ఇకనైనా సాధారణ బదిలీలు చేపట్టాలి

పెడతానంటే ఆశ, కొడతానంటే భయం అని నానుడి. సుదీర్ఘకాలంగా చేపట్టని సాధారణ బదిలీలను చేపట్టి ఉద్యోగుల ఇబ్బందులు తొలగిస్తామని..తమ ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇప్పటివరకూ సాధారణ బదిలీలను చేపట్టకపోవడంతో ఉద్యోగులలో నైరాశ్యం ఆవరిస్తున్నది. సాధారణంగా ప్రతి సంవత్సరం మే నెలలో జరగాల్సిన సాధారణ బదిలీలు గత పది సంవత్సరాలలో కేవలం ఒకసారి మాత్రమే అదీ 2018లో జరిగాయి. అప్పటి నుంచి సాధారణ బదిలీల కోసం కండ్లు కాయలు కాసేలా ఎదురుచూసినా ఫలితం లేదు.

ఎదురుచూస్తున్నవారికి నిరాశేనా?

మారుమూల  ప్రాంతాలలో  పనిచేస్తూ, కుటుంబాలకు దూరంగా ఉంటూ ఎన్నో కడగండ్లు దిగమింగుకొని, నూతన ప్రభుత్వం అయినా సాధారణ బదిలీలు చేపడుతుందని ఎంతో ఆశగా ఎదురుచూసిన వారికి నిరాశే ఎదురవుతున్నది. మొన్నటివరకు ఎన్నికల కోడ్ అడ్డంకిగా ఉందని అందరూ అనుకున్నారు. కానీ, ఎన్నికల కోడ్ ముగిసినా సాధారణ బదిలీలు చేపట్టడానికి ఉన్న ఇబ్బందులు,  అసలు ప్రభుత్వం మదిలో ఏముందో  తెలియడంలేదు.  ఒక్క  పాఠశాల విద్యాశాఖలో  అదీ పదోన్నతులు కోర్టు కేసులతో ముడిపడి ఉన్నందున తప్ప మిగతా శాఖల్లో బదిలీల ఊసే లేదు. సాధారణ బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ కాలేదు. 

ఒకవైపు పాఠశాలలు ప్రారంభం కావడం,  తమ పిల్లలను బడికి పంపాలా వద్దా,  పాఠశాల యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నందువల్ల  ఫీజులు కట్టాలా వద్దా,  పుస్తకాలు, యూనిఫాం కొనాలా వద్దా, అద్దె ఇంటి యజమానులకు ఈ సంవత్సరం కూడా అద్దె ఇంటిలో ఉంటామని చెప్పాలా వద్దా,  పనిచేసే కార్యాలయాలకు ఎలావెళ్ళాలి,  ఒకవేళ బదిలీలు ఉంటే ఎలా?  ఇవన్నీ వృథా అవుతాయా? అనే సందిగ్ధంలో  ప్రభుత్వ ఉద్యోగులు కొట్టుమిట్టాడుతున్నారు. ఉద్యోగులు  కార్యాలయాలలో  పనిమీద  ఏకాగ్రత చూపలేకపోతున్నారు.  బదిలీలు ఉంటాయా ఉండవా అనే ఆలోచనలతో ప్రతిరోజూ సతమతమవుతున్నారు.  ఇకనైనా  ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించాలి.  కేబినేట్ సమావేశం జరుగుతుందనే  నేపథ్యంలో  సాధారణ బదిలీల అంశంపై  ప్రభుత్వం చర్చించి స్పష్టమైన ప్రకటన చేయాలి. తక్షణమే బదిలీలపై నిషేధం ఎత్తివేసి,   కౌన్సెలింగ్  ద్వారా  సాధారణ బదిలీలను  చేపట్టి  సుమారు  రెండు లక్షలమంది  ప్రభుత్వ ఉద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చాలని ప్రభుత్వానికి మనవి.

- ఏ.వి. రమణ, 
హనుమకొండ