చేనేతను మభ్యపెట్టిన రాజకీయం

తెలంగాణ ఉద్యమంలో సెంటిమెంటు పండించడానికి అనేక సమస్యలు లేవనెత్తి రాష్ట్రం ఏర్పాటు తరువాత మరిచిపోయిన వాగ్దానాల్లో  చేనేత రంగం అభివృద్ధి కూడా ఒకటి.  బీఆర్ఎస్​ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో  చేనేత రంగ అభివృద్ధికి, అధ్యయనానికి, విధానాలకు చేసిన వాగ్దానం పదేండ్లు అయినా రూపు దాల్చలేదు. 2017లో  సమగ్ర  చేనేత విధానం తీసుకొస్తామని ఆశ చూపారు. అంతకు ముందు 2016లో  చేనేత లక్ష్మి పథకం ప్రకటించారు. అదీ ముందుకు సాగలేదు. 

అప్పటి ముఖ్యమంత్రి స్వయంగా 14 ఫిబ్రవరి, 2017న సమావేశం ఏర్పాటు చేసి చేనేత కార్మికుల కుటుంబాలు దీనస్థితిలో ఉన్నాయని అంగీకరిస్తూనే వారిని ప్రత్యామ్నాయ ఉపాధికి మళ్లించాలని భావించారు. వారికి ప్రోత్సాహం ఇస్తామని కూడా ప్రకటించారు. కానీ, 18 ఫిబ్రవరి, 2017 నాటి సమీక్షలో  చేనేతలకు, నేత కార్మికులకు ప్రతినిధులుగా భావిస్తున్న పద్మశాలి నాయకుల సమక్షంలోనే వరంగల్లో టెక్స్​టైల్​పార్కు ఏర్పాటు చేస్తున్నామని కేసీఆర్​ ప్రకటించారు. చేనేత రంగానికి పోటీ ఉత్పత్తి వ్యవస్థలలో పవర్​లూమ్​, టెక్స్​టైల్ ​మిల్లులు ఉన్నాయి. ఒకవైపు చేనేత గురించి కండ్లల్ల నీళ్లు వస్తున్నాయని చెబుతూనే ఆ రంగాన్ని ‘నాశనం’ చేస్తున్న టెక్స్​టైల్​ రంగానికి ప్రోత్సాహం ఇస్తామని ప్రకటించడంతో  చేనేత పట్ల గత పాలకుల అవగాహనా లోపం స్పష్టంగా తేలింది. 

ఆప్కో బకాయిలపై స్పష్టత కరువు

చేనేతరంగ అభివృద్ధికి ఒక సంస్థాగత వ్యవస్థ లేకపోవడం చాలా పెద్దలోటు.  చేనేత, పవర్​లూమ్ కార్మికులకు తగిన పథకాలు, నిధులు ఖర్చు చేయటానికి ఒక ప్రత్యేక కార్పొరేషన్ అన్నారు. అది ఇప్పటివరకు రూపం దాల్చలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఆప్కో సహకార సంఘాలకు నాయకత్వం వహించింది.  తెలంగాణ ప్రభుత్వం అదే విధంగా ఒక అపెక్స్ సహకార సంస్థ ఏర్పాటు చేస్తుంది అని భావించారు. అప్పట్లో కమిషనర్ ఒక సమావేశంలో అభిప్రాయ సేకరణ చేశారు. అందరూ సహకార సంస్థ కావాలని, కంపెనీ వద్దని చెప్పారు. తరువాత టెస్కో ఏర్పాటు అయ్యింది. అది కంపెనీయా, సహకార సంస్థనా అని ఇప్పటికీ చాలామందికి తెలియదు. ఆప్కో విభజన కూడా సరిగ్గా జరగలేదు. చేనేత సహకార సంస్థలకు అప్పటి ఆప్కో నుంచి రావాల్సిన బకాయిల గురించి స్పష్టత లేదు. చేనేత సహకార వ్యవస్థను పటిష్టం చేసే ఆలోచన ఎన్నడూ తెలంగాణ  ప్రభుత్వం చేయలేదు. 

జౌళి రంగానికి భారీ ప్రోత్సాహం

2017లో  ఏర్పాటు చేస్తామన్న కార్పొరేషన్​లో  చేనేత, పవర్​లూమ్​ రెండూ ఉండాలని భావించింది అప్పటి ప్రభుత్వం.  అది ఎట్లా సాధ్యం? పులిని, మేకను ఒకే గాటన కట్టినట్లే అని చాలామంది చేనేత రంగ నిపుణులు భావించారు. ఈ కార్పొరేషన్​ ద్వారా సబ్సిడీ మీద నూలు ఇవ్వడం, మగ్గాలను ఆధునికీకరించడం, కొత్త మగ్గాల పంపిణీ, మార్కెటింగ్ వంటి పనులు చేపట్టాలని భావించారు. 

ఏ ఒక్కటీ చేపట్టలేదు. 2017లో రాష్ట్రంలో  కేవలం 17వేల చేనేత కుటుంబాలు మాత్రమే ఉన్నాయని నిర్ధారించారు. అప్పట్లో రాష్ట్రంలో చేనేత మగ్గాల ద్వారా సంవత్సరానికి 209 లక్షల మీటర్ల వస్త్రోత్పత్తి జరుగుతున్నదని, దాని విలువ రూ.717 కోట్లు ఉంటుందని ప్రకటించారు. 2017లో ఫిబ్రవరి నుంచి వరుస సమావేశాలు పెట్టి  చేనేత రంగం గురించి, కార్మికుల సంక్షేమం గురించి ఊదరగొట్టి,  కొన్ని నెలల తరువాత తెలంగాణ ప్రభుత్వం జౌళి రంగానికి భారీ ఎత్తున రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటించింది. 

వీటిలో పెట్టుబడి సబ్సిడీ, 7 ఏండ్లపాటు జీఎస్టీ నుంచి మినహాయింపు,  భూమి ఖర్చులో రాయితీ,  ఐదేండ్లపాటు ఇతర రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ టెక్స్​టైల్​ అండ్ అపరెల్  ఇన్సెంటివ్  స్కీంను 2017లో  ప్రకటించింది.  ఫిబ్రవరి 2017లో  మగ్గాల వస్త్రాలన్నీ కొనుగోలు చేస్తాం,  పవర్​లూమ్​ లకు  రూ.100 కోట్ల రుణం ఇస్తాం అంటూ ‘వరాల వర్షం’ కురిపించిన ముఖ్యమంత్రి, ఆ వరాలన్నీ జౌళి రంగానికి మళ్లించడం ఆశ్చర్యం కలిగించింది.  

చేనేత రంగంపై నిర్లక్ష్యం

1 ఏప్రిల్, 2010  నుంచి 31 మార్చి, 2017 వరకు రుణాలు పొందిన చేనేత కార్మికులకు రూ. లక్ష వరకు రుణమాఫీ అన్నారు.  2018లో  ఈ పథకం కింద  రూ.10.5 కోట్లు విడుదల అయ్యాయని, రుణాల కాల వ్యవధిలో మార్పులు తెచ్చి ఇంకొంత మందికి లబ్ధి చేకూరేలా బడ్జెట్ ఇస్తామని శాసన మండలిలో ప్రకటించారు. కార్మికులకు  నెలకు  రూ.15 వేలు ఆదాయం ఉండాలన్నారు. దాన్ని సుసాధ్యం చేయడానికి ప్రయత్నాలు మాత్రం చేయలేదు.  తెలంగాణ చేనేత అఖిల పక్ష ఐక్య వేదిక ఆధ్వర్యంలో 30 మార్చి, 2016 నాడు ఇందిరా పార్క్ వద్ద ధర్నా సందర్భంలో అప్పటి సీఎం కేసీఆర్​ మాట్లాడుతూ.. చేనేత కార్మికుల పరిస్థితి తనకు తెలుసునని, తన వద్ద ఉన్న రూ.4,500 కోట్ల నిధి నుంచి వారికి న్యాయం చేస్తానని స్వయంగా శాసనసభలో  ప్రకటించారు. 

అది కూడా ఉత్తదే అయ్యింది. ఆప్కో విభజన నేపథ్యంలో ప్రాథమిక సహకార సంఘాల ద్వారా ప్రభుత్వం చేసే నామమాత్రం చేనేత కొనుగోళ్లు కూడా ఆగిపోవడంతో, ఆందోళనలో పడిన చేనేత కుటుంబాలు, ఆయా సహకార సంఘాల నాయకులు, తెలంగాణ చేనేత అఖిలపక్ష ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆప్కో కార్యాలయం ఎదుట 48-గంటల ఆందోళన నిర్వహించారు. 

దీంతో  ప్రభుత్వం అన్ని సహకార సంఘాల నుంచి 70 శాతం వస్త్ర నిల్వలు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ హామీ  ఎప్పటికన్నా అమలు అవుతుందా అని ప్రాథమిక సహకార సంఘాలు, చేనేత పారిశ్రామికులు ఇంకా ఎదురు చూస్తున్నారు. 23 జూన్  నుంచి 2 జులై, 2016 మధ్య జరిగిన రాష్ట్ర చేనేత చైతన్య యాత్ర,  ఆ తరువాత పోచంపల్లి  సభ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచింది. 2017లో జరిగిన వరుస అధికారిక సమావేశాలు ఈ యాత్ర వలన వచ్చిన ఒత్తిడి నేపథ్యంలో జరిగాయి.  కానీ, చివరికి ప్రకటించిన రూ.1200 కోట్ల బతుకమ్మ చీరల పథకం చేనేతకు కాకుండా, పవర్​లూమ్​ రంగానికి ఉపయోగపడింది. చేనేతలకు మిగిలింది శూన్యం.

ఆలోచించాల్సిన అంశాలు

2017--–-22 మధ్య చేనేత, జౌళి శాఖకు రాష్ట్ర బడ్జెట్లో కేటాయించిన నిధులు మొత్తం రూ.3,376.95 కోట్లు.  చేసిన ఖర్చు మాత్రం కేవలం రూ.891.88 కోట్లు. ఇందులో కూడా దాదాపు 90 శాతం జీతాలు, చేనేతయేతర ఖర్చులే. బతుకమ్మ చీరల పథకం గత 7 ఏండ్లుగా అమలు చేస్తున్నా, అందులో ఒక్క పైసా కూడా చేనేత రంగం కోసం కాదు. 2017-–18 నుంచి ఈ పథకానికి రూ.4,124 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, చేసిన ఖర్చు బహుశా 30 శాతం మించదు. 

ఇవి కూడా ఇక్కడవారికి కాకుండా సూరత్ పట్టణంలో ఉండేవారికి ఉపాధిగా ఊతం అయ్యింది. పెట్టిన అరకొర  సిరిసిల్లలోనే అయినా పవర్​లూమ్​ కార్మికుల ఆత్మహత్యలు ఆగలేదు. ఆదాయం తక్కువ, అప్పుల భారం ఎక్కువ.  చేనేత ఉత్పత్తికి ప్రధాన విఘాతం ముడి సరుకు ధరలు క్రమంగా, అస్తవ్యస్తంగా పెరగడం. కేంద్రం మెగా క్లస్టర్ల పథకం తెలంగాణ ఉపయోగించుకోలేదు. ఇక్కడి చేనేత కుటుంబాలకు ఈ పథకం వలన వచ్చింది శూన్యం.  బీమా పథకం లేదు. చేనేత పైన తెలంగాణ ప్రభుత్వ వివక్ష కొనసాగుతూనే ఉంది.

చేనేత అభివృద్ధికి మార్గాలు

పర్యావరణాన్ని కాపాడుతూ, గ్రామీణ స్థాయిలో ఉపాధి కల్పిస్తూ, ఆర్థిక రంగం మీద భారం పడకుండా మనగలిగే సామర్థ్యం కేవలం చేనేత రంగానికే ఉంది. చేనేత రంగం వృద్ధి చెందడం వల్ల, ప్రభుత్వం చాలా తక్కువ పెట్టుబడితో, ఎక్కువ వృద్ధి రేటు సాధించవచ్చు. తెలంగాణలో చేనేత రంగ అభివృద్ధికి సానుకూల రాజకీయ దృష్టి కావాలి. చేనేత రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు పెరగాలి. కనీసం రూ.2000 కోట్ల బడ్జెట్ కేటాయింపులు జరగాలి. చేనేతకు అవసరమైన రుణాలు బ్యాంకుల ద్వారా పావలా వడ్డీకి అందించాలి.  చేనేత రంగం పట్ల గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని  దృష్టిలో ఉంచుకొని ఇప్పటి ప్రభుత్వమైనా చేనేతను నిలబెట్టాలి, బలోపేతం చేయాలి.

డా. దొంతి నర్సింహారెడ్డి,పాలసీ ఎనలిస్ట్​

  • Beta
Beta feature
  • Beta
Beta feature