గాయపడ్డ గానమా..తిరగపడ్డ రాగమా

గద్దర్ అనేది మూడు అక్షరాల పేరు మాత్రమే కాదు.  సుమారు నలభై  గ్రీష్మాల ఉద్యమ జీవధారకు సజీవ సాక్షి.  గద్దర్ రాజకీయ  జీవితాన్ని మూడు భాగాలుగా విభజిస్తే మొదటగా ప్రాథమిక చైతన్యం అంబేద్కర్​తో మొదలై ఆర్ట్ లవర్ వరకు సాగింది.  అనంతరం విప్లవ ఉద్యమంలోకి.. సాంస్కృతిక విప్లవ కార్యకర్తగా సాగిన ఆయన ప్రయాణం గుమ్మడి విఠల్ రావు నుంచి గద్దర్​గా మారిన వైనం అందరికి తెలిసిందే. ఇక మూడోది తాను విప్లవ జీవితం నుంచి బయటికి వచ్చాక తెలంగాణ ఉద్యమం నుంచి నేటి పాలక వర్గ రాజకీయాల వరకు  గద్దర్ తన జీవితంలో అనేక రాజకీయ ఘర్షణలకు లోనైనట్టు మనకు అర్థం అవుతుంది.

అస్తిత్వ పోరాటాల కాలం మొదలు కావడం, విప్లవ ఉద్యమం కొద్దికొద్దిగా సెట్ బ్యాక్ కావడం, నిర్బంధాలు, ఎన్​కౌంటర్లు,  అక్రమ కేసులు, పాలకవర్గ  రాజకీయాలు పైచేయి కావడం,  గ్లోబలైజేషన్ తరువాత బల పడ్డ మార్కెట్ సంస్కృతి ప్రభావం ఉద్యకారులపై పడటం లాంటి పరిస్థితులు  వ్యవస్థలో గందరగోళానికి  గురి చేశాయి. పరిస్థితులకు అనుకూలంగా కదలటం కార్యాచరణలో  మొదలవటం  అనే ఆచరణలో ఉన్న గద్దర్ ప్రతి ఉద్యమానికి సంఘీభావం తెలపడం వారితో  కలిసి ప్రయాణం చేయడంతో గద్దర్ కొన్ని విమర్శలను కూడా మూటకట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడ్డది.

దేశవ్యాప్తంగా గద్దర్​ గళం

డెబ్భై, ఎనభైవ దశకంలో  దేశవ్యాప్తంగా  గద్దర్ గళం మారుమోగింది. తెలుగు నేలమీద  శ్రీశ్రీ కవిత్వం  యువతను  విప్లవీకరిస్తే,  గద్దర్ పాట సాయుధులను చేసింది. ఒకదశలో అడవిబాట పట్టిన అజ్ఞాత కార్యకర్తలంతా గద్దర్ పాట ప్రభావమే అనే పొలీస్ డిపార్ట్​మెంట్​ ప్రకటన విడుదల చేసేదాకా వెళ్ళింది.  పరిస్థితులు యువతను ఉద్యమం వైపు నెట్టివేస్తే.. గద్దర్ పాట దండకారణ్యానికి దారి చూపింది. అమ్మా తెలంగాణమా.. ఆకలి కేకల గానమా అంటూ తెలంగాణ ఉద్యమంలోకి అడుగుపెట్టిన గద్దర్ నాటి  సమైక్య పాలకులకు  కొరకరాని కొయ్యగా మారాడు.  

మలిదశ ఉద్యమం

విజన్ 2020  మోజులో  ప్రపంచీకరణ ప్రయోగశాలగా మార్చి హైటెక్ పాలన పేరుతో  నాడు చంద్రబాబు  పాలన కొనసాగింది. ఓ వైపు  ప్రపంచ బ్యాంకు నమూనాను వ్యతిరేకిస్తూ  వామపక్ష,  ప్రగతిశీల,  విప్లవశక్తులు,  చంద్రబాబు పాలనా  విధానాలను ఎండగడుతూ పెద్దఎత్తున బాబు వ్యతిరేక క్యాంపెయిన్ ను  ముమ్మరం చేశాయి.  మరోవైపు  గద్దర్  ఆధ్వర్యంలో  తెలంగాణ ఉద్యమం మొదలుకావడం, హైదరాబాద్​కు  కూతవేటు దూరంలో ఉన్న భువనగిరిలో  మలిదశ  తెలంగాణ ఉద్యమానికి పురుడు పోయడం నాటి సమైక్యాంధ్ర  పాలకు లకు మింగుడు పడని అంశంగా మారింది. భువనగిరి సభ విజయవంతం కావడంతో  తెలంగాణ జన సభ ఆవిర్భావం, తెలంగాణ ఉద్యమం ఊరూవాడా  మారుమోగింది.  నాటి  పీపుల్స్ వార్  పార్టీ  ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా  ఉండటంతో  తెలంగాణ ఉద్యమాన్ని చంద్రబాబు ప్రభుత్వం  సహించలేక పోయింది.

గద్దర్​పై కాల్పులు

ప్రజల ఆకాంక్షలకు తోడుగా  ప్రజా ఆకర్షణ ఉన్న గద్దర్  కూడా తోడు కావడంతో తెలంగాణ ఉద్యమానికి బలం చేకూరింది. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేతలో భాగంగా నాటి  సర్కారు గద్దర్ పై కాల్పులు జరిపించింది. మరో తెలంగాణ  ఉద్యమకారిణి  బెల్లి లలితను 16 ముక్కలుగా నరికించింది. గద్దర్ పై కాల్పుల ఘటన  రాష్టంలోనేగాక  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలు నిరసన తెలిపాయి. దేశవ్యాప్త మేధావి వర్గం నిరసన వ్యక్తం చేసింది. ప్రజా పౌరహక్కుల సంఘాలు ఆందోళనలు చేశాయి.  కాల్పుల ఘటనను నిరసిస్తూ కవులు, కళాకారులు గళం విప్పారు. గద్దర్​పై కాల్పుల ఘటనపై నాటి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దోషులు మాత్రం ఇంతవరకు పట్టుబడలేదు. గద్దర్  మాత్రం తనపై కాల్పులు జరిపింది  ఎవరో తేల్చాలని తన చివరిశ్వాస వరకు పోరాడారు. 

దోషులు మాత్రం పట్టుపడలేదు

కాల్పుల తాలూకు తూటా గద్దర్ శరీరంలోనే  ఇమిడి పోయింది. చివరకు తూటా ఇన్ఫెక్షన్  తీవ్రం కావడంతో ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడింది.  తెలంగాణ కోసం ఆడి పాడి ఉద్యమానికి వేగం పెంచిన  గద్దర్ కు ప్రత్యేక తెలంగాణ అనంతరం ఏర్పడిన కేసీఆర్​ ప్రభుత్వంలోనూ అన్ని అవమానాలే.  కేసీఆర్​కు వినతి పత్రం ఇచ్చేందుకు ప్రగతి భవన్ కు వెళితే  కనీసం అపాయింట్​మెంట్ ఇవ్వకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం అవమానించింది. 70 ఏండ్ల  వయస్సులో ఆయన్ను నాలుగు గంటలపాటు ఎండలో నిలబెట్టడం.. నాటి కేసీఆర్ ప్రభుత్వం దుర్మార్గపు అరాచక పాలనకు  పరాకాష్ట.  సమైక్య పాలకులు గద్దర్ పై  కాల్పులు జరిపిస్తే  తాను  పోరాడి సాధించిన తెలంగాణలో రాష్ట్ర పాలకులు అవమానించి పరోక్ష హత్యకు  పాల్పడటం విషాదం.

- దొమ్మాట వెంకటేష్,
ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

  • Beta
Beta feature
  • Beta
Beta feature