ప్రతిపక్ష నేత హోదా ఉంటుందా?

ప్రతిపక్ష నేత హోదా ఈసారి అయినా ఇస్తారా? పీఎం కు ఎదురుగా సమానంగా కూర్చునే, కేబినెట్ హోదా గల పదవి ఎక్కువ అంటే 99 సీట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీకి దక్కేనా? రాహుల్ గాంధీకి ఆ అవకాశం వస్తుందా? 2014 నుంచి పీఎం మోదీ 44 సీట్లు వచ్చాయి అని, అవి 543 సీట్లలో 10 శాతం లేవని మొత్తానికే ప్రతిపక్ష హోదాను ఇవ్వలేదు. నిజానికి విపక్షంలో అత్యధిక  సీట్లు వచ్చిన పార్టీకి పది శాతం సీట్లతో సంబంధం లేకుండా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి! కానీ నరేంద్రమోదీ ఏదో ఒక సాకుతో ఈ హోదాను ఇవ్వకుండా, తన వ్యక్తిగత తానా షాహీ గిరిని అన్ని రాజ్యాంగ బద్దం అయిన నియామకాలను, ఏకపక్షంగా కొనసాగించారు.  

మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో పరోక్షంగా షేహాజాద అంటూ రాహుల్ గాంధీ పేరు ఎత్తకుండా ఆయన వయస్సు ఉన్నన్ని సీట్లు కూడ కాంగ్రెస్ కే కాదు, మొత్తం ఇండియా కూటమికే రావని, ఎద్దేవా చేస్తూ మాట్లాడారు. బీజేపీకి 400 కు పైగా సీట్లు వస్తున్నాయి అన్నారు. కాంగ్రెస్ కు 99ఇండియా కూటమి మొత్తానికి 233 స్థానాలు వచ్చాయి. బీజేపీకి 240 వచ్చాయి. సింగిల్ గా ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి బీజేపీకి వచ్చింది. కాంగ్రెస్ కు విపక్ష నేత హోదా వచ్చేసింది. ప్రజల డిమాండ్లకు గొంతును ఇచ్చే పనికి కాంగ్రెస్ కు హోదా వచ్చింది. 

ప్రతిపక్షం ఉండాలని నెహ్రూ అన్నారు

1961 లోనే అప్పటి ప్రధాని నెహ్రు ప్రతిపక్షం ఉండాలని కోరుకున్నారు. మాజీ కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ కూడా బీజేపీ విపక్ష హోదాలో, నేత ప్రాధాన్యతను వివరించేవారు, ప్రజాస్వామ్యంలో ఆ అవసరాన్ని చెప్పేవారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఒకసారి 193 సీట్లు వచ్చినప్పటికీ, మెజారిటీ లేదు కాబట్టి, ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధం కాలేదు! కానీ మోదీ 240 సీట్లకు ఇంకా 32 సీట్లు తక్కువ ఉన్నా ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధం అయిపోయారు. అదేమరి పదవీ కాంక్ష ఉన్న వారికి, ప్రజాసేవ చేసేవారికి, ఈ దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వారికి తేడా! విదేశీ పత్రికలు టైమ్స్ లాంటివి మోడీని డివైడర్ ఇన్ చీఫ్ అని, కర్ణాటకలో ఒక రేపిస్ట్, ప్రజ్వల్ రేవణ్న లాంటి వాడికి ఓట్లు అడుగుతున్న వాడిగా, ఇతను బ్యాలన్స్ కాదు, ఇలాంటి వాళ్ళు దేశానికే కాదు, ప్రపంచానికే ప్రమాదం అని పేర్కొన్న వారు ఉన్నారు. 

విద్వేషంపై మేధావుల పోరాటం

పీఎం మోదీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ ఉపన్యాసం ఒక క్రైమ్ అని, ప్రతీదానికి, చట్ట ప్రకారం శిక్ష పడే పరిస్థితి ఉందని ప్రముఖ న్యాయకోవిదుడు, ఆశోక్ ఆరోరా అంటారు. ఏమైనా హిందూ, ముస్లిం రాజకీయాలు, విద్వేష ఉపన్యాసాలు ఇవ్వడం, తాళిబొట్లు గుంజుక పోతారని, బర్రెలను తీసుకెళ్లుతారని, నోటికి ఏది వస్తే అది మాట్లాడే మోదీ ఈ దేశ ప్రధానికి అర్హుడు కాదని అంటారు అశోక్ ఆరోరా. 

ఈ మేరకు ఆయన రాష్ట్రపతికి లేఖ రాసినట్లు ఒక వీడియో విడుదల చేశారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. మోదీ పీఎం అవుతారు. చంద్రబాబు, నితీష్ కుమార్ల దయతో అవుతారు. అయితే తప్పనిసరిగా ఈసారి ఆయన ఏది తలుచుకుంటే అది చేయలేరు. కొంత కట్టడి ఉంటుంది, అని ఆశిద్దాం! బ్రిటన్ లాంటి దేశంలో విపక్ష నేత హోదాను షాడో పీఎం హోదా అంటారు.. ఆ రకంగా జనం అద్భుతమైన తీర్పు ఇచ్చారు. విపక్ష నిర్మాణం చేశారు.

- ఎండీ. మునీర్,
సీనియర్ జర్నలిస్ట్