తెలంగాణ అస్తిత్వ గేయాన్ని అడ్డుకోలేరు..

రాష్ట్రంలో కాంగ్రెస్‌‌ ప్రభుత్వం ఏర్పడి రేవంత్‌‌ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్ర పాలనను గాడిలో పెట్టడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారు. గత ప్రభుత్వం 10సంవత్సరాల్లో చేసిన తప్పిదాలను ఒక్కొక్కదానిని సరిచేస్తూ వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం దశాబ్దాల తరబడి అనేక నిర్బంధాలను, అణచివేతలను ఎదుర్కొని పోరాడి సాధించుకున్న రాష్ట్రం. ఈ పోరాటంలో అనేకమంది సమిధలయ్యారు. 

అనేక మంది కవులు  గేయాలు రచించగా, కళాకారులు పాటలు పాడి గజ్జె కట్టి ప్రజలను చైతన్యవంతులను చేశారు. ఏదైనా ఒక ఉద్యమం సాగుతున్నప్పుడు దానికి మద్దతుగా పాటలు పాడి  ఉద్యమాన్ని ముందుకు సాగించడం ఆనవాయితీ. స్వాతంత్య్రోద్యమంలో సైతం బంకింగ్‌‌చంద్ర ఛటర్జీ రచించిన వందేమాతరం గీతం ప్రజలను ఉర్రూతలూగించింది. స్వాతంత్య్రోద్యమం సమయంలో ప్రతీ సభలోనూ ఈ గీతాన్ని ఆలపించేవారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం సమయంలో సైతం అందెశ్రీ రచించిన జయ జయహే తెలంగాణ ఉద్యమం ప్రజలను ఉర్రూతలూగించింది.

కోదండరామ్‌‌కు ఎమ్మెల్సీ పదవి

కళాకారులు, ఉద్యమకారుల ఆవేదనను గుర్తించి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన వారిని సత్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి నిర్ణయించారు. ఇందులో భాగంగా తెలంగాణ ఉద్యమ జేఏసీ కన్వీనర్‌‌గా వ్యవహరించిన కోదండరామ్‌‌కు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు. ఈ నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలందరూ హర్షించారు. కానీ, కేసీఆర్‌‌కు మాత్రం ఈ నిర్ణయం నచ్చలేదు. కోర్టుకు వెళ్లి గవర్నర్‌‌ కోటాలో ఇవ్వవలసిన ఎమ్మెల్సీ పదవిని ఇవ్వకుండా అడ్డుకున్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ధి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం జూన్‌‌ 2న వైభవోపేతంగా నిర్వహించాలని నిర్ణయించింది. 

ఇందులో భాగంగా ముఖ్యమంత్రి అనేక సంచలనాత్మక నిర్ణయాలను తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రజాగళమై ఉద్యమానికి ఊపిరూలూదిన, తెలంగాణ ఖ్యాతిని చాటిన జయ జయహే తెలంగాణ గీతాన్ని భవిష్యత్తులో తరతరాలు పాడుకునేలా, అందరి ఆమోదంతో రాష్ట్ర గీతంగా నిర్ణయించామని, తెలంగాణ కవి, రచయిత అందెశ్రీ 20ఏళ్ల క్రితం రాసిన గీతాన్ని యథాతథంగా ఆమోదించినట్లు సీఎంరేవంత్‌‌రెడ్డి ప్రకటించారు.  మంత్రులు, కాంగ్రెస్‌‌, సీపీఐ, సీపీఎం, తేజస నేతలతోపాటు తెలంగాణ బిల్లును ఆమోదించినప్పుడు ఎంపీలుగా ఉన్నవారు, ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన పార్టీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సచివాలయంలో సమావేశమై రాష్ట్ర గీతంపై చర్చించారు. వారందరి ఆమోదంతో దశాబ్ధి ముగింపు వేడుకలలో ఈ గీతాలను జాతికి అంకితం చేస్తామని రేవంత్‌‌రెడ్డి తెలిపారు. 

ఆస్కార్‌‌ అవార్డు గ్రహీతతో సంగీతం

తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ప్రొ. కోదండరామ్‌‌ను గత 9సంవత్సరాల్లో జరిపిన తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు బీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వం ఒక్కసారి కూడా పిలవలేదంటే కేసీఆర్‌‌లో ఎంత అహంకారం నిండి ఉన్నదో అర్థమవుతున్నది. తెలంగాణ ఒక సామ్రాజ్యమని, దీనికి తానో మహారాజునని, మిగతావారంతా తన సేవకులు, బానిసలని ఆయన భావించారు. జయ జయహే తెలంగాణ గీతానికి ఆస్కార్‌‌ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని అందిస్తే.. ఇతర రాష్ట్రాల వారు ఈ పాటకు  స్వరాలు ఏవిధంగా సమకూరుస్తారు? తెలంగాణవారు దీనికి పనికిరారా? అంటూ మళ్లీ సెంటిమెంట్‌‌ రగిలిస్తున్నారు.
కాళేశ్వరం కాంట్రాక్టు విషయంలో

తెలంగాణ వాదం గుర్తుకురాలేదా

లక్ష కోట్ల ఖరీదైన కాళేశ్వరం కాంట్రాక్టు పక్క రాష్ట్రం వారికి కట్టబెట్టినప్పుడు తెలంగాణ వాదం మీకు గుర్తుకు రాలేదా?  గతంలో అల్లిపూల వెన్నెల పేరుతో బతుకమ్మ పాటను తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఎ.ఆర్‌‌.రెహమాన్‌‌ సంగీతంతో రూపొందించారు. ఈ పాట చిత్రీకరణను జాగృతి అధ్యక్షురాలైన కవిత దగ్గరుండి పర్యవేక్షించారు. గౌతమ్‌‌ వాసుదేవ మీనన్‌‌ ఈ పాట చిత్రీకరణకు దర్శకత్వం వహించారు. 

ఈ పాటలో తెలంగాణ భాష, యాస ఏమాత్రం లేవు. మన భాషతో సంబంధంలేని తమిళనాడుకు చెందిన వ్యక్తులు ఈ పాటకు పనిచేస్తే అభ్యంతరం చెప్పని వారు ఈరోజు తెలుగువాడైన, తెలంగాణలో నివసిస్తున్న కీరవాణి సంగీతం అందిస్తే పక్కరాష్ట్రానికి చెందినవారంటూ కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నారు.  పాటకు సంగీతం అందించటానికి తెలంగాణ వారు పనికిరారా? అని చెబుతున్న మీకు.. తెలంగాణలో గురువులెవరూ లేరనా ఆంధ్రా గురువును తెచ్చి సన్మానించి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోపెట్టిన రోజున ఈ విషయం గుర్తుకు రాలేదా? ఇదే గురువు చేత యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం చేయించిన సంగతిని ప్రజలు మర్చిపోలేదు. 

రాష్ట్ర చిహ్నంపై 500 నమూనాలు

రాష్ట్ర చిహ్నంపై రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల కళాకారుల నుంచి 500 నమూనాలు ప్రభుత్వానికి అందాయి. అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహం మార్పుకు సంబంధించిన విషయాలను అసెంబ్లీలో చర్చించి అందరికి ఆమోదయోగ్యంగా తెలంగాణ ప్రతిష్టను ఇనుమడించేలా భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండేలా తమ కార్యాచరణ ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో తొలిసారిగా భాగస్వామ్యం అవుతున్నాం. గతంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు తమకు ఆహ్వానం అందలేదని, జయ జయహే తెలంగాణ కొత్తగా రాసిన పాట కాదు, రాసింది ఎవరనేది ముఖ్యం. పాడింది ఎవరన్నది కాదు అని ప్రొ. కోదండరామ్‌‌ ఈ గేయానికి తన మద్దతు తెలిపారు. ఈ ఉత్సవాలకు కేసీఆర్‌‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. అదేవిధంగా ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యను ఆవిర్భావ వేడుకలకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి ఆహ్వానించారు. తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న కళాకారులు, ఉద్యమ కారులందరినీ ఈ ఉత్సవాలకు ప్రభుత్వం ఆహ్వానించింది.

- బోరెడ్డి అయోధ్య రెడ్డి సీఎం సీపీఆర్వో