2022  మేనిఫెస్టోల ప్రకారం ప్రతి 1000 మంది జనాభాకు ఒక పౌర గ్రంథాలయం ఏర్పాటు చేయాలనే నియమం ఉంది. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం భారతదేశ జనాభా 1,441,981,744. అంటే భారతదేశంలో 1,44,198 గ్రంథాలయాలు ఉండాలి.  కానీ, భారతదేశంలో రాజా రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ ప్రకారం 46,746 అని, మార్గ్ సర్వే 2022 ప్రకారం 90 వేల పైచేలుకు పౌర గ్రంథాలయాలు ఉన్నాయని,  మరొక సంస్థ 94 వేల పై చీరకు పౌర గ్రంథాలయాలు ఉన్నాయని నివేదిస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన ప్రస్తుత పరిణామంలో కూడా భారతదేశంలో కచ్చితంగా ఎన్ని పౌర గ్రంథాలయాలు ఉన్నాయనే లెక్కలును ఏ ప్రభుత్వ సంస్థ చేపట్టలేదు. 

ప్రపంచవ్యాప్తంగా 86.3% అక్షరాస్యత 

ప్రపంచవ్యాప్తంగా అక్షరాస్యత రేటు 86.3% ఉండగా...  మొత్తం పురుషులలో 90.0%,  స్త్రీల అక్షరాస్యత రేటు 82.7% ఉంది.  అభివృద్ధి చెందిన దేశాల్లో అక్షరాస్యత శాతం అత్యధికంగా 99.2% (2013) ఉన్నది. 2019 ప్రకారం భారతదేశ అక్షరాస్యత శాతం 77. 70.  భారతదేశంలో పౌర గ్రంథాలయాలు (1993) రామయ్య,( 2003) మజుందార్ లెక్కల ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో 70, 817, పట్టణ ప్రాంతాలలో 4,580 పౌర గ్రంథాలయాలు ఉన్నాయి.  ఇక బడ్జెట్ కేటాయింపులు పరిశీలిస్తే 2019 ప్రదీప్ బాలాజీ మోహన్ రావు, వినయ్ లెక్కల ప్రకారం పర్ కాపిటా.. ఫిన్లాండ్ 30 యూరోలు, ఆస్ట్రేలియా 44.44 డాలర్లు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 35.96 డాలర్లు, హాంకాంగ్ 12 యూరోలు,  నైజీరియా నాలుగు సెంట్లు కేటాయించడం జరుగుతుంది. 

విచిత్రం ఏమంటే పైన చెప్పిన దేశాల్లో  ఏ దేశం కూడా గ్రంథాలయాలకు పన్ను వసూలు చేయకుండా గ్రంథాలయాలకు నిధులు కేటాయిస్తున్నాయి.  భారతదేశానికి సంబంధించి దాదాపు 20 రాష్ట్రాలలో గ్రంథాలయ చట్టాలు ఏర్పడినప్పటికీ మహారాష్ట్ర (1967), కర్నాటక (1965), హర్యానా (1989), కేరళ (1989) రాష్ట్రాలు తప్పితే ప్రతి రాష్ట్రం ఆయా రాష్ట్రంలో ఉన్న ప్రజల నుంచి గ్రంథాలయ పన్నును వసూలు చేయడం జరుగుతోంది. ఉదాహరణకు రెండు తెలుగు రాష్ట్రాలలో రూపాయికి ఎనిమిది పైసల గ్రంథాలయ పన్ను, తమిళనాడు 10%, గోవా 1. 67% వసూలు చేస్తున్నప్పటికీ వాటి ఆదాయాన్ని పౌర గ్రంథాలయాలకు సరిగా కేటాయించకపోవడం శోచనీయం. 

గ్రంథాలయాల్లో పుస్తక సంపద కొరత

భారతదేశంలో  గ్రంథాలయాల సేవలు అనుకున్నంత స్థాయిలో అందండంలేదు.  ఒకవేళ అందించే ప్రయత్నం చేసినా చదువరులు పూర్తిస్థాయిలో వీటిని ఉపయోగించుకోలేకపోతున్నారు. కారణం మౌలిక వసతులు, ఆర్థిక వనరులు, మానవ వనరుల కొరత.  ముఖ్యంగా ప్రస్తుత చదువరులకు ఉపయోగపడే పుస్తక సంపద  గ్రంథాలయాల్లో లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. 

భారతదేశంలో 19వ శతాబ్దం చివరిలో,  20 శతాబ్దం తొలిపాదంలో బరోడా మహారాజు షియాజీ  గైక్వాడ్ -II ఆ ప్రాంతంలోని ప్రజలకు ఉచిత విద్యను అందించేందుకు పాఠశాలలను, అదే విధంగా గ్రంథాలయాలను ఏర్పాటు చేసి ప్రజలకు విజ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేశారు.  గ్రంథపాలకులను అమెరికా నుంచి రప్పించి బరోడా ప్రాంతంలో గ్రంథాలయాల ఉన్నతికి కృషి చేశారు.  అజీమ్ ప్రేమ్ జీ,  కేరళకు చెందిన ఫనిక్కర్,  ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి గ్రంథాలయాల స్థాపనకు కృషి చేస్తున్నారు.  ప్రస్తుతం ప్రపంచంలోని అత్యధిక సంపన్నులుగల  భారతదేశంలో ఉన్న సంపన్నులు ఎంతో కొంత గ్రంథాలయాల ఉన్నతికి,  గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేయాలి.

లైబ్రరీలకు ప్రత్యేక పాలసీ రూపొందించాలి

కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కింద వచ్చేటువంటి ఆదాయంలో  కనీసం ఒక శాతం  గ్రంథాలయాలకు కేటాయించాలి.  పౌర గ్రంథాలయాలలో మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేస్తే ఆ ప్రాంతంలోని ప్రజలకు విజ్ఞానాన్ని అందించే అవకాశం ఉంటుంది. రాష్ట్రస్థాయిలో లేదా  కేంద్ర స్థాయిలో కానీ గ్రంథాలయాలకు ఒక ప్రత్యేకమైన పాలసీ రూపొందించాలి. 

రాష్ట్రాలలో గ్రంథాలయ శాఖ విద్యా మంత్రిత్వశాఖలో, మానవ వనరుల మంత్రిత్వశాఖలో గానీ ఉండడం వల్ల ఆ శాఖలు గ్రంథాలయాలపై ప్రత్యేక దృష్టి కనబరిచిన దాఖలాలు కనపడటం లేదు.  జాతీయస్థాయిలో ఈ శాఖ కల్చరల్ మినిస్ట్రీలో ఉండడం ఒక ప్రత్యేకమైన మంత్రిత్వశాఖ లేకపోవడం వీటిపైన పాలసీలు, కమిషన్లు, కమిటీలు కానీ  ఏవీ కూడా క్షేత్రస్థాయిలో అనుకున్నంత స్థాయిలో పనిచేయకపోవడం చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రంథాలయాలకు మంత్రిత్వశాఖను కేటాయించి ఆర్థిక వనరులు, మౌలిక వసతులు, చదువులకు ఉపయోగపడే  పుస్తక సంపద ఏర్పాటు చేసినట్లయితే పాఠకులను ఆకర్షించే ప్రయత్నం చేయవచ్చు.

డా. రవికుమార్ చేగొనీ,ప్రధాన కార్యదర్శి, తెలంగాణ గ్రంథాలయ సంఘం