కొర్రలతో రోగ నిరోధక శక్తి, నాడీ వ్యవస్థపై సానుకూల ప్రభావం

ఆధునిక కాలంలో ఆరోగ్యం విషయంలో శ్రద్ధ లేకుండా పోతోంది. దొరికింది తిని  పొట్ట  నింపుకుని ఆ తర్వాత వచ్చే  అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు నానాటికీ పెరుగుతున్నారు. తీరికలేని జీవితం ఉరుకుల పరుగులమయంగా ఉంటోంది. పురుగు మందు అవశేషాలు లేని ఉత్పత్తులు కనిపించే చోటు కోసం  కాగడా పెట్టి  వెతకాల్సి వస్తోంది. తినే తిండి గురించి కూడా పట్టుమని పది నిమిషాలు ఆలోచించలేని పరిస్థితుల్లో ఉన్నాం. అందుకే ఇన్ని అనారోగ్య లక్షణాలు చుట్టుముడుతున్నాయి. ఆస్పత్రుల చుట్టూ తిరిగి విలువైన కాలాన్ని వృథా చేసుకుంటున్న పరిస్థితులు ఎదురవుతున్నాయి.  

కొర్రలతో రోగనిరోధక శక్తి

పోషణ విషయానికి వస్తే మిల్లెట్స్ ఎప్పుడూ పైచేయి సాధిస్తూనే ఉంటాయి. దక్షిణ భారత రాష్ట్రాల్లో  విస్తృతంగా వినియోగించే  ఆరోగ్యకరమైన మిల్లెట్లలో  ఫాక్స్ టైల్ మిల్లెట్స్ ఒకటి.  కొర్రలు, అండు కొర్రలు అని వీటినే అంటారు.  రోగం ఏదైనా సరే  కొర్రలతో పరిష్కారం పొందవచ్చు. ప్రతి రోజు ఆహారంలో  కొర్రలను భాగంగా చేసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధకులు కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. జీర్ణశక్తి మెరుగవడం, అలెర్జీ వంటివి తగ్గడం సాధ్యపడుతుందని తేల్చారు. శరీరానికి ఇవి చాలా మంచిదని మాంసకృత్తులు, కాల్షియం, ఐరన్,  మాంగనీస్, మెగ్నీషియం,  తైమిన్,  రైబోఫ్లావిన్ సహా ఎక్కువ మొత్తంలో ఫైబర్ ఉంటుంది. వరి అన్నం బదులు కొర్రలు తింటే మేలు చాలా ఎక్కువ. కేవలం అన్నం వండుకోవడం మాత్రమే కాకుండా రకరకాల రూపాల్లో  తయారు చేసుకోవచ్చు.  జావ, రొట్టెలు, దోసెలు వేసుకుని కూడా తినవచ్చు.  

Also Read : చిరుధాన్యాలతో వృద్ధాప్యంలో మతిమరుపు తగ్గుముఖం

నాడీవ్యవస్థపై సానుకూల ప్రభావం

వరి బియ్యం వండుకున్నట్టే  కొర్రలతోనూ అన్నం తయారు చేసుకోవచ్చు. తేడా ఏమీ ఉండదు. తీపి, వగరు రుచితో ఉండే  కొర్రల్లో  యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చిన్న పిల్లలు, మహిళలు, గర్భిణులు కొర్రలు తింటే మేలు కలుగుతుంది. అంతేకాకుండా ఉదర సంబంధ వ్యాధులు ఉన్నవారు  తినగలిగితే  మంచి ఉపశమనం కలుగుతుంది. మూత్రంలో మంట ఉండదు. ఆకలి లేకపోవడం అంటూ ఉండదు. అతిసారం తగ్గుతుంది. అధిక బరువు కూడా తగ్గుతుంది.  హైదరాబాద్ నగరంలో సుమారు 21 శాతం మంది మధుమేహంతో బాధపడుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. వరి అన్నం బదులు కొర్రలు తింటే మంచిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొర్రల్లో 12.3 శాతం ప్రోటీన్లు ఉంటాయి. వరి అన్నం, గోధుమ పిండిలో కన్నా ఇది చాలా ఎక్కువ. విటమిన్ బి 1 అధికంగా ఉంటుంది. నాడీ వ్యవస్థ మీద సానుకూల ప్రభావం చూపే విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుత కాలంలో ఎక్కువ సేపు.. అంటే గంటల కొద్దీ ఒకేచోట కూర్చుని పని చేయాల్సి వస్తోంది.  వృద్ధులు ఏమీ చేయలేక కూర్చుని ఉంటుంటే  వర్క్ ఫ్రం హోం కింద కదలకుండా పని చేసుకునే వారి సంఖ్య బాగా పెరిగింది. వీరికి కాళ్లు, నడుము నొప్పి ఎటూ తప్పవు. అయితే కొర్రలు లేదా అండుకొర్రలను నిత్యం ఆహారంగా తీసుకుంటే నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

వృద్ధాప్యంలో అల్జీమర్స్ తగ్గుముఖం

దేశంలో  అధికశాతం  ఊబకాయంతో  బాధపడుతున్న వేళ ఆహారంలో  కార్బోహైడ్రేట్లను తగ్గించాలని డైటీషియన్లు చెబుతున్నారు. ఆహారంలో చిరుధాన్యాలను చేర్చడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందటమే కాకుండా  రోగ కారకాలు సైతం తొలగిపోతాయని చెబుతూ ఉంటారు.  ప్రపంచంలో  సజ్జల తర్వాత ఎక్కువగా సాగు అవుతూ ప్రజలు అత్యధికంగా తినే చిరుధాన్యాల్లో  కొర్రలది  రెండో స్థానంగా ఉంది.  వృద్ధాప్యంలో అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధుల తీవ్రతను తగ్గించే గుణం కొర్రలకు ఉంది. అలాగే ఎముకల  బలానికి  కొర్రలు లేదా అండుకొర్రల ఆహారం ఎంతో మంచిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాస్తవం చెప్పుకోవాలంటే  ప్రకృతి ప్రసాదించిన చిరు ధాన్యాలు ఆరోగ్యానికి సిరి ధాన్యాలు. 

గుండెకు ఆరోగ్యకరం

వరి బియ్యంలో  కార్బోహైడ్రేట్లు గ్రాముకు 78.2 శాతం ఉంటే  కొర్రల్లో 60.1 శాతం ఉంటాయి. ప్రొటీన్ల విషయానికి వస్తే వరి బియ్యంలో 7.9 ,  కొర్రల్లో 10.6 శాతంగానూ ఉంటాయి. అలాగే కాల్షియం,  థయామిన్, జింకు,  రిబోఫ్లావిన్,  నియాసిన్  కూడా  మిల్లిగ్రాముకు లెక్క వేసుకుంటే  కొర్రల్లోనే ఎక్కువగా ఉన్నట్టు తేలింది. కాల్షియం వరిబియ్యంలో  7.5 శాతం ఉంటే  కొర్రల్లో 31 శాతం ఉంది.  జింకు వరిలో 1.2 శాతం ఉంటే కొర్రల అన్నంలో 2.4 శాతంగా ఉంది.  ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ అధ్యయనం ప్రకారం కొర్రలను ఆంధ్రప్రదేశ్,  కర్నాటక, తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సహా దేశంలోని కొన్ని ఈశాన్య రాష్ట్రాల పరిధిలో పండిస్తారు. తృణ ధాన్యాల పంటల ఊకలో  లభించే  ప్రోటీన్ గుండెకు ఆరోగ్యకరమని తాజా అధ్యయనంలో తేలింది. గుండెను రక్షించే సమయంలో కండరాలు, నరాల మధ్య సందేశాలను బదిలీ చేయడానికి ఉపయోగపడుతుంది.  అగ్రికల్చరల్ అండ్  ఫుడ్  కెమిస్ట్రీ  జర్నల్ లో ప్రచురితమైన ఒక పరిశోధనలో ఈ విషయం స్పష్టంగా వెల్లడైంది.

- జి.యోగేశ్వర రావు,
  సీనియర్​ జర్నలిస్ట్​