మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న గ్రామాలు, పట్టణాల్లో గాజుల పండుగ చేసుకుంటారు. ఇప్పుడు నిర్మల్ జిల్లాలోనూ ఈ పండుగ మొదలైంది.
పుష్యమాసంలో గాజుల పండుగ మొదలవుతుంది. అప్పుడు పెళైన మరదలిని పుట్టింటికి పిలిచి, గాజులు తొడిగి, ఆశీర్వదిస్తుంది వదిన. అలాగే మరదలు కూడా వదినకి గాజులు తొడిగి, నాలుగు మంచి మాటలు చెప్తుంది. ఈ పండుగ కోసం వంద నుంచి వెయ్యి రూపాయల వరకు ఖర్చు పెట్టి గాజులు కొంటారు. కొందరు వదినలు మరదలిపై వాళ్లకున్న ప్రేమను తెలియజేయడానికి మరో అడుగు ముందుకేసి.. మరదళ్లకు గాజులతోపాటు చీరెలు లేదా గిఫ్ట్ లు ఇస్తుంటారు.
వదిన, మరదళ్ల మధ్య ఏవో మాటల వల్ల వచ్చే పొరపొచ్చాలు, అపార్థాలు కూడా ఈ పండుగనాడు కలవడం వల్ల పోయే అవకాశం ఉంది. అందుకే కుటుంబాల్లో కలతలు తొలగించి, సంతోషాన్ని నింపే పండుగ అని కూడా అంటారు.
నిజానికి ఇది మహారాష్ట్ర పండుగ అయినా, ఇప్పుడు తెలంగాణలోని నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో కూడా చేసుకుంటున్నారు. ఈ వేడుక ఒక్క రోజు, వారం రోజుల్లో అయిపోయేది కాదు. సుమారు రెండు నెలలు జరుగుతుంది. జనవరిలో మొదలై... ఇప్పటికే నెల పూర్తైంది. ఇంకా నెల రోజులు ఈ గాజుల పండుగ చేసుకుంటారు.