వాతావరణం మార్పుల కట్టడిలో వైఫల్యం

వాతావరణం మార్పుల  కట్టడిలో వైఫల్యంప్రపంచంలో ఎక్కడ చూసినా  తీవ్రమైన ఉష్ణోగ్రతలు, అడవులను అంటుకుంటున్న  కార్చిచ్చులు, మరోవైపు తుపానులు, మంచు తుపానులు, తీవ్రమైన వరదలు  కనిపిస్తున్నాయి.  వాతావరణ సమతుల్యం తీవ్రంగా దెబ్బతింటున్నదని జరుగుతున్న సంఘటనలు చెపుతున్నాయి. 

ఉష్ణోగ్రతల పెరుగుదల, రుతుపవనాలు గతితప్పి వరదలు, కరువులు సంభవించడం, హిమానీనదాలు కరగడం లాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి.ఇ టీవల వేసవిలో నమోదైన అసాధారణ ఉష్ణోగ్రతలను చూస్తుంటే వాతావరణ అత్యయిక స్థితిని తలపిస్తోంది. అడవులు నరకడం, వాహన కాలుష్యం, ప్లాస్టిక్ వినియోగం, రసాయన ఎరువుల వాడకం, గనుల తవ్వకం లాంటి చర్యల ఫలితంగా వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. ఫలితంగా కార్బన్ డై ఆక్సైడ్, మిథెన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి వాయువులు మోతాదుకు మించి విడుదలవుతున్నాయి.

ప్రమాదంలో మానవ మనుగడవాతావరణ మార్పులపై అంతర్ ప్రభుత్వ నివేదిక(IPCC) సారాంశం ఆందోళన కలిగిస్తున్నది. ఈ నివేదిక ప్రపంచం 2030 నాటికి ఏటా కనీసం 560 విపత్తులను ఎదుర్కోనున్నదని పేర్కొన్నది. తద్వారా 4 కోట్ల ప్రజలు దుర్భర దారిద్ర్యంలోకి జారుకుంటారని అంచనా వేసింది. భవిష్యత్ మానవ మనుగడ ప్రమాదంలో పడనుందనే హెచ్చరిక జారీచేసింది. మరోవైపు ప్రకృతి విపత్తుల వల్ల భారత్​కు ఏటా 70వేల కోట్ల నష్టం  వాటిల్లుతున్నట్లు పరిశీలకులు వెల్లడిస్తున్నారు. ఇప్పటికే  వాయు కాలుష్యంలో భారత్,  బంగ్లాదేశ్, పాకిస్తాన్ తరవాత మూడవ స్థానంలో ఉంది. దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య రాజధానిగా అపకీర్తిని మోసుకొస్తున్నది. కావున వాతావరణ మార్పుల కట్టడికి ప్రభుత్వాలు, పరిశ్రమలు, సంస్థలు, వ్యక్తులు వెంటనే మేల్కొని చర్యలు  చేపట్టాలి.

పారిస్​ ఒప్పందం ఆశించిన అమలు ఏది?

ప్రపంచ దేశాలన్ని స్వచ్ఛందంగా కర్బన ఉద్గారాలు తగ్గించాలనే దీర్ఘకాల లక్ష్యంతో 2015లో పారిస్ ఒప్పందం  తీసుకురావడం జరిగింది. ఈ ఒప్పందంలో ఉష్ణోగ్రతలను పారిశ్రామిక పూర్వ స్థాయికంటే 2 డిగ్రీ సెల్సియస్ కు తగ్గించి 1.5 డిగ్రీ సెల్సియస్​కు పరిమితం చేయాలనీ తీర్మానించారు. ధనిక దేశాలు, పేద దేశాలకు ప్రతి ఏటా 100 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించారు. ఈ ఒప్పందం 2020 నుంచి అమల్లోకి వచ్చింది. కానీ, నేటికీ ఆచరణలో ఆశించిన స్థాయిలో ముందుకు పోవడం లేదు. ఇప్పటికే ఉష్ణోగ్రత 1.5 డిగ్రీలు దాటిందని అధ్యయనాలు చాటుతున్నాయి. ఇదీ ఇలానే కొనసాగితే ఇండ్లల్లో  ఏసీలు కూడా పనిచేయవు. కార్బన్ ఉద్గారాలలో మొదటి స్థానంలో చైనా, తదుపరి అమెరికా, ఇండియా ఉన్నాయి. అతిపెద్ద కర్బన ఉద్గారాల దేశాలైన చైనా, అమెరికాలు చర్యలకు పూనుకోకపోవడం గమనార్హం. 

ఉద్గారాల కట్టడికి భారత్​ కృషి

వాతావరణ మార్పుల కట్టడిలో భారత్  ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇటీవల భారతదేశం కార్బన్​ ఉద్గారాల కట్టడికి నూతన దేశీయంగానిర్దేశించిన లక్ష్యాలను (NDC) సమర్పించినది. ఇందులో భారత్ మూడు ముఖ్యమైన వాగ్దానాలు చేసింది. భారతదేశం తన జీడీపీ ఉద్గారాల తీవ్రతను 2005 స్థాయి నుంచి 2030 నాటికి 45 శాతం తగ్గిస్తుంది. 2030 నాటికి శిలాజేతర ఇంధన వనరుల నుంచి 50 శాతం విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేస్తుంది. చెట్లు నాటడం, అడవులు పెంచడం ద్వారా 2.5 నుంచి 3 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ను తగ్గించేందుకు ప్రయత్నిస్తుంది. ఈ చర్యలతో 2070 నాటికి కార్బన్​ఉద్గారాలను తటస్థీకరించాలనే లక్ష్యం దిశగా భారత్ ముందడుగు వేయనుంది.

పర్యావరణహిత చర్యలు

ప్రస్తుతం భూగోళానికి వ్యతిరేకంగా సాగుతున్న హింసకు మరోపేరు పర్యావరణ విధ్వంసం. ఇందులో రేపటి తరం వనరులను నేటితరం  దోచుకుంటుంది. తద్వారా భవిష్యత్తు ముప్పుకు మనమందరం బాధ్యులమే అవుతాము. కావున వాతావరణ మార్పుల కట్టడి ప్రపంచ దేశాల ప్రధాన ఎజెండా కావాలి. ఐక్యరాజ్య సమితి వాతావరణ ఒప్పందాలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలి.

పర్యావరణ చట్టాలను కఠినంగా అమలు చేయాలి

ఇటీవల వాతావరణం ప్రతికూలత ప్రభావాలను ఎదుర్కొనే హక్కును రాజ్యాంగంలోని అధికరణ 14(సమానత్వ హక్కు), 21(జీవించే హక్కు) కింద సుప్రీంకోర్టు విస్తరించింది. ఇది గొప్ప మైలురాయి అని చెప్పవచ్చు. ఆధిపత్య పెట్టుబడిదారీ వర్గాల చేతుల్లోనే ప్రభుత్వాలు, పరిశ్రమలు ఉన్నాయి. వీరికి అనుకూలంగానే చట్టాలు మలుచుకుంటున్నారు. వారి విధానాల వల్ల జరిగే కాలుష్యానికి సామాన్యులు బలవుతున్నారు. కావున క్షేత్ర స్థాయిలో పర్యావరణ చట్టాలను పటిష్టంగా అమలు పరచాలి. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. రసాయన ఎరువుల స్థానంలో జీవ ఎరువులను వాడకాన్ని పెంచాలి. పర్యావరణ దుష్పరిమాణాలు అరికట్టడానికి ప్రతి ఒక్కరు మొక్కలు నాటే కార్యక్రమం నిత్య ఉద్యమంగా కొనసాగించాలి. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి. ఆప్పుడే సానుకూల వాతావరణంతో  భూగోళం సంరక్షించబడుతుంది.

- సంపతి రమేష్ మహారాజ్.
సోషల్​ ఎనలిస్ట్​