ఇవాళ(అక్టోబర్6) ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు

  • పార్టీలో చేరనున్న కసిరెడ్డి, రంగారెడ్డి డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ రాష్ట్ర రాజకీయాలు మళ్లీ ఢిల్లీకి మారనున్నాయి. పార్టీ నేతలు శుక్రవారం అక్కడికి వెళ్లనున్నారు. ఇటీవల బీఆర్ఎస్​కు రాజీనామా చేసిన కసిరెడ్డి నారాయణరెడ్డితో పాటు రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్​మనోహర్​రెడ్డి కాంగ్రెస్ చీఫ్ ఖర్గే సమక్షంలో పార్టీలో చేరనున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లేముందు పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి బెంగళూరుకు వెళ్లి డీకే శివకుమార్​తో భేటీ అయి, పార్టీలో చేరికలపై చర్చిస్తారని సమాచారం. 

ఈ చేరికలు అయ్యాక కూడా రాష్ట్ర ముఖ్య నేతలు ఢిల్లీలోనే ఉండనున్నట్టు తెలుస్తున్నది. ఈ నెల 8న స్క్రీనింగ్​ కమిటీ సమావేశం ఉండడంతో చేరికలు చూసుకుని, మీటింగ్​కు హాజరు కావాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఇక 9న మరోసారి ఢిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించనున్నారు. ఆ తర్వాతి రోజు పీసీసీ చీఫ్​లతో ఎక్స్​టెండెడ్​ మీటింగ్ ఉండే అవకాశం ఉంది. ఈ నెల11 లేదా 12న సెంట్రల్​ ఎలక్షన్​ కమిటీ మీటింగ్ నిర్వహించే చాన్స్ ఉందని తెలుస్తున్నది. 

ఈ మీటింగ్​లో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను పరిశీలించే చాన్స్​ ఉందని, ఆ తర్వాత పార్టీ లిస్ట్​ రిలీజ్ కావొచ్చని అంటున్నారు. దీంతో వారం పాటు నేతలంతా ఢిల్లీలోనే ఉంటారని సమాచారం.  

ALSO READ : ఓట్ల కోసం కాంగ్రెస్, బీజేపీ..దొంగ జపం చేస్తున్నయ్ : కేటీఆర్

నెలాఖరున రాష్ట్రానికి రాహుల్?

తెలంగాణపై కాంగ్రెస్ హైకమాండ్​మరింత ఫోకస్​ పెట్టింది. రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన పార్టీగా.. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉంది. అందులో భాగంగానే జాతీయ స్థాయి నేతలతో వరుసగా సభలు నిర్వహిస్తున్నారు. ఖర్గే నుంచి సోనియా వరకు లీడర్లు సభలు పెట్టి ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. రాహుల్​ గాంధీ ఇప్పటికే వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ లో పర్యటించగా.. ఖర్గే మంచిర్యాల, చేవెళ్ల, హైదరాబాద్​లో పర్యటించారు.

 సోనియా గాంధీ హైదరాబాద్ ​బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ నెలాఖరున రాహుల్​మరోసారి రాష్ట్రానికి రానున్నట్టు తెలిసింది. ఈ మేరకు పీసీసీ పెద్దలు రిక్వెస్ట్​ చేశారని, దానికి రాహుల్ అంగీకరించారని సమాచారం. అయితే ఆయన సభ ఎక్కడుంటుందన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు. మరోవైపు వచ్చే నెల ఫస్ట్​ వీక్​లో ప్రియాంకా గాంధీ కూడా రాష్ట్రానికి రానున్నట్టు సమాచారం. మహిళా డిక్లరేషన్​ను ఆమె ప్రకటిస్తారని తెలుస్తున్నది. 

బీసీ డిక్లరేషన్ సభ వాయిదా?

బీసీ డిక్లరేషన్ సభ మరోసారి వాయిదా పడేలా కనిపిస్తున్నది. ఈ నెల 10న నిర్వహిస్తామని కొద్ది రోజుల కింద ప్రకటించినప్పటికీ, ఇప్పుడు లేటయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది. కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఈ సభకు ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అయితే పీసీసీ ముఖ్య నేతలంతా ఆ టైమ్​లో ఢిల్లీలో ఉండే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలోనే బీసీ డిక్లరేషన్​సభ కొద్ది రోజులు వాయిదా పడే చాన్స్​ఉంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. మళ్లీ ఎప్పుడు పెట్టేది మాత్రం క్లారిటీ లేదు.