ఆధ్యాత్మికం: ముక్కెరతో మగువలకు అందంతో పాటు ఆరోగ్యం కూడా..!

మగువలు అందానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు.  హైటెక్​ యుగంలో మహిళల ఫేస్​ అందంగా కనపడేందుకు స్టైల్​ గా  ముక్కుపుడక పెట్టుకుంటున్నారు.  అయితే  అందానికే పరిమితం కాదని.. ఆచారంతోపాటు ఆరోగ్యం కూడా లభిస్తుందని చెబుతన్నారు.ఆడవారు ముక్కుపుడక ధరించడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. . .

మహిళలకు ముక్కెర ఎంతో అందాన్ని ఇస్తుంది. పురాతన కాలం నుంచి  అనగా కృత యుగం నుంచి ముక్కుపుడక ధరించేవారని పురాణాలు చెబుతున్నాయి. ప్రస్తుత కాలంలో చాలా మంది స్టైల్ గా ఉంటుందని పెట్టుకుంటున్నారు.   సంప్రదాయం ప్రకారం వివాహ సమయానికి అమ్మాయిలకు ముక్కుపుడక తప్పనిసరి అని అనేది ఆచారం. ఇప్పటికీ కొన్ని కుటుంబాల్లో ఈ విధానాన్ని ఆచరిస్తున్నారు.

కొంతమంది వారి కుటుంబ ఆచారం ప్రకారం ఏడు, పదకొండు సంవత్సరాలకు ముక్కు కుట్టిస్తారు. కానీ చిన్న వయస్సులో కుట్టించడం వల్ల ఆరోగ్యపరంగా చాలా మంచిదట.ముక్కుకి కుడివైపున సూర్యనాడి ఉంటుంది. కుడివైపు ముక్కుకు మండలాకారమైన ఒకరాయి ధరించాలని శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే ఎడమవైపున చంద్రనాడి ఉంటుంది. అందువల్ల ముక్కుకు ఎడమవైపున అర్ధ చంద్రాకారంలోని ముక్కు పుడక ధరించాలని పండితులు చెప్తున్నారు. 

ఇంకా  ముక్కు ఎడమవైపున ముక్కుపుడక ధరించడం ద్వారా ఆడవారికి గర్భకోశవ్యాధులు తగ్గుతాయట. పురుటి నొప్పులు ఎక్కువ కలగకుండా సుఖ ప్రసవం అవడానికి సహకరిస్తుందట. కన్ను, చెవికి సంబంధించిన నరాలు ఆరోగ్యంగా ఉంటాయట. చెవికి సంబంధించిన వ్యాధులు అనగా చెవిపోటు, చెవుడు వంటివి కలుగకుండా ముక్కుపుడక సహాయపడుతుంది. అంతేకాదు దీన్ని ధరించడం వల్ల శ్వాస సంబంధమైన వ్యాధులు ధరిచేరవు ప్రత్యుత్పత్తి మెరుగుపడుతుందని వైద్యులు చెప్తున్నారు.

ముక్కుపుడకను దక్షిణ భారతదేశంలో  కుడివైపునకు పెట్టుకుంటే.. అదే ఉత్తరాదిన వారు  ఎడమవైపున పెట్టుకుంటారు.  కొన్ని ప్రాంతాల్లో నివసించే ఆదివాసులు, గిరిజనులు వారి కుటుంబ ఆచారం ప్రకారం ముక్కుకు రెండువైపులా కుట్టించుకుంటారు.  దక్షిణ భారతదేశంలో దీన్ని ఎక్కువగా కుడివైపు పెడితే, ఉత్తరాదిన మాత్రం ఎడమవైపు పెడుతుంటారు. గిరిజనులు, ఆదివాసీలు ముక్కుకి రెండు వైపులా ముక్కెరలు పెట్టుకుంటారు.