ప్రజాస్వామ్యం, పారదర్శకత, వాస్తవాలు, నిజాయితీ అనే పదాలు బీఆర్ఎస్ డిక్షనరీలో భూతద్దంతో వెతికినా కనపడని పదాలు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొదలు నిత్యం మీడియా ముందు సూక్తులు వల్లించే కేటీఆర్, హరీష్ రావు సహా ఆ పార్టీలోని ముఖ్యులు ఏనాడూ ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన దాఖలాలు లేవు. పారదర్శకంగా వ్యవహరించిన అంశాలు, వాస్తవాలు మాట్లాడిన రోజులు, నిజాయితీగా ప్రవర్తించిన వ్యవహారం ఒక్కటీ లేదు.
2014లో బలమైన ప్రతిపక్షం శాసనసభలో ఉండాలనే నాటి సభలో కాంగ్రెస్‌కు 21, టీడీపీకి 15, ఎంఐఎంకు 7, బీజేపీకి 5, వైఎస్సార్‌సీపీకి 3, బీఎస్పీకి 2, సీపీఐ, సీపీఎం, ఇండిపెండెంట్‌ను ఒక్కోస్థానంలో ప్రజలు గెలిపించారు. ప్రజాస్వామ్యంపై ఏమాత్రం విశ్వాసం లేని కేసీఆర్ గెలిచిన మరుక్షణం నుంచే విపక్ష పార్టీల ఎమ్మెల్యేలను నయానోభయానో టీఆర్ఎస్‌లో కలిపేసుకున్నారు.
దళితుడైన డాక్టర్ రాజయ్యను ఉప ముఖ్యమంత్రిగా నియమించి ఆయనను అర్ధంతరంగా తొల గించారు. కాళేశ్వరం నీళ్లు, రైతుబంధు వంటి పథకాలతో 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ రెండో సారి ఘన విజయం సాధించింది. 88 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ నుంచి గెలిచినా.. ప్రతిపక్ష కాంగ్రెస్, టీడీపీ, ఇండిపెండెంట్లుగా గెలిచినవారిని సైతం కేసీఆర్ టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు. ఉద్యమకారులుగా పదే పదే చెప్పుకునే కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు తమ ప్రభుత్వం రాగానే ప్రజా ఆందోళనలపై ఉక్కుపాదం మోపారు.
ప్రజాతీర్పుతో కాంగ్రెస్ ప్రభుత్వం
ప్రజాతీర్పుతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాప్రభుత్వం గతేడాది డిసెంబరులో కొలువుదీరింది. కాంగ్రెస్ సారథ్యంలోని ప్రజాపాలన మొదలైన మరుక్షణం నుంచే ప్రజాహిత కార్యక్రమాలు ప్రారంభించింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, ఎనిమిది నెలల కాలంలోనే 30 వేల ఉద్యోగ నియామకాలు రేవంత్ సర్కారు చేపట్టింది.
జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. అన్నింటికి మించి రైతు రుణమాఫీని ప్రకటించింది. రూ.31 వేల కోట్లు ఇందుకు వ్యయం చేస్తోంది. ఇప్పటికే 18 లక్షల రైతు కుటుంబాలు రుణ విముక్తి పొందాయి. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే ఓర్వలేని కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావులు ప్రజాప్రభుత్వంపై విషం చిమ్మడం ప్రారంభించారు.
పెద్ద సంఖ్యలో యూట్యూబ్ చానెళ్లు కొనుగోలు చేయడంతోపాటు ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ల్లో నకిలీ ఖాతాలతో పనిచేసే కిరాయి మూకను ఏర్పాటు చేసుకొని నిత్యం అవాస్తవాలు, అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. ఇందుకుకాళేశ్వరం వంటి ప్రాజెక్టులతో కమీషన్ల రూపంలో దండుకున్న రూ. వేల కోట్లలో కొంత మొత్తాన్ని వ్యయం చేస్తున్నారు. బీఆర్ఎస్ అగ్రనేతలు విసిరే భారీ మొత్తాలు అందుకుంటున్న కిరాయి రాత సైన్యం సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ మంత్రుల వ్యక్తిత్వాలను హననం చేయడం, అవాస్తవాలను ప్రచారం చేస్తూ
ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి.
అసెంబ్లీకి ముఖం చాటేస్తున్న కేసీఆర్
కేసీఆర్ కుటుంబ సభ్యుల వైఖరి నచ్చని ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా సీట్లకే పరిమితం చేశారు. అయినా తీరు మారకుండా అదే నిరంకుశ వైఖరితో కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామ్యంపై ఏమాత్రం నమ్మకం లేని కేసీఆర్ శాసనసభకూ మోహం చాటేస్తున్నారు. తన పదేండ్ల పాలనాకాలంలో ప్రతిపక్ష సభ్యులను హేళనచేసి అవమానించిన విషయాలు గుర్తుండడంతో ఇప్పుడు అలానే చేస్తారనే భయం ఆయనను నిత్యం వెంటాడుతోంది.
అందుకే ప్రతిపక్ష నాయకుని హోదాను అనుభవిస్తూనే సభకు రావడానికి ఇష్టపడడం లేదు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ సభకు వచ్చి విలువైన సలహాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించినా, కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి ప్రజాస్వామ్య పద్ధతిలో శాసనసభను నడుపుతున్నా, ప్రజలు ఇచ్చిన తీర్పుపై ఏమాత్రం గౌరవం లేకపోవడంతోనే కేసీఆర్ శాసనసభకు రావడం లేదు.
ఆరు నెలలు హాజరుకాకపోతే సభ్యత్వం రద్దవుతుందనే ఏకైక కారణంతో ఒక్క రోజు సభకు వచ్చి మరుసటి రోజే కేసీఆర్ ముఖం చాటేశారు. కేసీఆర్ సభకు రావల్సిన అవసరం లేదంటూ కేటీఆర్ మాట్లాడడం.. ప్రజలు తిరస్కరించినా మారని ఆయన అహంకారానికి అద్దం పడుతోంది. నోటి దురుసుతనానికి, అహంకారానికి ప్రతీకగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.. గిరిజన బిడ్డ, మంత్రి సీతక్కకు జ్ఞానం లేదంటూ నిండు సభలో అవమానించారు. సీఎం రేవంత్ రెడ్డి అక్కలు అని సంబోధించినందుకు వాకౌట్ చేసినవారికి సీతక్కకు క్షమాపణ చెప్పాలనే ఇంగితం జ్ఙానం ఎందుకు లోపించిందో తెలియదు.
బీఆర్ఎస్ హయాంలోనే సుంకిశాల పనులు
సుమారు పదేండ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ తన పాలనా కాలంలో ఫాం హౌస్‌కు పరిమితమై రాష్ట్రానికి కావాల్సిన పెట్టుబడుల విషయాన్ని గాలికొదిలేశారు. అందుకు భిన్నంగా సీఎం రేవంత్ రెడ్డి దావోస్‌లో జరిగిన 54వ ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరై రూ.40 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకున్నారు. తమ హయాంలో పెట్టుబడులు తేలేనివారు... పెట్టుబడులు తెచ్చే నాయకునిపై నిత్యం ఆరోపణల అస్త్రాలు సంధిస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు విషయంలో కేసీఆర్ ప్రభుత్వం ఎంత దారుణంగా ప్రవర్తించిందో అందరికీ తెలుసు.
మీడియాను, ప్రతిపక్ష నాయకులను అటువైపే వెళ్లనీయలేదు. తమ హయాంలో కమీషన్ల కక్కుర్తితో హడావుడిగా కట్టిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోగా, తాజాగా సుంకిశాల వంతు వచ్చింది. బీఆర్ఎస్ హయాంలోనే సుంకిశాల పనులు ప్రారంభమైన విషయం కేటీఆర్ మర్చిపోయినట్లుంది. ప్రస్తుత ప్రభుత్వం పారదర్శకతతో వ్యవహరించడం లేదని కేటీఆర్, హరీష్ రావులు విమర్శిస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ కుటిల ప్రచారాలను తిప్పికొట్టారనే విషయాన్ని వారు గుర్తించాలి. ఇకనైనా తీరు మార్చుకోకుంటే ప్రజలకు శాశ్వతంగా దూరంకాక తప్పదనే విషయాన్ని కేసీఆర్ అండ్ కో గ్రహించాల్సిన తరుణం ఇది.
- మన్నె సతీష్ కుమార్,
చైర్మన్, తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్
డెవలప్మెంట్ కార్పొరేషన్