ఏపీలో కాంగ్రెస్..ఉనికిని చాటేనా?

ఆంధ్రప్రదేశ్​లో  త్వరలో  జరగనున్న ఎన్నికల్లో  అద్భుతాలు జరుగుతాయని కాంగ్రెస్‌‌‌‌ పార్టీ భారీగా అంచనా వేస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తాను ఆంధ్రాలో కాంగ్రెస్‌‌‌‌ పార్టీకి సహాయం చేశానని, రాజకీయ బహిరంగ సభకు కూడా హాజరయ్యానని చెప్పే అవకాశాన్ని కోల్పోకూడదనుకుంటున్నారు. 2014లో ఉమ్మడి ఏపీ  విభజన అనంతరం అవశేష ఆంధ్రప్రదేశ్​లో ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం కొనసాగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్​ పార్టీతో పాటు తెలుగుదేశం, జనసేన కూడా ప్రాంతీయ పార్టీలుగా మారాయి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ రెండూ ఆంధ్రాలో నామమాత్రంగా మిగిలాయి.

కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, ఆంధ్రప్రదేశ్​ విభజన తర్వాత కాంగ్రెస్​ అధినేత్రి  సోనియాగాంధీ తెలంగాణలో కాంగ్రెస్ గెలిచి అధికారం సాధిస్తామని, ఆంధ్రాలోనూ తగిన ఓట్లు సాధిస్తామని భావించారు. కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు సోనియా గాంధీని పూర్తిగా తప్పు పట్టారు. కాంగ్రెస్ ఆంధ్రాలో పూర్తిగా  తుడిచిపెట్టుకుపోయింది.  తెలంగాణలో  కేసీఆర్ చేతిలో ఓడిపోయింది. 2023లో  కేసీఆర్‌‌‌‌ను  ఓడించాలన్న  ప్రజాకోరిక మాత్రమే తెలంగాణలో కాంగ్రెస్‌‌‌‌ను గెలిపించింది. 

కాంగ్రెస్ హైకమాండ్​ మద్దతు

2014, 2019లో  జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్‌‌‌‌ పార్టీని పూర్తిగా తిరస్కరించారు. కాంగ్రెస్‌‌‌‌కు వందలాది మంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు ఉన్నప్పటికీ 2014 నుంచి ఏపీలో ఒక్క ఎమ్మెల్యే లేదా ఎంపీని కూడా కాంగ్రెస్‌‌‌‌  గెలవలేకపోయింది.  కాంగ్రెస్‌‌‌‌పై  ఆంధ్రులు తమ తీవ్ర ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో అలా వ్యక్తం చేశారు. అయితే,  ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్‌‌‌‌కు నాయకత్వం వహిస్తున్న షర్మిలారెడ్డికి  కాంగ్రెస్  హైకమాండ్ మద్దతు ఉందని అందరికీ స్పష్టంగా అర్థమైంది.

 వైఎస్ఆర్  తెలంగాణ పార్టీ  పతనం తర్వాత షర్మిల తన రాజకీయ జీవితాన్ని తిరిగి  ప్రారంభించాలని కోరుకున్నారు. ఈనేపథ్యంలో ఆమె ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉండటం కాంగ్రెస్ పార్టీకి,  షర్మిలకు ఇద్దరికీ ఉపయోగకరం.  షర్మిలా రెడ్డి ప్రముఖ రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. ఆమె స్వయంగా 2009 నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ వస్తున్నారు. ఆమెకు రాజకీయాలలోని ప్రతి అంశం తెలుసు.  

కడప నుంచి షర్మిల పోటీ 

2014 వరకు ఆంధ్రప్రదేశ్​లో  కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగింది.  వైఎస్ఆర్  కాంగ్రెస్  ఆవిర్భవించిన తర్వాత  కాంగ్రెస్ ఓటర్లు  వైఎస్ఆర్  కాంగ్రెస్  వైపు మళ్లారని భావించారు. కానీ, అది  పూర్తి నిజం కాకపోవచ్చు. కాంగ్రెస్ ఓటు ఏపీలో అన్ని రాజకీయ పార్టీలకు మళ్లింది. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్‌‌‌‌కు సారథ్యం వహిస్తున్నందున, సహజంగానే పాత కాంగ్రెస్ ఓటర్లు ఆమెకు మద్దతు ఇస్తారని, ఇది వైఎస్ఆర్ సీపీకి నష్టం అని ప్రజలు భావిస్తున్నారు. కడప పార్లమెంట్​ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. షర్మిల కడపలో పోటీ చేయడం ఆమె సోదరుడు వైఎస్‌‌‌‌ఆర్‌‌‌‌ జగన్‌‌‌‌పై  ప్రభావం చూపనుంది.

వైఎస్​ వివేకానందరెడ్డి హత్య కేసు కూడా అదనపు అంశం. దీంతో మొత్తం ఎన్నికలు పెద్ద పోటీగా మారనున్నాయి. షర్మిల వైఎస్‌‌‌‌ఆర్‌‌‌‌ రాజశేఖర్‌‌‌‌రెడ్డి కుమార్తె కావడంతో  స్థానికంగా  విభేదాలు రావచ్చు.  షర్మిల  గెలుపొందినా,  మెరుగైన ఫలితం సాధించినా అది కాంగ్రెస్‌‌‌‌కు ఎంతో మేలు చేస్తుంది. అయితే షర్మిల ఘోరంగా ఓడిపోతే మళ్లీ ఆమెకు  కెరీర్-పరంగా ఛాలెంజ్ ఎదురుకావచ్చు. కాంగ్రెస్ పార్టీలో ఇతర నేతలు అందరూ ఇప్పుడు రేవంత్ రెడ్డిని మెచ్చుకుంటున్నారు. అయితే, తెలంగాణలో కాంగ్రెస్ ఓడిపోయి ఉంటే  రేవంత్ రెడ్డిని ఇతర నేతలు వెంబడించి అవమానించి ఉండేవారు.  

టీడీపీ, జనసేన, బీజేపీకి షర్మిల అస్త్రమౌతుందా?

షర్మిల వైఎస్‌‌‌‌ఆర్‌‌‌‌ జగన్‌‌‌‌ను రాజకీయంగా నిర్వీర్యం చేస్తారని భావించిన టీడీపీ కూటమి షర్మిల పట్ల సంతోషంగా ఉంది. అయితే కడపలో షర్మిలకు టీడీపీ కూటమి  బహిరంగంగా లేదా రహస్యంగా సహకరిస్తుందో లేదో చూడాలి. ఒక్కటి మాత్రం నిజం షర్మిలారెడ్డికి మంచి రాజకీయ భవిష్యత్తు అందించాలనే  దీర్ఘకాలిక ఆసక్తి టీడీపీకి లేదు.  రాజకీయంగా జగన్​పై  పోరాడేందుకు ఆమెను వాడుకోవాలని చూస్తున్నారు.

రాజకీయ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఒక రాజకీయ పార్టీ 10% కంటే తక్కువ ఓట్లను పొంది, 10 సంవత్సరాలకు పైగా అధికారంలో భాగస్వామ్యం పొందకపోతే ఆ పార్టీ నెమ్మదిగా అదృశ్యమవుతుంది. పదేండ్లుగా ఆంధ్రాలో కాంగ్రెస్ చాలా ఘోరమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆంధ్రాలో కాంగ్రెస్ బాగా పుంజుకోవాలి  లేదా ఉత్తరప్రదేశ్ ఇతర రాష్ట్రాలలో వలె  అది నెమ్మదిగా జీరో పార్టీగా మారుతుంది.

షర్మిల పొలిటికల్​ కెరీర్​కు పరీక్ష

సీనియర్  నేతలందరినీ ఎన్నికల్లో  పోటీకి దింపేందుకు షర్మిల ప్రయత్నాలు చేశారు. ఈ విషయంలో ఆమె పాక్షికంగా విజయం సాధించింది, కానీ, కొందరు సీనియర్‌‌‌‌ మాజీ మంత్రులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అంగీకరించినా ప్రముఖ నాయకులు పోటీ చేయడానికి నిరాకరించారు. చాలామంది  కాంగ్రెస్  నేతలు షర్మిలా రెడ్డికి మద్దతు ఇస్తున్నట్లు నటిస్తూ ఆమెతో  కలిసి ప్రయాణించి తమను తాము సముదాయించుకుంటున్నారు. అయితే ఆమె విజయం సాధిస్తుందా లేదా అని సీనియర్  కాంగ్రెస్​ నేతలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

షర్మిలారెడ్డి కాంగ్రెస్‌‌‌‌కు గౌరవప్రదమైన ఓట్లు సాధిస్తే  ఆ క్రెడిట్ అంతా తమదే అంటారు.  ఒకవేళ  కాంగ్రెస్  మళ్లీ  ఫ్లాప్ అయితే షర్మిల మీదనే ఆ భారం మోపుతారు. మొత్తం మీద,  అసెంబ్లీకి సింగిల్​ డిజిట్​ శాసన సభ్యులను, పార్లమెంటుకు ఒకటి అరా సభ్యులను గెలిపించగలిగితే, ఏపీలో షర్మిలా రెడ్డి నాయకత్వానికి గట్టి పునాదులు పడినట్లుగానే భావించవచ్చు.  ఏపీలో ప్రజా ప్రాతినిధ్యం కోల్పోయిన కాంగ్రెస్​ పార్టీకి అదొక బూస్ట్​అవుతుంది.  కానీ, ఏపీలో కాంగ్రెస్​పార్టీ అసెంబ్లీలోకి ప్రవేశించగలుగుతుందా లేదా అనేదే ప్రస్తుతం ఏపీ ఎన్నికల్లో హాట్​ టాపిక్​! 

డా. పెంటపాటి పుల్లారావు, పొలిటికల్​ ఎనలిస్ట్​