బీఆర్​ఎస్​ను అభ్యర్థులూ తిరస్కరిస్తున్నరు!

ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులు తాము ఉన్న పార్టీ నుంచి అటు ఇటు మారుతుంటారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీల అభ్యర్థుల ఎంపికలను గమనిస్తే ఎవరు ఏ పార్టీలో ఉంటారో  స్పష్టంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. 'ఆయారాం గయారాం'లా అగుపిస్తోంది. తెలంగాణలో త్వరలో పార్లమెంటు ఎన్నికలు జరగనుండటంతో  టికెట్ల కోసం ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి ఫిరాయింపులు జోరందుకున్నాయి.

 రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ స్వయం కృతాపరాధంతో అధికారం కోల్పోయింది.  రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఈనేపథ్యంలో రాజకీయ పునరావాస కదలికలు( ఫిరాయింపులు) ఊపందుకున్నాయి. రాజకీయాలలో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరనేది నానుడి. ఈ దుస్థితి తెలంగాణలో కూడా కొనసాగుతోంది. హిందూత్వ సిద్ధాంతమే తమ పునాదిగా చెప్పుకునే బీజేపీ కూడా ఫిరాయించిన నేతలకే ప్రాధాన్యమిచ్చి టికెట్​ ఇస్తోంది. 

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్​కు బీ టీంగా లోపాయికారిగా పనిచేసిన బీఎస్పీ మాజీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరి నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేస్తున్నాడు. ఒక్కొక్క నాయకుడు అధికారం కోసం, పదవుల కోసం పార్టీలు ఫిరాయించి వారు చెప్పే చిలుక పలుకులు వింటే చిలుకలు సైతం సిగ్గుపడతాయి. ‘పవర్ పాలిటిక్స్’ చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టిన తరువాత రేవంత్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల ముందు చేపట్టిన ఎన్నికల స్ట్రాటజీ  నిశ్శబ్దంగా అమలవుతున్నట్లు తెలుస్తోంది.

10 సంవత్సరాల కేసీఆర్​ పాలన వైఫల్యాలపై,  నియంతృత్వ పాలనపై  గత ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోవడంపై  రేవంత్​ కేసీఆర్​పై  ధ్వజమెత్తారు. ముఖ్యంగా లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని రాష్ట్ర ప్రజల ముందు పెట్టారు. ఈ విషయంలో  కేసీఆర్ ఇమేజ్  బాగా దెబ్బతిన్నది. అంతకంటే తీవ్రంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసీఆర్ కుటుంబాన్ని ప్రజాబోనులో నిలబెట్టింది. బీఆర్ఎస్ నాయకులు ఒక్కొక్కరుగా కాంగ్రెస్, బీజేపీ  వైపు మరలిపోతున్నారు. మున్సిపాలిటీలలోనూ నాయకులు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్​లో చేరటం జరుగుతున్నది.  ప్రస్తుత పరిస్థితులలో తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ నిస్తేజంగా మారారు.

సీఎం రేవంత్ మార్క్​

64 మంది ఎమ్మెల్యేల స్వల్ప మెజార్టీతో  రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం..  ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వంద రోజులలోనే ఇచ్చిన ఆరు వాగ్దానాలు అమలుకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం,  రూ.500 కే గ్యాస్ సిలిండరు అందించడం,  గృహ వినియోగాలకు 200 యూనిట్ల కరెంటును ఉచితంగా అందించటం, ఇందిరమ్మ గృహాల స్కీమ్​కింద నియోజకవర్గానికి 3,500 గృహాలకు మొదటి ఫేజ్ లో  రూ.5 లక్షలు నిర్ణయించటం, అందుకు అర్హులైన వారిని ఎంపిక చేయటం జరుగుతున్నది.

 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన మార్క్ చూపెట్టి  ప్రజల మన్ననలు పొందేందుకు నిరంతరం పోరాడుతున్నారు.  కాంగ్రెస్  ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడదని అధికార దాహంతో బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు చౌకబారు విమర్శలు చేస్తున్నారు. దీనికి బదులుగా 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని మేము గేట్లు తెరిస్తే బీఆర్​ఎస్​ పార్టీ ఖాళీ అవుతుందని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

బీఆర్ఎస్  పార్టీ  నాయకుల విమర్శలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి.  బీజేపీ కూడా మోదీ నాయకత్వంలో తిరిగి మూడోసారి అధికారంలో రాబోతున్నామని ఆపరేషన్​ ఆకర్ష్​ చేపట్టింది.  ఈడీ, సీబీఐను ఉపయోగిస్తూ ఇతర పార్టీల నాయకులను ప్రలోభాలకు గురిచేస్తోంది. దీనితో  కాంగ్రెస్ కూడా గేట్లు తెరవక తప్పలేదు.

బీఆర్ఎస్​ స్వయంకృతాపరాధం

తెలంగాణలో జరుగుతున్న దాన్ని తప్పు పట్టడానికి ఏముంది? ఆనాడు ఫిరాయింపులను ప్రోత్సహించకపోతే బీఆర్ఎస్​కు ఈ గతి పట్టేది కాదు. 2014లో టీడీపీని, 2018లో కాంగ్రెస్ ను  బీఆర్ఎస్ విలీనం చేసుకున్నందుకు తగిన ఫలితం అనుభవిస్తోంది. ప్రజలు ఇచ్చిన తీర్పునకు కట్టుబడి ఉండకుండా రేవంత్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రను పసిగట్టి,  ప్యూహంలో భాగంగానే రాజకీయ పునరేకీకరణ జరుగుతున్నదని స్పష్టంగా అర్థమవుతున్నది.  

కేసీఆర్ ఆనాడు ప్రతిపక్ష పార్టీలైన  కాంగ్రెస్, టీడీపీ, బీఎస్పీ, సీపీఐ నుంచి ఎన్నికైన శాసన సభ్యులను ఫిరాయింపులకు ప్రోత్సహించి 35 మంది శాసనసభ్యులను  బీఆర్ఎస్ లో  చేర్చుకోవడం జరిగింది.  నేడు కాంగ్రెస్ కూడా గతంలో బీఆర్ఎస్ చేసిన పద్ధతిలోనే కాంగ్రెస్ లో  చేర్చుకుంటోంది.  దేశంలో అధికారం ఎటువైపు ఉందో అటువైపు ప్రయాణించటం రాజకీయ నాయకుల లక్షణం.

 పార్టీలు ఫిరాయించడం, ఏ ఎండకాగొడుగు పట్టడం నాయకుల మరో లక్షణం. ప్రస్తుతం రాజకీయ పార్టీలు సిద్ధాంతాల ప్రాతిపదికగా నడుస్తున్నాయని ఎవరైనా అనుకుంటే పొరపాటే.  సిద్ధాంతాలు పాటించే పార్టీలు తక్కువైనాయి.138 ఏండ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ కూడా ప్రస్తుత రాజకీయ ధోరణిని అనుసరించక తప్పడం లేదు. కాగా, రాజకీయ స్థిరత్వం కోసం కేసీఆర్ చేసిన తప్పులను  రేవంత్ రెడ్డి చేయకుండా ఉండాలని,  రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను  ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు కృషి చేస్తూ, నీతివంతమైన ప్రజా పాలన అందించాలని  ప్రజలు కోరుకుంటున్నారు.

ప్రజా వ్యతిరేకతను గమనించి..

వరంగల్ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం శ్రీహరి కూతురు డా. కావ్యను ప్రకటించిన వారం రోజుల తర్వాత  ఆమె నియోజకవర్గంలో పర్యటించి తన నిర్ణయాన్ని మార్చుకుంది. ప్రజల మనోభావాలు,  బీఆర్ఎస్​ వ్యతిరేక వాతావరణం తెలుసుకొని  గులాబీ పార్టీ నుంచి పోటీ చేయలేనని స్వయానా కేసీఆర్​కు రాజీనామా లెటర్ పంపింది.

ALSO READ ; ఎన్నికలు ఫ్రీగా జరుగుతున్నా.. ఫెయిర్​గా జరగడంలేదు

ఆమె రాసిన లెటర్​లో కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్​ కేసులో ఇరికి జైల్లో ఉన్నదని, ఇంకోవైపు బీఆర్ఎస్​ నాయకుల అవినీతి, అక్రమాలు,  ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడంతో బీఆర్ఎస్ పైన ప్రజల్లో వ్యతిరేకత ఉన్నదని పేర్కొంది.  ప్రస్తుత పరిస్థితుల్లో పోటీ చేయలేనని చెబుతూ ఓపెన్​గా  కేసీఆర్​కు  లెటర్​ రాసింది.  బీఆర్ఎస్​కు  రాజీనామా చేసి ఆమె తన తండ్రి కడియం శ్రీహరితో కలిసి కాంగ్రెస్​లో చేరి వరంగల్ నుంచి పోటీ చేయటానికి టికెట్ పొందింది.

కేసీఆర్​ బేఖాతర్​

బీఆర్ఎస్ టికెట్ కావాలని పడిగాపులు పడిన గులాబీ నాయకులు పార్లమెంటు ఎన్నికలు వచ్చేసరికి  కేసీఆర్​ను బేఖాతర్​  చేసి బీఆర్ఎస్​ అభ్యర్థిత్వం వద్దని వెళ్ళిపోతున్న వైనం ఆశ్చర్యం కలిగిస్తోంది. 2019లో  బీఆర్ఎస్ నుంచి గెలిచిన 9మంది ఎంపీల్లో నలుగురు పార్టీ మారి బీజేపీలో చేరారు. ఆ నలుగురు బీజేపీ టికెట్లు పొందారు. చేవెళ్ల నుంచి గతంలో ఎంపీగా  పనిచేసిన రంజిత్ రెడ్డికి తిరిగి కేసీఆర్ టికెట్ ఇవ్వగా.. బీఆర్ఎస్ నుంచి పోటీ చేయలేనని కాంగ్రెస్​లో  చేరి తిరిగి అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.  

పది సంవత్సరాలుగా బీఆర్ఎస్  పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కే కేశవరావు,  జీహెచ్ఎంసీ మేయర్ గా ఉన్న  ఆయన కుమార్తె విజయలక్ష్మి కాంగ్రెస్​లో చేరారు.  ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందిన దానం నాగేందర్  కాంగ్రెస్​లో  చేరి సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు.

ఉజ్జిని రత్నాకర్ రావు, సీపీఐ సీనియర్​నేత