పండుగ రోజుల్లో, వేసవి కాలంలో .. అదనపు రైళ్లను నడపాలి

భారత దేశంలోని రవాణా వ్యవస్థలో  రైల్వే వ్యవస్థ అతి పెద్దది.  నిత్యం వేలమందికి పైగా ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తుంటారు.  ప్రతిరోజు వేలకోట్ల రూపాయల ఆదాయం రైల్వే వ్యవస్థకు వస్తోంది. అయితే ఇప్పుడున్న అన్ని రైళ్లలో జనరల్ బోగీలు చాలా తక్కువగా ఉంటున్నాయి. కొన్ని సంవత్సరాల నుంచి వీటి సంఖ్యను కేంద్ర ప్రభుత్వం పెంచడం లేదు. అందువల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ముఖ్యంగా పండుగ రోజుల్లో, ప్రస్తుత వేసవి కాలంలో ప్రయాణికుల రద్దీ  ఎక్కువగా ఉంటోంది.  కొన్ని నెలల క్రితం ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ దేశంలోనే తొలి ఒరిజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్(ఆర్ఆర్టీఎస్) కారిడార్ ను ప్రారంభించారు. 

అమృత్ భారత్, వందే భారత్, నమో భారత్ రైళ్లు ఈ దశాబ్దం చివరినాటికి ఆధునిక రైల్వే వ్యవస్థకు సింబల్ గా మారుతుందని చెప్పారు. అలాగే భారతీయ రైల్వే వ్యవస్థ ప్రపంచంలో మరెక్కడా లేనివిధంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు.  ప్రస్తుత ఆధునిక పోటీ ప్రపంచంలో రవాణా రంగంలో ఇతర దేశాలతో  పోటీ పడడం ఎంత ముఖ్యమో ప్రయాణికుల  రద్దీ దృష్ట్యా ఇప్పుడున్నటువంటి  రైళ్లను కూడా ఆధునీకరించడం, అన్ని రైళ్లలోని సాధారణ బోగీల సంఖ్యను పెంచడం, అదనపు రైళ్లను నడపడం,  ప్రజల ప్రయాణాలకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత  కేంద్ర ప్రభుత్వంపై ఉంది.  కాబట్టి ఈ సమస్యలను  త్వరగా పరిష్కరించాలి.

కె, శ్రావణ్, కొండాపూర్​