బీసీ మహిళలు పాలనకు పనికిరారా?

యత్ర నార్యస్తు పూజ్యంతే-..రమంతే తత్ర దేవతాః!  ఎక్కడ  స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు అని మన ఆర్యోక్తి. స్త్రీని దేవతగా పూజించే సంస్కృతి కేవలం మన హైందవ సంప్రదాయంలోనే ఉన్నది. 

కాశ్మీర్​లో లలితాంబగా,  కన్యాకుమారిలో  కాత్యాయిని అమ్మవారుగా,  అస్సాంలో  కామాఖ్య దేవతగా,  గుజరాత్​లో  అంబాజీ మాతగా  దేశంలోని  వివిధ ప్రాంతాలలో వివిధ శక్తి రూపాలలో  స్త్రీని పూజిస్తాం. కానీ, కాలక్రమేణా ‘నస్త్రీ స్వాతంత్ర్య మర్హతే’ అనే మనుధర్మ సూక్తి వాడుకలోకి రావడంతో స్త్రీ  వంటింటికి, పిల్లలను కని పెంచడానికి,  పతి సేవకే పరిమితమైనది.  

కాలక్రమమైన అనేక దురాచారాలు ముఖ్యంగా సతీసహగమనం, బాల్యవివాహాలు, వితంతువులకు పెండ్లి నిరాకరణ,  నిరక్షరాస్యత,  బహు భార్యత్వం,  ఆస్తిలో హక్కు లేకపోవడం వంటివి వచ్చి స్త్రీల జీవితాలు దుర్భరం చేశాయి.  పాశ్చాత్య  విద్య పుణ్యమా అని సమానత్వం, మానవత్వం, మహిళా హక్కులు, సాధికారత, లౌకికవాదం,  సామాజిక న్యాయం అనే భావనలు వ్యాప్తిలోకి వచ్చి వారి జీవితాలలో  కొంతవరకు వెలుగులు నింపాయి.

భారతీయ సమాజంలో  కరుడు గట్టిన కులవ్యవస్థ అసమానతలను ఎదిరించడం జరిగింది. స్వాతాంత్ర్యనంతరం అనేక చట్టాలు తీసుకొని వచ్చి మహిళల జీవితాలలో స్వేచ్ఛ, స్వాంత్రత్యాలు, సమానత్వం, సమాన అవకాశాలు కల్పించడం జరిగింది. రాజ్యాంగంలో కూడా సమానహక్కులు, అవకాశాలు కల్పించడం జరిగింది. 

నామమాత్రంగా చట్టసభలలోమహిళల ప్రాతినిధ్యం

ధీర తెలంగాణలో మొదటి నుంచి వీరవనితలు ప్రధాన పాత్రలు పోషించారు. అనేక ఉద్యమ పోరాటాలలో ముందుండి  కదన రంగంలో  పోరాడారు. రాణి రుద్రమదేవి, సమ్మక్క సారక్కలు అందుకు ఉదాహరణలు. అలాగే నిజాంకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటంలో వీరనారి చాకలి ఐలమ్మ, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం వంటి మహిళలు ముందుండి పోరాడారు.  

తెలంగాణ తొలిదశ, మలిదశ పోరాటాలలో, మావోయిస్టు ఉద్యమాలలో ఎందరో అసువులు బాశారు. తెలంగాణ సాంస్కృతిక పండుగలు అయిన బతుకమ్మ, సమ్మక్క సారక్క జాతర మహిళా సాధికారికతతో  కూడుకొని ఉన్నవి. కాగా, తెలంగాణలో  సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 18.48 లక్షలకుటుంబాలకు మహిళలే  కుటుంబ పెద్దలు.  63లక్షల మహిళలు స్వయం సహాయక సంఘాలలో సభ్యులు.  

గత సంవత్సరం రూ.18,000 కోట్ల బ్యాంకు రుణాలు పొందారు.  ఇప్పటివరకు  లక్ష కోట్లు బ్యాంకు రుణాలు పొందారు.  ఇందులో 60 %  బీసీ మహిళలే.  ఇంత చారిత్రక నేపథ్యం,  ఆర్థికపట్టు, నాయకత్వ లక్షణాలు, సోషల్ కాపిటల్ ఉన్నప్పటికీ చట్టసభలలో మహిళల ప్రాతినిధ్యం నామమాత్రమే. అందులో బీసీ మహిళల పాత్ర మరీ దయనీయం. 

 గత 16 సార్లు జరిగిన మన శాసనసభ ఎన్నికలలో  మొత్తం 95 మంది మహిళలు అసెంబ్లీలో అడుగుపెడితే బీసీ మహిళలు కేవలం నలుగురు మాత్రమే ఉండగా,  మొత్తంగా ఎనిమిదిసార్లు అడుగుపెట్టడం జరిగింది.

చట్టసభల్లో ఓబీసీ మహిళలకు రిజర్వేషన్ లేకపోవడం అన్యాయం

స్థానిక సంస్థలలో పంచాయతీరాజ్ చట్టం  1994 ద్వారా 33% రిజర్వేషన్ మహిళలకు అమలవుతోంది. మహిళల రాజకీయ భాగస్వామ్యం పెంచడానికి కేంద్రం 106వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోక్ సభ, శాసనసభలలో 33% రిజర్వేషన్ కల్పించినది.  ఇది ముదావహం. అందులో ఎస్సీ, ఎస్టీ మహిళలకు వారి కోటాలో సబ్ కోటా 33% ఉంటుంది.  మిగతా జనరల్ కోటాలో ఉంటుంది.

 ఈ జనరల్ కోటాలో  బీసీ మహిళలకు సబ్ కోటా లేకపోవడం వలన  బీసీ మహిళలు ఉపయోగించుకునే అవకాశాలు చాలా తక్కువ.  ఈ కారణం చేత కేవలం అగ్రవర్ణ మహిళలే ఉపయోగించుకునే అవకాశం ఉంది.  మహిళలకు రిజర్వేషన్ విషయంపై గతంలో లాలూ ప్రసాద్ యాదవ్,  ములాయం సింగ్ యాదవ్,  శరద్ యాదవ్  ఓబీసీ మహిళలకు సబ్ కోటా లేకపోవటం వలన మహిళా రిజర్వేషన్ల బిల్లును వ్యతిరేకించారు. 

నిజానికి, 1996లో ప్రధాన మంత్రిగా ఉన్న దేవగౌడ మహిళా బిల్లును ప్రవేశ పెట్టి గీతాముఖర్జీ కమిటీని వేయగా ఆ కమిటీ రిపోర్టు ఇవ్వడం జరిగింది. కానీ, ఆ తర్వాత కాలంలో ఆ బిల్లు ఆమోదం పొందకపోవడంతో వీగిపోయింది. ఈ మహిళా రిజర్వేషన్లు 2027లో నియోజకవర్గాల పునర్విభజన చేసి 2029 నుంచి అమలు చేయాలని కేంద్రం పట్టుదలతో ఉంది.

 కానీ, ఓబీసీ మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ లేకపోవడం వలన నామమాత్రంగా ఉన్న ఓబీసీలు లోక్​సభ,  శాసన సభ సభల్లో ఇంకా తగ్గుతారు.  దేశంలో ఓబీసీలకు మరోసారి తీరని అన్యాయం జరగబోతుంది.

చట్టసభల్లో రిజర్వేషన్స్​కోసం ఓబీసీలు ఉద్యమించాలి

ఓబీసీ మహిళా సాధికారత,  ఓబీసీ మహిళల రాజకీయ భాగస్వామ్యం లేకపోతే  సమ సమాజం, పేదరిక నిర్మూలన సాధ్యం కాదు.  జనాభాలో  ఓబీసీ మహిళలు 26%  ఉన్నారు.  వారికి చట్టసభలలో స్థానం లేకపోతే  మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారటం అసాధ్యం.  కొంతమంది మహిళలు స్థానిక సంస్ధలలో  రిజర్వేషన్స్ పుణ్యమా అని జిల్లా పరిషత్​ చైర్​పర్సన్స్ గా  పని చేశారు.  

కానీ, కేవలం బీసీలనే  నెపంతో ఎలక్షన్స్ లో ఎమ్మెల్యే లేదా ఎంపీ సీట్స్ ఇవ్వటం లేదు.  ముస్లిం దేశాలైన పాకిస్తాన్,  బంగ్లాదేశ్ లలో వారి  చట్టసభలలో మహిళల ప్రాతినిధ్యం 20 శాతం ఉంది.  కానీ, భారతదేశంలోని లోక్​సభలో 542 మందిలో  కేవలం 78 మంది మహిళలు ఉన్నారు అంటే 14.6%మాత్రమే.  జెండర్ ఈక్వాలిటీ ఇండెక్స్ 193 దేశాలలో భారత్ ప్రపంచంలో 108 స్థానంలో ఉంది.  

ఈ సామాజిక వ్యవస్థలో అట్టడుగు వర్గాల మహిళలకు రాజ్యాధికారం లేకపోతే అది అనేక పరిణామాలకు దారితీస్తుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిచి ఓబీసీలకు అదేవిధంగా ఓబీసీ మహిళలకూ రిజర్వేషన్లు కల్పించాలి .  కాంగ్రెస్​పార్టీ 2024లోని తన మేనిఫెస్టో లోని  పంచ్ న్యాయ్​లో ఓబీసీలకు. ఓబీసీ మహిళలకు  చట్టసభలలో రిజర్వేషన్స్ ప్రకటించలేదు.  

ఓబీసీ సంఘాలు, సివిల్ సొసైటీ సంస్థలూ రిజర్వేషన్స్​ కోసం పోరాడాలి.  ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి.  జాతీయ ఉద్యమాలు నడపాలి.  ఓబీసీ  వ్యతిరేక పార్టీలకు  మన బలమేమిటో చూపించకపోతే ఓబీసీలు ఈ దేశంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉండాల్సిందే. కాగా,  సోదరి మణి మంజరి ఆధ్వర్యంలో బీసీ మహిళా సంక్షేమ సంఘం ఈమధ్య కాలంలో  ఓబీసీ మహిళలకు చట్టసభలలో 1/3 వంతు రిజర్వేషన్స్ కల్పించాలని ఒక సదస్సు నిర్వహించడం హర్షణీయం. 

నేటివరకు అసెంబ్లీలో బీసీ మహిళలు

1. సంగెం లక్ష్మీబాయి యాదవ బాన్సువాడ 1952 INC.  2.  కె. ఆనందాదేవి ముదిరాజ్ 1962 CPI. 
3. మూసాపేట కమలమ్మ యాదవ్, నకిరేకల్, 1972 INC.  4.  కొండా సురేఖ పద్మశాలి INC  1989, 1994, 2009, 2014, 2023. కాగా, మధ్యంతర ఎన్నికలలో మరో ముగ్గురు బీసీ మహిళలు శాసనసభలో అడుగుపెట్టారు. 1)  గడ్డం సుశీల దేవి రాజారాం (బాల్కొండ) 2) శ్రీమతి కొమిరెడ్డి జ్యోతి, (మెట్ పల్లి)  3) ఆకుల లలిత (నిజామాబాద్ రూరల్). ఈ ముగ్గురు మున్నూరు కాపు కులానికి చెందినవారే. 

మొత్తం 95 మందిలో 54 మంది ఓసీ మహిళలు,16 మంది ఎస్సీ మహిళలు, 13మంది ఎస్టీ మహిళలు,  8మంది బీసీ మహిళలు, నలుగురు మైనారిటీ మహిళలు ఇప్పటివరకు శాసనసభకు ఎన్నికయ్యారు. కానీ,  52 శాతం జనాభా ఉన్న బీసీలు..అందులో సగభాగం  మహిళలు ఉండగా కేవలం నలుగురు మాత్రమే ఎనిమిదిసార్లు అసెంబ్లీలో అడుగుపెట్టారు. 

మెజార్టీ జనాభా కలిగిన కులాలైన గౌడ,  కురుమ కులాల నుంచి ఒక్క మహిళ కూడా  నేటివరకు అసెంబ్లీలోకి అడుగు పెట్టలేదు. అదేవిధంగా లోక్​సభలో 12 మంది మహిళా సభ్యులు 20 సార్లు అడుగుపెట్టగా అందులో బీసీ మహిళ సంగెం లక్ష్మీబాయి యాదవ్​ ఒక్కరే.  విజయశాంతి ఓబీసీ అని నిర్ధారణ కాలేదు. అలాగే రాజ్యసభలో గుండు సుధారాణి ఒక్కరే.

-టి.చిరంజీవులు, ఐఎఎస్​(రిటైర్డ్)