మనీలాండరింగ్​ కేసుల్లో బెయిల్ దుర్లభం

మనీలాండరింగ్​ నిరోధక చట్టం చాలా కఠినమైనది. ఈ చట్టంలో ఉన్న సెక్షన్లు వ్యక్తిగత స్వేచ్ఛని, శాసన సంబంధమైన ప్రొసీజర్స్​ని, రాజ్యాంగ అభయం ఇచ్చిన చాలా ఆర్టికల్స్​ని ఉల్లంఘిస్తున్నాయని సవాల్​ చేస్తూ సుప్రీంకోర్టులో 240 దరఖాస్తులు గతంలో  దాఖలైనాయి. ఈ చట్టంలో సవరణలు ద్వారా వచ్చిన మార్పులను చాలామంది సవాల్​ చేశారు. దరఖాస్తుదారులు తమ దరఖాస్తుల్లో  లేవనెత్తిన అంశాల్లో  ప్రధానంగా ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​కి హద్దుల్లేని అధికారాలు ఇచ్చారని, బెయిల్​ పొందడం దుస్సాధ్యంగా ఉన్నాయని, నేర నిరూపణ భారం ప్రాసిక్యూషన్​ మీద కాకుండా ముద్దాయిపై ఉన్నాయని పేర్కొన్నారు. 

ఈ అంశాల్లో వాస్తవం ఉన్నప్పటికీ సుప్రీంకోర్టులోని  ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్​ అన్నింటినీ తోసిపుచ్చింది. ఈ కేసు పేరు విజయ్​ మదన్​లాల్​ చౌదరి వర్సెస్​ యూనియన్​ ఆఫ్​ ఇండియా. తీర్పు వెలువడిన తేది జులై 2022.  తీర్పునిచ్చిన న్యాయమూర్తులు జస్టిస్​ ఖన్విల్కర్​, దినేష్​ మహేశ్వరి, సీటీ రవికుమార్. ఈ తీర్పు మీద చాలామంది న్యాయమూర్తులు అభ్యంతరాలను వెలిబుచ్చారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్​ బి లోకూర్​ ఈ తీర్పుని తీవ్రంగా విమర్శించారు. ఈ తీర్పును వెలువరించిన న్యాయమూర్తి ఖన్విల్కర్​ను భారత ప్రభుత్వం ఇటీవల  10 మార్చి 2024న లోక్​పాల్​గా నియమించింది. 

ఈడీ డాక్యుమెంట్ సీఐఆర్​

ఈ చట్టం ప్రకారం నేరం కావాలంటే మరో నేరం జరిగి ఉండాలి. మనీలాండరింగ్​ ప్రకారం నేరం ఉండదు. ఒక నేరం జరిగిన ఫలితంగా ఏర్పడిన పరిస్థితి ఈ చట్టప్రకారం నేరం అవుతోంది. సులువుగా అర్థం అయ్యేవిధంగా చెప్పాలంటే.. నేరం చేయడం వల్ల వచ్చిన నల్లధనాన్ని తెల్లధనంగా మార్చడాన్ని మనీలాండరింగ్​ నేరంగా గుర్తిస్తోంది. భారతీయ శిక్షాస్మృతి ప్రకారం జరిగిన నేరాలకు సంబంధించిన ప్రొసీజర్​ క్రిమినల్​  ప్రొసీజర్​ ప్రకారమే ఉంటుంది. రివర్స్ బర్డెన్​ ఉండదు. నేర నిరూపణ భారం ప్రాసిక్యూషన్​  పైనే ఉంటుంది.

ముద్దాయి తనను తాను నేరంలో ఇరికించుకునే అవకాశం ఉండదు. కేసు నమోదు అయినప్పుడు ఎఫ్ఐఆర్​ పొందే హక్కు కలిగి ఉంటాడు. మనీలాండరింగ్​ చట్టం విషయానికి వస్తే ఇప్పుడు ఈ హక్కులు ఏమీ ఉండవు. చట్టం ఈ హక్కులను తొలగించింది. ఈ విధంగా తొలగించడం రాజ్యాంగ అభయం ఇచ్చిన ఆర్టికల్స్​14, 20లకు ఇవి విరుద్ధమని దరఖాస్తుదారులు సుప్రీంకోర్టులో వాదించారు. మామూలు నేరం జరిగినప్పుడు పోలీసులు ఎఫ్​ఐఆర్​ను విడుదల చేస్తారు. దాని ప్రతిని ముద్దాయి పొందే హక్కు కలిగి ఉంటాడు.

మనీలాండరింగ్​ చట్టం ప్రకారం నేరం జరిగితే ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు ఈ సీఐఆర్​ను విడుదల చేస్తారు. అది ఎఫ్ఐఆర్​ లాంటిది. అందులో ముద్దాయిపేరు ఉందో  లేదో తెలియదు. అది తమ అంతర్గత డాక్యుమెంట్​ అని ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు సుప్రీంకోర్టు ముందు వాదించారు. సుప్రీంకోర్టు ఆ విషయాన్ని తమ తీర్పులో బలపరిచింది. పోలీసులు దర్యాప్తు పూర్తి అయిన తరువాత కోర్టులో చార్జ్​షీట్స్ దాఖలు చేస్తారు. ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు ఫిర్యాదుని కోర్టులో దాఖలు చేస్తారు. అది మాత్రమే పబ్లిక్​ డాక్యుమెంట్​అవుతుంది. 

ముద్దాయిపై రుజువు చేసుకోవాల్సిన  బాధ్యత

 భారతీయ శిక్షాస్మృతి ప్రకారమో, మరో చట్ట ప్రకారమో జరిగిన నేరం వల్ల వచ్చిన డబ్బులు కాదని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత ముద్దాయిపై ఉంటుంది. ఈ చట్టంలోని సెక్షన్​ 4 ప్రకారం నేరం నిరూపణ అయిన వ్యక్తులందరికీ ఒకే రకమైన శిక్ష ఉంటుంది. ఆ ముద్దాయి ప్రధాన ముద్దాయి కాకపోవచ్చు. నేరాన్ని ప్రోత్సహించిన వ్యక్తి కావొచ్చు. కుట్రలో భాగస్వామి కావొచ్చు.

ఎవరి స్థాయి ఎమిటి అన్న విషయంలో సంబంధం లేకుండా, నేరంలో వాళ్ల పాత్ర ఏమిటి అన్న విషయంతో సంబంధం లేకుండా, నేరంలో వాళ్ల పాత్ర ఏమిటి అన్న విషయంతో సంబంధం లేకుండా అందరికీ ఒకే శిక్షని విధించే అవకాశం ఉంది. ఇది రాజ్యాంగంలో సమానత్వ హక్కు (ఆర్టికల్​ 14)కి భంగం కలిగిస్తుందని దరఖాస్తుదారులు సుప్రీంకోర్టు ముందు వాదించారు. అయితే, సుప్రీంకోర్టు ఈ వాదనలను అంగీకరించలేదు. ఏకీభవించలేదు. మనీలాండరింగ్​ చట్టంలోని అన్ని నిబంధనలను సుప్రీంకోర్టు ఆమోదించింది.

ఆ విధంగా ఆమోదించడానికి సుప్రీంకోర్టు పేర్కొన్న ప్రధాన కారణం.. శాసనకర్తల ఉద్దేశ్యం.  దీన్ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది.  ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న ఈ నేరాలను అరికట్టాలని పార్లమెంట్ ఈ చట్టాన్ని తెచ్చిందని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఈ చట్టం రాజ్యాంగబద్ధమే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ముద్దాయిని ఎందుకు పిలిచారో అతనికి తెలియదు. ఎందుకు అరెస్టు చేశారో తెలియదు.  ప్రమాణ పూర్వకంగా స్టేట్​మెంట్​పై ఎందుకు సంతకం చేయాలో తెలియదు. 

ఈడీకి ఎవరినైనా విచారించే అధికారం

ఎవరినైనా ఈడీ అధికారులు సమన్​చేసి పిలవడానికి అధికారం ఉంది. సాక్షి అనిగాని, ముద్దాయి అనిగాని ఆ వ్యక్తికి తెలియదు. ఈ చట్టంలోని సెక్షన్​ 50(బి) ప్రకారం అతను అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈడీ అధికారులను జ్యడీషియల్​ ఫోరంగా చట్టం గుర్తిస్తుంది. తాను ముద్దాయినో  కాదో  తెలియకుండానే అతను జవాబు చెప్పాల్సి వస్తుంది.

జవాబులు చెప్పకపోతే నేరం అవుతుంది. ఆ జవాబులు వల్ల స్వీయ నేరారోపణని అంగీకరించే ప్రమాదం ఉంది. రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులకు ఇది భంగం కలిగిస్తోంది.  ఇక బెయిల్​ విషయానికి వస్తే ఈ చట్ట ప్రకారం నేరారోపణని ఎదుర్కొంటున్న వ్యక్తులకు బెయిల్​ అంత సులువుగా దొరకదు. దుస్సాధ్యమనే చెప్పవచ్చు. పబ్లిక్​ ప్రాసిక్యూటర్​  బెయిల్ దరఖాస్తుని వ్యతిరేకించినప్పుడు, ప్రాథమిక దృష్టితో చూసినప్పుడు ముద్దాయి నేరం చేయలేదని భావించినప్పుడు మాత్రమే బెయిల్​ మంజూరు అవుతుంది.

ఇలాంటి నిబంధనలు చట్టంలో ఉండటం వల్ల బెయిల్​ పొందడమనేది దుర్లభంగా మారింది. ఇక రివర్స్​ బర్డెన్​ ఆఫ్​ ప్రూఫ్​ అంటే ముద్దాయి తన అమాయకత్వాన్ని రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ చట్టంలోని సెక్షన్​ 3 ప్రకారం నేరం చేసిన ముద్దాయి తన సొమ్ము కళంకిత సొమ్ము కాదని రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ వ్యక్తి పేరుమీద ఉన్న ఆస్తులు కూడా కళంకిత సొమ్ముతో కొన్నవి కాదని రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. నేరం చేయలేదని, తాను అమాయకుడినని రుజువు చేసుకోవాల్సిన భారం ముద్దాయిపైనే ఉంటుంది. 

చట్టంలో నిబంధనలు రాజ్యాంగబద్ధం

సీఐఆర్​లో ఏమి రాసి ఉందో అంతకంటే తెలియదు. ఇవేమీ తెలియకుండా ఆ వ్యక్తి తాను అమాయకుడిని అని రుజువు చేసుకోవాల్సి ఉంటుంది.  బెయిల్​ కోసం దరఖాస్తు చేసినప్పుడు ఇది రుజువు చేసుకోవడం సాధ్యం కాదు. అందుకే ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా జైల్లో ఉండిపోవాల్సి వస్తోంది. అదేవిధంగా ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్​ జైల్లోనే ఉండిపోయాడు. ఎవరైనా అంతే.  ‘శాసనకర్తలు ఉద్దేశ్యం’ అని చెబుతూ సుప్రీంకోర్టు ఈ చట్టంలోని అన్ని నిబంధనలు రాజ్యాంగబద్ధం అని తేల్చివేసింది.

 విజయ్​ మదన్​లాల్​ చౌదరి  కేసుని పున:పరిశీలించాలని సుప్రీంకోర్టు ముందు రివ్యూ దరఖాస్తులు దాఖలయ్యాయి. అవి సుప్రీంకోర్టు ఎప్పుడు పరిష్కరిస్తుందో తెలియదు. విజయ్​ మదన్​లాల్​ కేసు రాజ్యాంగబద్ధం కాదని చాలామంది న్యాయమూర్తులు అభిప్రాయపడుతున్నారు. కానీ, సుప్రీంకోర్టు రివ్యూ పరిష్కారం అయ్యేవరకు ఏమీ ఫలితం లేదు.  క్రిమినల్​ ప్రొసీజర్​ కోడ్​లోని సెక్షన్​ 436–ఎ  ప్రకారం ఎవరైనా ముద్దాయి దర్యాప్తు సమయంలో జైల్లో ఆ శిక్షకు సగంకాలం ఉంటే అతను బెయిల్​ పొందడానికి అవకాశం ఉంది.

మరణశిక్ష విధించే అవకాశం ఉన్న నేరానికి ఈ నిబంధన వర్తించదు. ఈ నిబంధన ప్రకారం యాంత్రికంగా ముద్దాయిలను విడుదల చేయకూడదని మనీష్ సిసోడియా కేసులో అభిప్రాయపడింది. ఇలాంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఓ కేసులో అన్నట్లు బెయిల్​ అనేది మినహాయింపు. జైల్లో ఉండడం అనేది నియమం. ఇదే విషయం అందరినీ కలవరపెడుతోంది. వేచిచూడటం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. 

డా. మంగారి రాజేందర్, జిల్లా జడ్జి (రిటైర్డ్​)