మాజీ సైనికుల సంక్షేమంలో మార్పు ఎక్కడ?

జూన్ 2,  2014 నాడు ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ పదేండ్ల పాలనలో రాష్ట్ర ఏర్పాటు ఫలాలు నోచుకోని వారు  తెలంగాణ మాజీ సైనికులు. రాష్ట్రంలో సుమారు 38,000 మాజీ సైనికులు ఉన్నారు. గత ప్రభుత్వ పదేండ్ల పాలనలో లబ్ధి పొందినవారు గల్వాన్ లోయలో ప్రాణాలు కోల్పోయిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబం మాత్రమే. దేశ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్ర మాజీ సైనికుల సంక్షేమ నిధిని దేశంలో ఇతర రాష్ట్రమైన పంజాబ్ లో సైనికులకు కేసీఆర్ పంచడం జరిగింది. కానీ,తెలంగాణలో చనిపోయిన ఏ ఒక్క సైనికుడికి లేదు. యుద్ధక్షేత్రంలో చనిపోయి పరమవీర్ చక్ర, శౌర్య చక్ర లాంటి మెడల్స్ పొందినవారికి మాత్రం ఆర్థిక మద్దతు పెంచి దేశానికి సేవచేసి పదవీ విరమణ పొందినవారిని పట్టించుకున్న దాఖలాలు లేవు. 

అన్నిటా పొట్టకొట్టారు 

ధరణి పోర్టల్​తో లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు కొల్లగొట్టారు కానీ, మాజీ సైనికులకు 5 లేదా 2.5 ఎకరాల అసైన్డ్ భూమి ఇవ్వడానికి మాత్రం  గత ప్రభుత్వానికి చేతులు రాలేదు. రాజీవ్ స్వగృహ నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం నిర్మించే డబుల్ బెడ్ రూం ఇండ్లలో కూడా రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో ఒక్క మాజీ సైనికునికి ఇచ్చింది లేదు. 5 ఎకరాల అసైన్డ్ భూమి దేవుడెరుగు కనీసం ప్రభుత్వమే ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు 33 జిల్లాలు, సుడా, కుడా, హెచ్​ఎండీఏ పరిధిలో ప్రభుత్వమే అసైన్డ్ భూములలో ఏర్పాటు చేసిన లేఔట్లలో  కనీసం ప్రభుత్వ ధరతో 150 గజాల ప్లాట్ కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. బీఆర్​ఎస్​ పార్టీ రాష్ట్ర కార్యాలయాల నిర్మాణం కోసం 33 జిల్లాలలో ప్రభుత్వ భూములు గజానికి 100 రూపాయల చొప్పున పప్పు బెల్లాల్లాగా పంచి పెట్టారు. టీజీపీఎస్సీ ఉద్యోగ నియామకాలలో గ్రూప్ 3 & 4 లో ఉన్న 2% రిజర్వేషన్ గ్రూప్ 1 & 2 లో అమలు చేయకుండా క్వాలిఫై మార్కులు 40%కి పెంచి మాజీ సైనికుల ఉద్యోగాలపై జీవో నం. 55 ద్వారా మరణ శాసనం రాశారు. టానిక్​ లాంటి మద్యం దుకాణాలకు ట్యాక్స్ ఫ్రీ చేసి క్యాంటీన్​లో లభించే మద్యం సరుకులపై దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో లేని విధంగా ఎక్కువ రేట్లు పెంచి మాజీ సైనికుల పొట్ట కొట్టారు. 

సీఎం రేవంత్ రెడ్డి శ్రద్ధ చూపాలి

గత ప్రభుత్వ పదేండ్ల పాలనలో ఎలాంటి సంక్షేమానికి నోచుకోలేదని తెలంగాణ మాజీ సైనికులు వారి కుటుంబాలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మేని ఫెస్టోలో మాజీ సైనికుల సంక్షేమం కోసం ఆర్థిక మద్దతు ఉంటుందని ప్రకటించారు. కానీ, ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు. మాజీ సైనికుల సంక్షేమం హోం డిపార్ట్​మెంట్​ పరిధిలోకి వస్తుంది. ప్రస్తుత హోం మంత్రి కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డినే. ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు మాజీ సైనికుల సంక్షేమంపై ఎలాంటి సమీక్షలు చేపట్టలేదు. గత ప్రభుత్వం మాజీ సైనికుల సమస్యల పరిష్కారం కోసం ప్రస్తుత టీజీపీఎస్​సీ చైర్మన్ అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి  నేతృత్వంలో ఒక  సిక్స్ మెన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్స్ సర్వీస్​మెన్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పినా కాగితాలకే పరిమితం అయింది. మార్పు కావాలి - కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో సీఎం రేవంత్ రెడ్డి  నాయకత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వం ఇప్పటికైనా మాజీ సైనికుల సంక్షేమంపై శ్రద్ధ తీసుకోవాలి. జై జవాన్ - జై కిసాన్.

- బందెల సురేందర్ రెడ్డి, 
మాజీ సైనికుడు