విద్యా ప్రమాణాలు పెరగాలంటే.. కేంద్ర నిధులూ అవసరం

తెలంగాణలో విద్యాసంస్థలు నాణ్యతా ప్రమాణాలు పెంచుకోవడానికి కేంద్ర ప్రభుత్వ ఆర్థికపరమైన ప్రోత్సాహం ఎంతో అవసరం.  కానీ,  గత  దశాబ్దకాలంలో  తెలంగాణ విద్యారంగ అభివృద్ధికి కేంద్ర బడ్జెట్ లో ప్రత్యేక నిధుల కేటాయింపు లేకపోవడంతో మౌలిక వసతుల కల్పన, నైపుణ్యశిక్షణ, నాణ్యమైన విద్య  నేలబారుగా మారింది.  నూతన విశ్వవిద్యాలయాలకు నిధుల కేటాయింపు లేక,  నవోదయ, సైనిక విద్యాలయాల స్థాపన జరగక ప్రభుత్వ పాఠశాల,  కళాశాలల్లో మౌలిక వసతులు, ఉపాధ్యాయుల కొరత తీరడంలేదు. నాణ్యమైన చదువు నేతి బీరకాయ చందంగా మారింది.    

విద్యారంగానికి కేంద్రం కేటాయింపులు పెంచాలి

కేంద్ర ప్రభుత్వం 2024–-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ ను  జులై 23న పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది.  2022–-23 ఆర్థిక సంవత్సరంలో  కేంద్ర బడ్జెట్​లో  విద్యారంగానికి 1,04,277. 72 కోట్లు  అలాగే 2023-–24 ఆర్థిక సంవత్సరంలో 1,12,899 కోట్లు కేటాయించింది.  ఈ ఏడాది  విద్యారంగానికి 1,25,638 కోట్లు కేటాయించింది.  వికసిత్ భారత్.. చట్టుబండలవుతున్న చదువులకు ఎలాంటి చికిత్స అందించలేదు. కొఠారి కమిషన్ నుంచి నూతన జాతీయ విద్యా విధానం-2020 వరకు ప్రతీది దేశ జీడీపీలో 6 శాతం విద్యారంగానికి కేటాయించాలని ప్రతిపాదించాయి. అయినా  అత్తెసరు నిధుల కేటాయింపులతో  విద్యారంగంపై నిర్లక్ష్యం చూపుతున్నారు.  పాఠశాల, కళాశాల విద్యలో మౌలిక వసతుల కల్పన కోసం, యూనివర్సిటీల అభివృద్ధి కోసం, పరిశోధనల సాంకేతికతకు, ఆన్​లైన్​ విద్యకు, ఉపాధ్యాయ విద్యకు కేటాయింపులు తగ్గినవి. 

నవోదయ సైనిక్ పాఠశాలల ఏర్పాటు ఎక్కడ? 

 జాతీయ విద్యా విధానం 1986 అమల్లో భాగంగా నవోదయ పాఠశాలలు దేశంలోని అన్ని జిల్లాల్లో ఏర్పడ్డాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన తర్వాత తెలంగాణలో పది జిల్లాలు 33 జిల్లాలుగా ఏర్పడ్డాయి.  ప్రస్తుతం  రంగారెడ్డి, కామారెడ్డి, ఆసిఫాబాద్, వరంగల్ , నాగర్ కర్నూల్, నల్గొండ, సిద్దిపేట, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో  నవోదయ విద్యాలయాలు ఉన్నాయి.  ఇంకా 23 జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు పంపినా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేయలేదు.  తెలంగాణలో 9 నవోదయ విద్యాలయాల పరిధిలో 69 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి.  ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సైనిక స్కూల్ కూడా లేదు. తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం 2017 మార్చి2 న ఆమోదం తెలిపినా ఇంతవరకు నిధులు కేటాయించకపోవడంతో ఏర్పాటు ప్రశ్నార్థకంగా మారింది. 

రాష్ట్ర విద్యారంగానికి కేంద్ర కేటాయింపులు ఏవి? 

ప్రపంచంలోనే అతిపెద్ద విద్యా వ్యవస్థ ఉన్న భారతదేశంలో ప్రస్తుతం 10 లక్షల ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి.  తెలంగాణ రాష్ట్రంలో  ప్రస్తుతం 25 వేల వరకు ఖాళీలు ఉన్నాయి.  నూతనంగా అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం 11 వేల పోస్టులను త్వరలో భర్తీ చేయనుంది. ఈ ఉపాధ్యాయుల  నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక భరోసా కల్పించలేకపోయింది. 

విభజన చట్టంలోని హామీ మేరకు ఈ బడ్జెట్ లోనూ  గిరిజన యూనివర్సిటీకి నిధుల కేటాయింపు చేయలేదు.  కరీంనగర్ జిల్లాలో ట్రిపుల్ ఐటీని,  హైదరాబాద్​లో  నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ డిజైన్​ను  నెలకొల్పడానికి నిధులు కేటాయించలేదు. దక్షిణాది  రాష్ట్రాలలో  తెలంగాణలో మాత్రమే ఇండియన్ ఇన్​స్టిట్యూట్​ఆఫ్ మేనేజ్​మెంట్​ ( IIM) విద్యా సంస్థ లేదు.  గత దశాబ్ద కాలంగా ఐఐఎం ఏర్పాటుకు నిధులు కేటాయించమని  కోరుతున్నా.. కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. ఇప్పటికైనా కేంద్రం  బడ్జెట్ తో సంబంధం లేకుండా విభజన హామీల మేరకు విద్యారంగానికి నిధులు కేటాయించాలి.

- అంకం నరేష్, పీఆర్టీయూ నేత, నిజామాబాద్ జిల్లా