గద్దరన్నను స్మరించుకుందాం.. నేడు గద్దరన్న ప్రథమ వర్ధంతి

తరతరాలుగా కులాల పేరిట, మతాల పేరిట  అగ్రవర్ణాల కింద అణచివేతకు గురై,  సమాజంలో సమానత్వం లేక పీడనకు గురవుతూ ఎదురీదుతున్న సమాజం ఒక వైపు.. నీవు తినే తిండిపై,  నువ్వు కట్టుకునే బట్టపై, నువ్వు మాట్లాడే మాటపై ఆంక్షలు విధిస్తూ... లౌకిక రాజ్యమనే మాటను మరచి మతాల మధ్య చిచ్చుపెట్టి,  ప్రజలను వేరుచేసి భావప్రకటన స్వేచ్ఛను హరిస్తూ దాడులు చేసే సందర్భం మరొకవైపు కొనసాగింది.  ప్రతిరోజూ అనేక రూపాల్లో దళితులపై దాడులను నిత్యం చూస్తూనే ఉన్నాం. ఈ ప్రత్యేక సందర్భంలో పీడిత, తాడిత కులాల వైపు నుంచి అనునిత్యం పోరాడిన గద్దరన్నను స్మరించుకోవడం మనందరి కర్తవ్యం. 

1949లో  నిరుపేద దళిత కుటుంబంలో జన్మించిన గుమ్మడి విఠల్ రావు  ప్రజాఉద్యమాల్లో  ప్రజలచేత గద్దర్​గా  గుర్తింపుపొందాడు. తన తల్లి లచ్చుమమ్మ జానపద గాయకురాలు కావడంతో పాటలంటే ఎలా పాడాలో గద్దర్​కు చిన్నప్పటి నుంచే  అలవాటు అయ్యింది. అలా మొదలైన గద్దరన్న పాట అనేక ప్రజా ఉద్యమాల్లో ముఖ్యంగా గ్రామాల్లో కష్టజీవులకు అండగా నిలిచింది.  గోసిగొంగడి వేసుకొని.. సేలల్లో, సెలకల్లో బానిస బతుకులను స్ఫూర్తిగా తీసుకొని పోరాట పాటలను రాసిండు. ఇప్పటికీ ప్రతి కళాకారుడు అదే డ్రెస్ కోడ్​తో  ప్రదర్శనలు చేస్తుండడం చూస్తున్నాం. అంతగా ప్రభావితం చేసిన విప్లవకారుడు మన గద్దరన్న. 

ప్రజాచైతన్యం కోసం పోరుపాట

ఐదు దశాబ్దాల తరబడి పేద ప్రజల కోసం పోరాడి వారిని చైతన్యం చేస్తూ నూతన సమాజం కోసం తన ఆటా పాటను తూటాల్లా పేల్చి రాజ్యాన్ని వణికించిన యోధుడు గద్దరన్న.  ‘బండెనుక బండి కట్టి.. పదహారు బండ్లు కట్టి ఏ బండ్లే బోతవ్ కొడుకో.. నైజాం సర్కరోడా.. నాజీలమించినవురో  నైజాం సర్కరోడా.. సుట్టుముట్టూ సూర్యపేట నట్టనడుమ నల్లగొండ .. నువ్​ ఎల్లేది హైద్రాబాదు..దాని పక్కన గోలుకొండ.... గోలుకొండ ఖిల్లా కింద.. గోలుకొండ ఖిల్లా కింద నీ ఘోరీ కడుతం కొడుకో  నైజాం సర్కరోడా’ అని బండి యాదగిరి పాటను తన గొంతుతో నైజాంపై గర్జించిన వీరుడు.

మన దేశ పరిస్థితి మొత్తం తన పాటతో అలవోకగా చెప్పేవాడు.  ‘భారతదేశం భాగ్యసీమరా ఖనిజ సంపదకు కొదువ లేదురా.. బంగరు పంటల భూములన్నవి. సావు ఎరుగని జీవనదులురా.. అంగట్లోన అన్నీ ఉన్నను అల్లుడి నోట్లో శని ఉన్నట్లు ... సకల సంపదల గల్ల దేశంలో దరిద్రమెట్లుందో నాయన.. నీతికల్ల మన దేశంలోన అవినీతెందుకు పెరిగిపోయెరా.. నిరుద్యోగులు నిరాశ చెంది ఉరితాడెందుకు బిగించుకుండ్రు.. అమ్మలు..అక్కలు తల్లులు చెల్లెలు మానలెందుకు అమ్ముకున్నరు.. ఈ అవినీతికి మూలమేమిటో ఆలోచించరండో నాయన.. నూటికి డెబ్బై పైగా జనులు భూమిని నమ్మి బతుకుతున్నరు.. దున్నేవాడికి దుక్కేలేదు.. కూడు జనులకే కూడు లేదురా... రైతుదేశంలో రైతు బిడ్డకే భూమిలేదు ఎట్లో నాయన’ అంటూ మట్టి మనుషుల పక్షాన గొంతెత్తిన వాడు గద్దరన్న. 

దేశ సాంస్కృతిక ఉద్యమ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు

భారతదేశ సాంస్కృతిక ఉద్యమ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరుచుకొని పాటలంటే ఇలా ఉండాలి..ఇలా పాడాలి అనేటట్లు.. తన మాటకు తన పాటకు జతచేసి తన హావభావాలతో ప్రజలను ఆలోచింప చేసేవిధంగా తన కలం,  గళంతో  సాంస్కృతిక సైన్యాన్ని నడిపిన యోధుడు.  ‘అదిగదిగో అదిగో సూడు అమెరికోడొస్తుండూ’ అంటూ.. ‘కయ్యం పెట్టిందిరో కలర్ టీవి  ఇంట్లకొచ్చి దయ్యం పట్టిందిరో నాపెండ్లం పోరలకు’  అంటూ సామ్రాజ్యవాదంపై  వేసిన ఇనుపదారులను ప్రపంచీకరణతో విచ్చలవిడిగా సాగుతున్న విషసంస్కృతిని తన ఆటా పాటలతో ఎండగట్టాడు.  ప్రతి సందర్భాన్ని ఉద్యమతత్వాన్ని అవగాహన చేసుకుని ప్రజలకు అర్థమయ్యే రీతిలో పాటలు కట్టిపాడేవాడు.  

"నాసకింద మీసాకింద నిన్ను జైల్లో పెట్టినారు నీకు నాకు తేడాలేదన్నో.. ఓ పోలీసన్న " పోరుదప్ప దారీ లేదన్నో.. ఓ పోలీసన్న"... అంటూ పోలీసులను సైతం ఆలోచింపచేసే సాహసోపేత పాటలు పాడే ధైర్యంగలవాడు గద్దరన్న.  ‘పొట్టకూటి కోసం కొడుకు పోలీసొల్లా చేరినాడు..’ అంటూ కన్నతల్లి పేగుబంధాన్ని తన ఆర్ద్రతతో కండ్లకు కట్టాడు గద్దర్.  అమరులైన వీరులను తన సొంత బిడ్డల్లా ‘వందనాలమ్మో మాబిడ్డలు.. వందనాలమ్మో నాకూనలు’ అంటూ వాళ్ల విప్లవానికి ఊతమిచ్చాడు గద్దరన్న. 

తెలంగాణ ఉద్యమంలో గద్దరన్న కీలకపాత్ర

ఉమ్మడి రాష్ట్రంలో  తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ప్రత్యేక తెలంగాణ కోసం తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించాడు గద్దరన్న.  ‘పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా..పోరు తెలంగాణమా.. పోరు తెలంగాణమా...కోట్లాది ప్రాణమా..మా నీళ్లు మాకేనని మర్లబడ్డ గానమా..తిరగబడ్డ రాగమా..పోరు తెలంగాణమా.. కోట్లాది ప్రాణమా’ అంటూ తెలంగాణకు ఏది కావాలో సూటిగా చెప్పాడు గద్దరన్న. ఇలా వేలాది పాటలు రాసిన గద్దరన్న ప్రజాయుద్ధనౌకగా నిలిచాడు.  కళ ప్రజల కోసమని,  ప్రజలను చైతన్యపరచేదే నిజమైన కళ అని నమ్మి అదే బాటలో తుదిశ్వాస వరకు పయనించాడు గద్దరన్న.  

నూతన సమాజం కోసం తమ విలువైన జీవితాలను త్యాగం చేసిన పెరియార్ రామస్వామి, జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే,  బీఆర్ అంబేద్కర్ లాంటి మహనీయుల అడుగుజాడలో నడవాలని సూచించిన గద్దరన్న, పేద ప్రజలకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే పెద్ద దిక్కు అని స్పష్టం చేశాడు.  కానీ, నేడు రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా మనుధర్మ శాస్త్రాన్ని అమలుచేసే కుట్రలు పన్నుతున్నారు. దీనిని మన దళిత సమాజం బద్దలు కొట్టాలి.  నేడు ప్రజాయుద్ధనౌక తొలి వర్ధంతి.  ఈ సందర్భంగా  దళిత సమాజం ఏకమై ఒకే నినాదంగా నిలవాలి. అదే.. గద్దరన్నకు మనమిచ్చే నిజమైన నివాళి. జోహార్ గద్దరన్న జోహార్. 

- కందికట్ల నర్సింహ, సీనియర్​ జర్నలిస్ట్