2024లో శని వక్ర దశలోకి... ఏరాశి వారికి ఎలా ఉందంటే...

కొత్త సంవత్సరం ప్రారంభం కావడానికి ఇంకా మూడు  రోజుల (డిసెంబర్​ 28 నుంచి) సమయం మాత్రమే ఉంది. 2024 నూతన సంవత్సరంలో శని దేవుడు ఏడాది పొడవునా కుంభరాశిలోనే సంచారం చేయనున్నాడు. అయితే2024  జూన్ 29న తిరోగమనంలో సంచరిస్తాడు. . గ్రహ సంచారాల రివర్స్ కదలికల కారణంగా కొన్ని రాశిచక్రాలపై ప్రతికూల ప్రభావం ఉంటుంది.

 వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో శని దేవుడికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శని దేవుడు అత్యంత నెమ్మదిగా ప్రయాణం చేస్తున్నాడు.  కొత్త ఏడాది 2024లో శని దేవుడు కుంభరాశిలోనే సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో శని మహారాజు మేషం నుంచి మీన రాశులపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాడు. శని దేవుడు వక్ర మార్గంలో ప్రయాణించడం వలన  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ రాశి వారిపై ఎలాంటి  ప్రభావం ఉంటుందోతెలుసుకుందాం...

మేష రాశి(Aries)..

ఈ రాశి వారిలో వ్యాపారులు శని దేవుని శుభ ప్రభావం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందుతారు. మీ ఆదాయం పెరుగుతుంది. కొత్త ఏడాదిలో మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. ఉద్యోగులకు వేతనాలు పెరుగుతాయి. మీ పిల్లల పురోగతి కొంత ఆందోళన చెందుతారు. ఆరోగ్య పరంగా కొంత ఇబ్బంది ఉంటుంది. 2024 మే మాసంలో ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉంది. మీరు ఎక్కువ డబ్బు ఆదా చేయగలుగుతారు. శని దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రతి శనివారం నల్ల నువ్వులను దానం చేయాలి.

వృషభ రాశి (Taurus)..

ఈ రాశి వారు కొత్త ఏడాదిలో శని సంచారం వల్ల అద్భుత ప్రయోజనాలు పొందుతారు. మీ జీవితంలో సానుకూల ఫలితాలొస్తాయి. కొత్త ఏడాదిలో మీరు విదేశాలకు వెళ్లే అవకాశాలను పొందొచ్చు. 2024వ సంవత్సరం మీరు ఎక్కువ డబ్బు ఆదా చేస్తారు. మీ పనులన్నీ నిజాయితీగా చేస్తారు. జూన్ నుంచి నవంబర్ వరకు మీ కెరీర్ సంబంధిత నిర్ణయాలు తీసుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం మారడం గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. శని దేవుని అనుగ్రహం కోసం ప్రతి శనివారం రోజున మీ సామర్థ్యం నిరుపేదలకు బట్టలు దానం చేయాలి.

మిధున రాశి(Gemini)..

ఈ రాశి వారు కొత్త ఏడాదిలో శని ప్రభావం కారణంగా మిశ్రమ ఫలితాలను పొందుతారు. మీరు అనుకున్న ఫలితాలు రాకపోవచ్చు. మీరు ప్రయాణం చేసి అలసిపోవచ్చు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య పరమైన విషయాల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. కష్టపడి పని చేస్తే కెరీర్లో మంచి విజయం సాధిస్తారు. మీ ఆదాయం పెరుగుతుంది. ఫిబ్రవరి, మార్చి నెలలో ఉద్యోగులకు ప్రమోషన్ రావొచ్చు.

కర్కాటక రాశి(Cancer)..

ఈ రాశి వారు కొత్త సంవత్సరంలో శని దేవుని ప్రభావంతో ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. కెరీర్‌కు సంబంధించి మీ ఒత్తిడి కూడా పెరుగుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. . మీ భాగస్వామితో విభేదాలు రావొచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.  మే తర్వాత మీకు కొంత మెరుగైన ఫలితాలు రావొచ్చు. కెరీర్ పరంగా కష్టపడి పనిచేస్తే, ఆశించిన ఫలితాలను పొందుతారు. 2024లో ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలొస్తాయి.

సింహ రాశి(Leo)..

ఈ రాశి వారు వచ్చే సంవత్సరంలో శని గ్రహ ప్రభావంతో కొన్ని అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాపారులు కొన్ని రకాల అడ్డంకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు త్వరగా అలసిపోయే అవకాశం ఉంది. మే తర్వాత శుభకార్యాల కోసం కొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది. మీ ఇంట్లో వివాహ కార్యక్రమం జరగే అవకాశం ఉంది. శని తిరోగమనం సమయంలో మీరు చేసే పనిలో మెరుగైన ఫలితాలొస్తాయి. వ్యాపారులకు మంచి లాభాలు రావొచ్చు.

కన్య రాశి (Virgo)..

ఈ రాశి వారు వచ్చే సంవత్సరంలో శని గ్రహ సంచారం కారణంగా గొప్ప విజయాలను సాధించనున్నారు. వ్యాపారులు మంచిగా రాణిస్తారు. మీ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. మీకు అవసరమైన రుణాలను సులభంగా పొందొచ్చు. ఉద్యోగులకు మార్పులు ఉండొచ్చు. కాబట్టి తెలివిగా నిర్ణయాలు తీసుకోండి. ఫిబ్రవరి నుంచి మార్చి వరకు కెరీర్ పరంగా కొంత ఇబ్బంది ఉంటుంది. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

తులా రాశి (Libra)..

ఈ రాశి వారు కొత్త సంవత్సరంలో శని వక్రగమనంలో సంచరించడం వలన ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. కెరీర్ పరంగా అనేక విజయాలు సాధిస్తారు. మే తర్వాత మీరు ఆకస్మాత్తుగా పూర్వీకుల ఆస్తి ప్రయోజనాలు పొందుతారు. శని సంచార ప్రభావంతో వ్యాపారులు ఆర్థిక లాభాలను పొందుతారు. ఈ కాలంలో మీరు పిల్లల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఈ సమయంలో అనవసర ఖర్చులు కూడా పెరగొచ్చు.

వృశ్చిక రాశి(Scorpio)..

ఈ రాశి వారు కొత్త ఏడాదిలో ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు చేసే పనుల్లో వైఫల్యం కారణంగా కొంత నిరాశ చెందుతారు. మే తర్వాత, మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ సంవత్సరం వాహనం లేదా ఆస్తిని కూడా కొనుగోలు చేయొచ్చు. మీ బంధువుల నుంచి సహాయం పొందొచ్చు. జూన్ నుంచి నవంబర్ వరకు సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు. మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి.

ధనస్సు రాశి (Sagittarius)..

ఈ రాశి వారు నూతన సంవత్సరంలో పనికి సంబంధించి మంచి ఫలితాలను పొందుతారు. కెరీర్ పరంగా మీరు అద్భుతమైన విజయాలను సాధిస్తారు. మే తర్వాత, ప్రతికూల ఫలితాలొస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబం పట్ల మీ బాధ్యతలు పెరగొచ్చు. జూన్ నుంచి నవంబర్ వరకు అశుభ ఫలితాలొస్తాయి. ఈ కాలంలో కెరీర్ పరంగా ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి.

మకర రాశి (Capricorn)..

ఈ రాశి వారు కొత్త ఏడాదిలో శని వక్ర సంచారం కారణంగా ఆర్థిక పరమైన సమస్యలను ఎదుర్కొంటారు. మీ ఖర్చులు కూడా పెరగొచ్చు. మీ ఆదాయం తగ్గే అవకాశం ఉంటుంది. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఎక్కడైనా పెట్టుబడి పెట్టే ముందు లాభ, నష్టాల గురించి ఆలోచించండి. కెరీర్ పరంగా మార్పులు చేయాలని ఆలోచిస్తుంటే, కొన్ని సలహాలు తీసుకోవాలి. కుటుంబంలో అనవసర సమస్యలు పెరిగే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. 

కుంభ రాశి (Aquarius)..

ఈ రాశి వారు కొత్త ఏడాదిలో శని గ్రహం కారణంగా అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ ఆత్మ విశ్వాసం తగ్గే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు పెరుగుతాయి. ఆర్థిక పరమైన విషయాల్లో అడ్డంకులు ఉండొచ్చు. మే తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి. మీ కుటుంబ అవసరాలను తీర్చడానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు. జూన్ నుంచి నవంబర్ వరకు శని తిరోగమనంలో ఉన్నందున, అన్ని పనుల్లో ఆశించిన ఫలితాలను పొందుతారు.

మీన రాశి (Pisces)..

ఈ రాశి వారు కొత్త ఏడాదిలో శని సంచారం కారణంగా డబ్బు, ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు. పెరుగుతున్న ఖర్చుల కారణంగా ఏడాది పొడవునా చాలా ఆందోళన ఉంటుంది. మరోవైపు కుటుంబ సమేతంగా విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంటుంది. జూన్, నవంబర్ మధ్య మీ ఖర్చులు అనేక రెట్లు పెరుగుతాయి. మీరు బ్యాంకు నుంచి రుణం తీసుకోవాల్సి ఉంటుంది.