బతుకు పోరాటంగా బహుజన బతుకమ్మ

తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో భాగంగా 2010లో మొదలైన బహుజన బతుకమ్మ ‘పార్లమెంట్‌‌ బిల్లు– ప్రజా వనరుల సంరక్షణ’ అనే జంట లక్ష్యాలతో 2014 వరకు పని చేసింది. అలాగే నవధాన్య సాంస్కృతిక పునాదులపై ఆధారపడి స్వరాష్ట్రంలో నవ తెలంగాణ నిర్మాణ లక్ష్యంగా పనిచేస్తోంది. ఈ దశాబ్దన్నర కాలంలో మూడు పుస్తకాలను ముద్రించి, వందల పాటలను-రూపకాలను రూపొందించి లక్షలాది కరపత్రాలను ప్రచురించి ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యం చేస్తోంది. ఈసారి స్త్రీలపై సాగుతున్న అత్యాచారాలను, హత్యాకాండను ఖండిస్తూ బహుజన బతుకమ్మను బతుకు పోరాటంగా జరుపుకుందామని ప్రజలకు పిలుపునిచ్చింది. ‘సేవ్​ ఉమెన్​– సేవ్​ నేచర్’ అంటూ చాటుతోంది.  

బతుకు అమ్మ అంటే స్వేచ్ఛగా, గౌరవంగా బతకడం

బతుకు అమ్మ అంటే రాజ్యాంగంలోని 21వ అధికరణ ప్రకారం స్వేచ్ఛగా, గౌరవంగా బతకడం అంటూ స్త్రీలుజీవించే హక్కును బతుకమ్మతో మిళితం చేస్తున్నది.  ప్రతిరోజూ సంసార సాగరాన్ని ఈదుతూ,  వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తిలో భాగమవుతూ, విద్యా-, వైజ్ఞానిక రంగాల్లో, సేవా వృత్తుల్లో రాణిస్తుంది కూడా స్త్రీలే. పునరుత్పత్తికి ఆద్యులై,  ప్రసవ వేదనలో మరణం అంచుదాకపోయి కొత్తతరానికి వెలుగునిస్తున్నది  మహిళలే. 

అంతేకాదు నవజాత శిశువులను సాది,  విద్యాబుద్ధులు నేర్పించే మాతృమూర్తులు ఆడవాళ్లే.  ఆంక్షల సంకెళ్లు దాటి.. స్త్రీవిముక్తే కాదు, సమాజ విముక్తి పోరాటంలో మొక్కవోని ధైర్యసాహసాలు ప్రదర్శించిన వీరనారీమణులు ఐలమ్మ, కొదురుపాక రాజమ్మలు కూడా మహిళలే. అందుకే ఇలాంటి త్యాగధనుల కృషిని బతుకమ్మను తెలంగాణ పంటల పండుగగా బహుజన బతుకమ్మ చాటి చెబుతున్నది.  

ప్రజల భాగస్వామ్యంతోనే..నదీవనరులు, పర్యావరణ పరిరక్షణ

తంగేడు వనం మూలస్థానం నల్లమల అడవని తేలింది. తలపైన కంకి గలిగిన మొక్కజొన్న కర్రతో ఊరేగడం, అవి తినడానికి వస్తున్న పాలపిట్టను దసరా నాడు దర్శించుకునే పరంపర ఇప్పటికీ మాసిపోలేదు.  తంగేడు పువ్వును రాష్ట్ర పువ్వుగా,  పాలపిట్టను రాష్ట్ర పక్షిగా, బతుకమ్మను  రాష్ట్ర పండుగగా ప్రకటించుకున్న మనం వీటి రక్షణకు తీసుకుంటున్న చర్యలేమిటో పరిశీలించుకోవాలి.  

బహుళ పంటలు, జీవవైవిధ్యం, ప్రకృతి సేద్యం, పాడి-పంట, చెరువులు-, కుంటలు, చేన్లు-, చెలుకలు, గుట్టలు, -చెట్లు మన జీవితంలో నుండి పరాయీకరించడమే విధ్వంస నమూనాగా వచ్చింది. స్వావలంబన వ్యవసాయం పరాధీనమైంది.  కాంగ్రెస్‌‌ పాలకులు తమది ప్రజాబతుకమ్మగా ప్రకటించుకుంటున్న సమయంలో సహజ వనరుల సంరక్షణ.. -చెరువులు, కుంటల రక్షణ ఉద్యమంలో ప్రజలను భాగం చేయాలి.  

ప్రజల భాగస్వామ్యంతోనే చెరువులు, -కుంటల రక్షణ, పర్యావరణ పరిరక్షణ సాధ్యమని ప్రకటిద్దాం. ఇప్పటికీ స్త్రీలు సమాన పనికి సమాన వేతనంగానీ, చట్టసభల్లో రిజర్వేషన్లుగానీ, వారసత్వ హక్కుగానీ పొందలేకపోతున్నారు. ఈ సమయాల్లో జార్జి టౌన్‌‌  ఇన్​స్టిట్యూట్‌‌ 2023 సంవత్సరానికి 177 దేశాల్లో చేసిన తన పరిశోధనలో భారత మహిళల పరిస్థితి 128వ స్థానంలోఉందని స్పష్టం చేసింది. మహిళల భద్రత, న్యాయంలాంటి అంశాల్లో ఒకటితో గణిస్తే మన స్థానం 0.592 గా ఉందని పేర్కొంది.

పంటలకు పూలతో స్వాగతం

పంటలకు మూలమైన మట్టిని బొడ్డెమ్మలుగా చేసి, పూలతో అలంకరించే సౌందర్యాత్మక దృష్టి  బాల్యం నుంచే ఆడపిల్లలకు అభ్యాసమవుతుంది. ఆ తర్వాత ఆ మట్టి నుంచి పండిన పంటలకు పూలతో స్వాగతమిచ్చి, నవధాన్యాలకు చిహ్నంగా 9 రోజులు ఊరువాడల్లో బతుకమ్మలు ఆడి-పాడి నీళ్లలో నిమజ్జనం చేస్తారు.  తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పిండితో చేసిన తినుబండారాలను ఇచ్చిపుచ్చుకునే మహిళలు చివరిరోజును సద్దుల బతుకమ్మగా పిలుస్తారు.

  పూల కవాతుగా.. స్త్రీల కవాతుగా కదలి రావాలి

ప్రతిరోజు స్త్రీలపై అత్యాచార ఘటనలు మామూలైపోయాయి. ఏదో ఒక పెద్ద సంఘటన జరిగినప్పుడు ప్రజాగ్రహం వెల్లువ  వచ్చి పాలపొంగులా చల్లారిపోతున్నది. స్థిరమైన ప్రతిఘటనగా మహిళా ఉద్యమం పెరగకుండా మొక్కుబడిగా జరిపే కార్యక్రమాలతో వీటిని అరికట్టలేం. అందుకే బహుజన బతకమ్మ ‘గుండెలు బాదుకోకమ్మ-– గుత్పలందుకోవమ్మా’ అంటూ మహిళా లోకానికి పిలుపునిస్తోంది.

గడిచిన15 సంవత్సరాలుగా దాదాపు 150 గ్రామాల్లో/పట్టణాల్లో బహుజన బతుకమ్మ నిర్వహించిన కేంద్రాలతో పాటు,  చైతన్యమైన సమాజం ఆ దిశగా ముందుకు రావాలని కోరుతున్నాం. అందుకే బహుజన బతుకమ్మ కేవలం ఉత్సవమే కాదని, ఉద్యమం అని ప్రకటిస్తున్నాం.

అక్టోబర్‌‌ రెండున జనగాం జిల్లా మంచుప్పలతో మొదలై  దసరా తర్వాత జగిత్యాల జిల్లా భీమారం గ్రామంలో అక్టోబర్‌‌ 13న బహుజన బతుకమ్మ కార్యక్రమం ముగు స్తుంది.  అత్యాచారాల నుంచి ఆత్మరక్షణకు, - విధ్వంసం నుంచి ప్రకృతి పరిరక్షణకు ‘పూల కవాతుగా– - స్త్రీల కవాతుగా’ కదలి రావాలని పిలుపునిస్తున్నాం.

 

- అరుణోదయ విమలక్క,బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీ