జల సంరక్షణ లేకుంటే సంక్షోభం తప్పదు!

వృక్షాలు, జంతువులు, మానవాళి, పెరుగుదలకు గాలి తరువాత ముఖ్యమైనది నీరు. ఇది ప్రకృతి సమస్త జీవులకు ప్రసాదించిన ఒక అపురూపమైన వరం.  ప్రకృతి వనరుల్లో భాగమైన నీరు సకల జీవజాతికి ప్రాణాధారం. పంటలకు, మానవజాతి మనుగడకు జలవనరులు కీలకం. తన అవసరాల నిమిత్తం నీటిని ఇష్టారీతిగా వినియోగిస్తున్నందున భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా నీటి ఎద్దడి నానాటికీ తీవ్రరూపం దాలుస్తోంది. ప్రభుత్వాలు ఎంతగా నిధులు ఖర్చు చేస్తున్నా సాగునీటికి, తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదు. 

ఋతుపవనాల అనిశ్చితి, ఉష్ణోగ్రతల్లో మార్పులు, జల సంరక్షణపై నిర్లక్ష్యం కారణంగా నీటి ఎద్దడి రానురానూ జటిలమవుతోంది. మనిషి సజీవంగా ఉండాలంటే తాగునీరు చాలా ముఖ్యం. ఒక వ్యక్తి ఆహారం లేకుండా ఒక నెల పాటు జీవించగలడు.  నీరు లేకుండా నాలుగు రోజులు కూడా జీవించలేడు.  ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజూ కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తాగాలి. అయితే  ప్రస్తుతం మనకి లభిస్తోన్న తాగునీరు మనల్ని ఆరోగ్యవంతుల‌‌ను చేస్తుందా అని ప్రశ్నిస్తే సమాధానం బహుశా లేద‌‌నే చెప్పాలి. 

కోట్లమంది నీటికోసం కటకట

వర్షాభావ పరిస్థితులతో బావులు, చెరువులు, బోర్లు ఎండిపోవడం సర్వసాధారణమైంది.  దేశంలోని ప్రధాన రిజర్వాయర్లలో నీరు అడుగంటిపోతోంది.  గత పదేండ్లతో  పోలిస్తే నీటి ఎద్దడి తీవ్రతరం అయ్యింది. దీంతో నీటి సంక్షోభం ఎప్పుడూ లేనంతగా విలయతాండవం చేస్తోంది.  దాదాపు 450 నదులు ప్రవహించే భారతదేశంలో కోట్లమంది నీటికోసం కటకటలాడడం చాలా బాధాకరమైన విషయం. 1947లో మనదేశంలో నమోదైన తలసరి నీటి లభ్యత 2018 కొచ్చేసరికి నాలుగోవంతుకు పడిపోయింది.  ప్రతి పౌరుడి సగటు నీటి లభ్యత ప్రాతిపదికన వరుసగా ప్రపంచ ర్యాంకింగ్‌‌లో అమెరికా 545 లీటర్లతో, ఆస్ట్రేలియా 481 లీటర్లతో, ఇటలీ 380 లీటర్లతో, జపాన్‌‌ 375 లీటర్లతో వరుస స్థానాల్లో ఉన్నాయి. 

కానీ, భారత్‌‌ తలసరి నీటి లభ్యత కేవలం 91.5 లీటర్లు ఉంది.  ప్రమాదకర స్థాయిలో ఆర్సెనిక్‌‌ కలిసిన నీటిని 19 శాతం భారత ప్రజలు తాగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. గ్రామాల్లో, పట్టణాల్లో నివసించే కోట్లాది ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేసే ప్రక్రియ సక్రమంగా నిర్వ ర్తించలేకపోతున్నాయి. అన్ని రాష్ట్రాల్లోని భూగర్భ జలాల్లో విషపూరిత లోహాలు అధికంగా ఉన్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. 
నీటిలో అధిక మొత్తంలో సీసం నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. అధిక స్థాయి కాడ్మియం మూత్ర పిండాల వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. మొత్తం మీద విషపూరిత నీటిని తాగుతూ దేశ జనాభా అనారోగ్యానికి గురవు తున్నారు.   

డేంజర్​ జోన్​లో దేశం

2030 నాటికి దేశ జనాభాలో 40 శాతం మందికి గొంతు తడుపుకోవడానికి నీళ్లే దొరకని పరిస్థితి వస్తుందని ‘కాంపోజిట్ వాటర్ మేనేజ్‌‌మెంట్ ఇండెక్స్ (సీడబ్ల్యుఎంఐ) రిపోర్ట్ కూడా గతంలో వెల్లడించింది. నీళ్లకు సంబంధించి దేశం డేంజర్ జోన్‌‌లో ఉంది. గ్రామాల్లో తాగు నీటికి ప్రధాన వనరులు. చేతి పంపులు, బావులు, నదులు, చెరువులు. సాధారణంగా గ్రామాల్లో ఈ నీటిని శుభ్రం చేయడానికి మార్గం లేదు.  

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు విషపూరితమైన నీటిని తాగాల్సి వస్తోందని రాజ్యసభ వెల్లడించింది. ప్రభుత్వం జల్ జీవన్ మిషన్‌‌ను ఆగస్టు 2019లో ప్రారంభించినట్లు లోక్‌‌సభకు తెలిపింది. దీని కింద 2024 నాటికి ప్రతి గ్రామీణ ఇంటికీ కుళాయిల ద్వారా తాగునీరు సరఫరా చేయాలి. కానీ, ప్రభుత్వం ఇచ్చిన డేటా ప్రకారం ఇప్పటి వరకు 9.81 కోట్ల కుటుంబాలకే కుళాయి నీటిని సరఫరా చేస్తున్నారు.  అందరికీ స్వచ్ఛమైన నీరు అందించాలనేది ముఖ్యమైన అడుగు. దీనిని పరిష్కరించకపోతే, ఖచ్చితంగా ప్రపంచ సంక్షోభం ఏర్పడుతుంది. 

 ప్రపంచ జనాభాలో 26 శాతం మందికి శుద్ధమైన తాగునీరు అందడం లేదని, 46 శాతం మందికి కనీస పారిశుధ్య సదుపాయాలు అందుబాటులో లేవని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. ప్రపంచంలోని ప్రజలందరికీ 2023 నాటికల్లా శుద్ధమైన తాగునీరు, పారిశుధ్య సదుపాయాలు అందాలని ఐరాస పెట్టుకొన్న లక్ష్యానికి చాలా దూరంలో ఉన్నామని యూఎన్‌‌ వరల్డ్‌‌ వాటర్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ రిపోర్టు-2023లో పేర్కొన్నది. 

నీటి పొదుపును సంస్కృతిగా పాటించాలి

తమిళనాడు, కర్నాటక, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌‌, తెలంగాణా, ఒడిశాలాంటి రాష్ట్రాల్లోని చాలా జిల్లాల్లో ఫ్లోరైడ్‌‌ సమస్య ఉంది. చాలా చోట్ల సీసం, క్రోమియం వంటివి నీటి మౌలిక స్వభావాన్ని మార్చుతున్నాయి. వర్షజలాల పరిరక్షణ, భూగర్భజల మట్టాల సంరక్షణ, వృథా నివారణ, నీటి వాడకంలో పొదుపును ఒక జాతీయ సంస్కృతిగా పాటించాలి. జల కాలుష్యాన్ని నివారించి నీటి కటకట లేకుండా సకల చర్యలు తీసుకోవాలి. 

ఈ విషయంలో ఆస్ట్రేలియా, యూకే, దక్షిణాఫ్రికాలు ముందున్నాయి. మొబైల్‌‌ జిప్‌‌ సాంకేతికతలో ఇజ్రాయిల్‌‌, అరబ్‌‌ దేశాలు 70 శాతం మురుగునీటిని సేకరించి శుద్ధి చేసి మళ్లీ వాడేలా చర్యలు తీసుకుం టున్నాయి.  సమగ్రమైన జల సంరక్షణ ద్వారా జల భద్రత చేకూరుతుందని ప్రచారం చేయడానికి ‘జలశక్తి అభియాన్’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ప్రతి వర్షపునీటి బొట్టును ఒడిసి పట్టడానికి ఈ కార్యక్రమాన్ని రెండు దశల్లో నిర్వహించాలన్నది ప్రభుత్వ సంకల్పం.  

మొదటి దశలో ఏటా జులై 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు నైరుతి రుతుపవన సమయంలో,   రెండవదశలో అక్టోబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు ఈశాన్య రుతుపవనాల  సమయంలో అవగాహన కల్పించాలనే  బృహత్తర లక్ష్యాలతో ఈ పథకాన్ని నిర్దేశించారు.  భూగర్భ జల మట్టాల సంరక్షణ,  వృథా నివారణ, నీటి వాడకంలో పొదుపును ఒక జాతీయ సంస్కృతిగా పాటించాలి.  ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, యువత,  జల సంరక్షణ గురించి ప్రజల్లో విస్తృత ప్రచారం చెయ్యాల్సిన అవసరం ఉంది. 

తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి ఫ్రీలాన్స్ రైటర్