తొలిదశలో తండ్రి మలిదశలో కొడుకు.. తెలంగాణ రాష్ట్ర సాధనలో కాకా ఫ్యామిలీ

తెలంగాణ ఉద్యమంలో  కాకా వెంకటస్వామి  ఫ్యామిలీది  కీలకపాత్ర. తొలిదశ ఉద్యమంలో వెంకటస్వామి తూటా దెబ్బలు తిని చావు అంచుల వరకూ వెళ్లారు. 1969లో  ఇందిరాగాంధీ  నుంచి 2009లో  సోనియాగాంధీ వరకు  దాదాపు 40 ఏండ్లు కాంగ్రెస్​ పార్టీలో  తెలంగాణ గళం వినిపించిన నేత కాకా.  2004లో  కాంగ్రెస్​,  టీఆర్​ఎస్​ మధ్య  పొత్తు  కుదిర్చి  తెలంగాణ డిమాండ్​ను  హైకమాండ్​ చేత  ఆమోదింపచేసిన ఘనత ఆయనది.  మలిదశ ఉద్యమంలో తండ్రి అడుగుజాడల్లో  కొడుకు డాక్టర్​ వివేక్ చేసిన పోరాటం మరువలేనిది.  అప్పటి ముఖ్యమంత్రి కిరణ్​కుమార్​రెడ్డి వివేక్​పై  కక్షగట్టినా  అదరలేదు, బెదరలేదు.  బిడ్డ పెండ్లికి  మూడు రోజుల ముందు జైలులో పెట్టినా ఉద్యమంలో మడమ తిప్పలేదు.. వెనుకడుగు వేయలేదు.  మొదటి నుంచి చివరి దాకా నిస్వార్థంగా  రాష్ట్రంకోసం  కొట్లాడిన  ఘనత కాకా ఫ్యామిలీకే దక్కుతుంది. 

1969  జనవరిలో  ఉద్యమం  ప్రారంభమైంది.  ముషీరాబాద్ ​ జైలులో  ఉన్న  విద్యార్థి,  రాజకీయ  నాయకుల  హత్యకు కుట్రలు జరిగాయి. దాంతో విద్యార్థులు, ఉద్యోగులు, సామాన్య ప్రజలు వందలాదిగా  ముషీరాబాద్​ జైలును  ముట్టడించారు. అప్పటికే ఎంపీగా ఉన్న కాకా వెంకటస్వామి ఈ సంఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు.  జైలు లోపలికి చొచ్చుకు పోయేందుకు ప్రయత్నించిన నిరసనకారులపై పోలీసులు ఫైరింగ్​ చేశారు.  పోలీసు కాల్పుల్లో  వెంకట స్వామి పక్కనే ఉన్న ఇద్దరు వ్యక్తులు స్పాట్​లోనే చనిపోయారు.  

వెంకటస్వామి తలకు దెబ్బతగిలి తీవ్ర గాయమైంది.  ఆయనను హాస్పిటల్​కు తీసుకుపోవడానికి కొంతమంది జీపు తీసుకురాగా,  పోలీసులు ఆ జీపుపైనా కాల్పులు జరిపారు. జీపు పల్టీలు కొడుతూ వెంకటస్వామి మీద పడ్డది.  ఆయన తలకు తీవ్ర గాయమవగా ముక్కు, నోట్లోంచి బాగా రక్తం పోయింది.  ఆ పరిస్థితిలో కాకాను చూసినవారు ఇక బతకడని అనుకున్నారు.  హుటాహుటిన హాస్పిటల్​కు  తీసుకు పోయారు.  మూడు రోజుల తర్వాతగానీ ఆయన కోలుకోలేదు.  ముషీరాబాద్​ సంఘటనతో  తెలంగాణ ఉద్యమం మరింత ఉధృతం అవుతుందని భావించిన ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి,  మర్రి చెన్నారెడ్డి,  కొండా లక్ష్మణ్​ బాపూజీ,  బద్రి విశాల్ పిట్టి,  హాషీం,  మాణిక్​రావు,  పద్మనాభన్,  రఘువీర్​  తదితర  ఉద్యమ నేతలను  రాత్రికి రాత్రే  అరెస్టు చేయించారు.   

మేం బానిసలం కాదంటూ.. 

తెలంగాణపై  సాగుతున్న  దమనకాండను నిరసిస్తూ వెంకటస్వామి,  మేల్కొటే  1969  ఆగస్టు 18న  పార్లమెంట్​లో  లొల్లి లొల్లి చేశారు.  చనిపోయిన అమరవీరుల  ఫొటోలను  ప్రదర్శిస్తూ  నిరసన  తెలిపారు. బ్రహ్మానందరెడ్డి సర్కారును  బర్తరఫ్​ చేసి రాష్ర్టపతి పాలన విధించాలని డిమాండ్​ చేశారు.  వెంటనే తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు చేయాలని కోరారు. ‘‘నెత్తురు పారుతున్న తెలంగాణ నుంచి వచ్చినం. తుపాకీ గుండ్లను తప్పించుకొని  వచ్చినం. ఇప్పటికే 250 మంది ఉద్యమకారులను కాల్చి చంపారు. వందల మందిని పీడీ యాక్ట్​ కింద అరెస్టు చేశారు.  50 వేల మందిని అక్రమంగా జైళ్లలో పెట్టారు. ఈ రాక్షసకాండను ఖండిస్తున్నాం. మాపై వలసదారుల పెత్తనం వద్దు. మేం ఎవరికీ బానిసలం కాదు” అంటూ ఆవేశంగా మాట్లాడుతూ... తెలంగాణ సాధించేదాకా తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఇందిరాగాంధీపై నమ్మకం

తెలంగాణ ఏర్పాటే ఏకైక ఎజెండాతో 1971 ఎన్నికల్లో  తెలంగాణ ప్రజా సమితి (టీపీఎస్​) పోటీ చేసింది.  ఈ ఎన్నికల్లో వెంకటస్వామి సిద్దిపేట ఎంపీగా నిలబడి కాంగ్రెస్​ అభ్యర్థి సదాలక్ష్మిపై  లక్షన్నర  ఓట్ల మెజారిటీతో  గెలిచారు. ఈ ఎన్నికల్లో ఇందిరాగాంధీ  నేతృత్వంలోని  కాంగ్రెస్​ 352 సీట్లతో అధికారంలోకి వచ్చింది. ఈ పరిస్థితిలో ఇందిరకు దూరమయ్యేకన్నా ఆమెకు దగ్గరయితే ఏదో ఒకరోజు తెలంగాణ సాధించవచ్చని 1972 డిసెంబర్​ 28న కోల్​కతాలో జరిగిన కాంగ్రెస్​ మీటింగ్​లో ఆ పార్టీలో  చేరారు. 

సీడబ్ల్యూసీ నుంచి వాకౌట్​

కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ మెంబర్​గా 30 ఏండ్ల పాటు పార్టీలో  తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించారు కాకా.  సోనియాగాంధీ పార్టీ పగ్గాలు తీసుకున్న తర్వాత ప్రతి మీటింగులో తెలంగాణ గురించి ప్రశ్నించారు. 2004 తర్వాత  వైఎస్సార్​ బెదిరింపులతో  
ప్రత్యేక రాష్ర్టం అంశాన్ని పార్టీ పక్కన పెట్టింది. ఆ టైమ్​లో  జరిగిన సీడబ్ల్యూసీ  మీటింగ్​లో వెంకటస్వామి ‘తెలంగాణ ఇవ్వకుండా ఎందుకు సతాయిస్తున్నారు’ అంటూ సోనియా గాంధీని నిలదీశారు.  మీటింగ్​ నుంచి వాకౌట్​ చేశారు.  దీంతో  తెలంగాణ డిమాండ్​ను  సోనియా  అర్థం చేసుకున్నారు.  

తెలంగాణ కల సాకారం 

కిరణ్​కుమార్​రెడ్డి  తెలంగాణను  అడ్డుకోవడంతో  వివేక్​ కాంగ్రెస్​ను వీడి  టీఆర్ఎస్​లో చేరారు.  తెలంగాణ వచ్చిన తర్వాత  టీఆర్ఎస్​ను  కాంగ్రెస్​లో విలీనం చేయించ వచ్చని  కేటీఆర్,  హరీష్​రావు హామీ ఇవ్వడంతో పార్టీ మారారు.  ఆయన సోదరుడు వినోద్​ కూడా  టీఆర్​ఎస్​లో చేరారు.  కాంగ్రెస్​ కోసం  జీవితాన్నే అంకితం చేసిన వెంకటస్వామి వారసులు తెలంగాణ కోసం పార్టీని వదిలిపెట్టడంతో సోనియాగాంధీ ఆశ్చర్యపోయారు.  తెలంగాణ డిమాండ్​ను అర్థం చేసుకొని సీడబ్ల్యూసీలో తీర్మానం చేయించారు.  రాష్ర్టం సాధించాలన్న లక్ష్యం  నెర వేరడంతో వివేక్​ తిరిగి కాంగ్రెస్​లో జాయిన్ అయ్యారు.

తండ్రి అడుగుజాడల్లో వివేక్​

2009 ఎన్నికల ముందే  వెంకటస్వామి ఆరోగ్యం క్షీణించడంతో ఆయన తనయుడు వివేక్​ రాజకీయాల్లోకి వచ్చి పెద్దపల్లి ఎంపీగా గెలిచారు.  అప్పుడు వివేక్​కు  ‘తెలంగాణ తల్లి రుణం తీర్చుకోవాలె.  నా జీవితకాలంలో రాష్ట్రం సాధించేటట్టు కృషి చేయాలె’ అని చెప్పారు కాకా.  తండ్రి సూచనతో వివేక్​ తెలంగాణ ఉద్యమంలో  క్రియాశీలక పాత్ర పోషించారు. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్​కుమార్​రెడ్డికి వ్యతిరేకమయ్యారు.  

వివేక్​ను ఆర్థికంగా దెబ్బతీయడానికి కిరణ్​కుమార్​రెడ్డి  ప్రయత్నించారు. విశాక కంపెనీలపై  అధికారులతో  దాడులు చేయించారు. ముఖ్యమంత్రే టార్గెట్​ చేసినా వివేక్​ భయపడలేదు. ఎత్తిన తెలంగాణ జెండాను  దించలేదు.  మూడు రోజుల్లో బిడ్డ పెండ్లి పెట్టుకొని  కూడా  ఉద్యమంలో  పాల్గొన్నారు.  రైల్​రోకోలో అరెస్టయ్యారు.   తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న అమరుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించినా ఎక్కడా చెప్పుకోని నిగర్వి వివేక్.

- సురేశ్​ చౌదరి