30 ఏళ్ల క్రితం మోదీతో అమెరికా పర్యటన, అనుభవాలు..!

మొన్ననే  భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లొచ్చారు. క్వాడ్ లీడర్స్ సదస్సులో పాల్గొన్నారు.  1993లో నరేంద్ర మోదీ తొలిసారిగా అమెరికా పర్యటనకు వెళ్లారు. అప్పుడు 40 రోజులపాటు అక్కడ పలు ప్రాంతాలను సందర్శించారు. మోదీతో కలిసి అప్పుడు అమెరికా పర్యటనకు వెళ్లిన టీమ్ లో  నేను కూడా ఉండడం నా అదృష్టం. ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మరో నలుగురు కూడా అప్పటి టీమ్ లో ఉన్నాం.  మళ్లీ అమెరికా పర్యటనకు వెళ్తున్న సందర్భంగా మొదటి టూర్ విశేషాలను మోడీ కూడా ‘ఎక్స్’లో గుర్తుచేసుకున్నారు. అప్పటి అనుభవాలను, ఫొటోలను షేర్ చేశారు. అది నాకెంతో సంతోషంగా అనిపించింది.  

అమెరికాలోని వాషింగ్టన్  కేంద్రంగా పనిచేసే ‘ది అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ యంగ్ పొలిటికల్ లీడర్స్ (ఏసీవైపీఎల్) తరచుగా అమెరికా, ఇతర దేశాల్లోని యువ రాజకీయ నాయకుల ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ ను నిర్వహిస్తుంటుంది. అమెరికాలో ఎంపిక చేసిన యువ లీడర్లను ఇతర దేశాలకు పంపించడం, అలాగే ఇతర దేశాల్లోని లీడర్లను అమెరికాకు ఆహ్వానిస్తుంది. ఆయా దేశాల మధ్య సత్సంబంధాలను నెలకొల్పేందుకు, రాజకీయ, సాంస్కృతిక అవగాహన పెంచుకునేందుకు ఈ కార్యక్రమాలు చేస్తుంటుంది. 

భారత్​ డెలిగేషన్​

1993లో మన దేశం నుంచి ఏడుగురు యువ రాజకీయ నాయకులను ఏసీవైపీఎల్ అమెరికాకు ఆహ్వానించింది. అప్పుడు ప్రధానిగా పీవీ నరసింహారావు ఉండగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేను (పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్), నరేష్ రావల్ (గుజరాత్),  హరిశంకర్ గుప్తా (ఢిల్లీ), బీజేపీ నుంచి నరేంద్ర మోదీ (గుజరాత్), జి.కిషన్ రెడ్డి (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్), అనంతకుమార్ (కర్ణాటక),  జనతాపార్టీ నుంచి బాలసుబ్రహ్మణ్యం (తమిళనాడు) ఈ టూర్​కు వెళ్లాం. 

1993 జులై 10న మా టూర్ ప్రారంభమైంది

మేం ఢిల్లీ నుంచి లండన్, అక్కడి నుంచి అమెరికాలోని న్యూయార్క్ చేరుకున్నాం. మా టీమ్ లో బీజేపీ, జనతాపార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ఉండడంతో అక్కడికి వెళ్లడానికి ముందే రాజకీయాలు మాట్లాడొద్దని మేం నిర్ణయించుకున్నాం. కేవలం భారత దేశం గురించే మాట్లాడాలని అనుకున్నాం. అయితే పర్యటనలో భాగంగా డెమోక్రట్, రిపబ్లికన్ నాయకులతో సమావేశాలు జరిగాయి. అప్పుడు కొందరు మా పార్టీ వైఖరుల గురించి అడిగేవారు. అప్పుడు మాత్రం ఎవరి పార్టీ సిద్ధాంతాల గురించి వాళ్లు వివరించాం. నరేంద్ర మోదీ ఎక్కువగా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, హిందూ ధర్మం, భగవద్గీత, యోగా.. ఇలాంటి అంశాలపై ఎక్కువగా మాట్లాడేవారు. అప్పట్లో మేం వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ, ఈ పర్యటనలో మాత్రం స్నేహితుల్లా గడిపాం. 

ప్రపంచ దేశాలను ఆకర్షించేలా భారత్​ వెలుగొందాలి

అమెరికా అధ్యక్ష భవనం వైట్​హౌస్ వద్దకు వెళ్లి బయటి నుంచే ఫొటోలు దిగాం. భారతదేశ ప్రధానమంత్రి అధికారిక నివాసానికి కూడా ఇంత ప్రాముఖ్యత రావాలి, దాన్ని సందర్శించేందుకు   ప్రపంచ దేశాలు ఉత్సాహం చూపించాలని అప్పుడు నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్​లో, భారత్​లో కూడా ఇలాంటి పర్యాటక ప్రాంతాల అభివృద్ధి జరగాలని అనుకున్నాం. మిగిలిన పది రోజుల్లో మాత్రం భారత్​లో తాను నిరంతరం ధరించే కుర్తా, పైజామాలనే వేసుకున్నారు. అన్ని రోజులు కలిసి ఉండడం కారణంగా మా అందరికీ మంచి అనుబంధం ఏర్పడింది. 

దేశం పట్ల చిత్తశుద్ధిని ఆచరణలో చూపుతున్న మోదీ

దేశం పట్ల నరేంద్ర మోదీ కమిట్​మెంట్​ను నేను అప్పుడే తెలుసుకున్నాను. జాతీయ భావాల పట్ల ఆయన స్పష్టంగా ఉండేవారు. దేశ గొప్పతనాన్ని మరింత పెంచాలనే ఆయన చెబుతుండేవారు. అప్పుడు ఆయన చెప్పిన చాలా అంశాలను పదవి బాధ్యతలను చేపట్టిన తర్వాత తన నిర్ణయాల్లో చూపి స్తున్నారు. ప్రపంచంలోనే బలమైన దేశంగా భారత్ ను నిలిపేందుకు మోదీ నిరంతరం ప్రయత్నిస్తున్నారు. విశ్వ గురువుగా నిలపాలని పరితపిస్తున్నారు. 

మోదీ కమిట్​మెంట్​కు ​ఆకర్షితుడనయ్యాను

అప్పట్లో నేను మూడు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఆ తర్వాత కూడా కొనసాగాను. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత మొదటిసారి ప్రధాని అయిన సమయంలో నన్ను పలుమార్లు కలిసిన సందర్భాల్లో ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడేవారు. దేశం పట్ల ఆయనకున్న కమిట్​మెంట్​ను చూసి, ఆయన అడుగుజాడల్లో నడవాలనే మోదీ ఆహ్వానం మేరకు 2019లో నేను బీజేపీలో చేరాను. ఎప్పటికీ ఆయన ఆదర్శాలను పాటిస్తాను. 

అమెరికా ఎదుగుదలపై మోదీ ఆసక్తి

అమెరికాలో ఉన్న 40 రోజుల్లో నరేంద్ర మోదీ ఎక్కువగా తమతో మాట్లాడింది ఆ దేశం మౌలిక సదుపాయాలపరంగా ఎంత అభివృద్ధి చెందింది,  పరిశుభ్రత విషయంలో అమెరికన్లు ఎంత పద్ధతిగా ఉంటారనే మాట్లాడుకున్నాం.  పారిశ్రామికంగా ఆ  దేశం ఎదిగినతీరు,  వాళ్లు చేసే ఉత్పత్తులపై  మోదీ ఆసక్తి  ప్రదర్శించారు. విమానాశ్రయాలు,  విశాలమైన రోడ్లు,  ఎత్తైన భవనాలు.. వాటి నాణ్యత మోదీని ఆకట్టుకున్నాయి. ఒకసారి మేం ఒక వ్యవసాయ క్షేత్రానికి వెళ్లాం.  అది వెయ్యి ఎకరాలకుపైగా ఉంటుంది.  అక్కడ వ్యవసాయ పనిముట్లు, యంత్రాలను, వాటి పనితీరును తెలుసుకునేందుకు మోదీ ఎంతో ఆసక్తి ప్రదర్శించారు. ఆ టూర్ మొత్తం ఆయన ఒక పుస్తకం, పెన్ను దగ్గర పెట్టుకుని అన్నీ నోట్ చేసుకునేవారు.  

– పొంగులేటి సుధాకర్ రెడ్డి, 
బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు, 
తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల సహ ఇన్​చార్జ్