లెటర్​ టు ఎడిటర్ : యువతలో మార్పు తేవాలి

నేటి సమాజంలో యువత ఎక్కువగా మత్తు పదార్థాలు, మద్యంకు  బానిసలుగా మారుతూ భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు, మత్తు పదార్థాలకు బానిసలుగా మారి నేర ప్రవృత్తి వైపు ఆలోచనలు చేస్తూ అనేక నేరాలకు పాల్పడుతున్నారు, ఇటు కుటుంబం చిన్నాభిన్నం అవుతోంది, అటు వ్యవస్థను కలుషితం చేస్తున్నారు, చట్టాలు, వ్యవస్థలు యువతలో మంచి మార్పులు తీసుకు రాలేకపోతున్నాయి. నేటి యువత ఆలోచనలకూ అనుగుణంగా చట్టాలలో  మార్పులు చేయకపోవడం కూడా ఒక ప్రధాన కారణం. మార్పులను స్వీకరించి అమలు చేయకపోతే విద్యావ్యవస్థ పతనానికి దారితీస్తుంది. 

ప్రతి కాలేజీలో నెలకు ఒక్కసారి చెడు అలవాట్ల మీద, భవిష్యత్తు పట్ల ఉండాల్సిన బాధ్యతల పట్ల అవగాహనా సదస్సులు నిర్వహించాలి, అలానే ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అన్ని కాలేజీలు, యూనివర్సిటీలను స్థానిక పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తే కొంతవరకు సత్పలితాలను పొందే అవకాశం ఉంటుంది.

ఇంకా ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇంటర్ నుంచి పీజీస్థాయి కాలేజీల వరకు ప్రతి సంవత్సరం ప్రతి విద్యారికి  ఎక్కడ విద్యను అభ్యసిస్తున్నాడో అదే ప్రాంగణంలో రక్త నమూనాలను సేకరించి విద్యార్థి ఎలాంటి మత్తు పదార్థాలు లేదా మద్యం సేవించాడా చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడా అనే విషయాల మీద మెడికల్ చెకప్ చేయడం వలన ప్రతి విద్యార్థి చెడు మార్గాలవైపు వెళ్లకుండా నిరోధించడానికి అవకాశం ఉంటుంది.  విద్యార్థులు చెడు వ్యసనాలకు అలవాటు అయితే ఆ విద్యాసంవత్సరం చదవకుండా  నిరోధించాలి. మెడికల్ చెకప్ చేయడం వలన అటు తల్లిదండ్రులకు పిల్లల ఆరోగ్యం విషయం తెలుస్తుంది. ఇటు ప్రతి విద్యార్థి చెడు వ్యసనాలకు దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మంచి మార్పులను స్వీకరించగలగాలి.

డాక్టర్. వై. సంజీవ కుమార్