11 ఊళ్లకు తీరిన రవాణా తిప్పలు

  • ఇచ్చిన మాట ప్రకారం బస్సు వేయించిన ఎమ్మెల్యే వివేక్​
  • బస్సు రాకతో ప్రజల ఆనందం

కోటపల్లి, వెలుగు: ఏండ్లుగా బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న 11 గ్రామాల ప్రజలకు విముక్తి లభించింది. ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి చొరవతో మారుమూల గ్రామాల్లో బస్సు తిరుగుతోంది. చెన్నూర్ నుంచి వెంచపల్లి వరకు బస్సు సౌకర్యం లేక పలు గ్రామాల ప్రజలు కొన్నేండ్లుగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని ఇటీవల కాంగ్రెస్ నాయకులు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని కలిసి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

చెన్నూర్ నుంచి వెంచపల్లి వరకు బస్సు సౌకర్యం కల్పిస్తే 11 గ్రామాలైన పారుపల్లి, లింగన్న పేట, ఏదుల బంధం, సిర్సా, రొయ్యలపల్లి, ఆలుగామ, జనగామ, సూపక, నంద్రంపల్లి, వెంచపల్లి గ్రామాల ప్రజల రవాణాకు ఇబ్బందులు తొలగుతాయని పేర్కొన్నారు. స్పందించిన ఎమ్మెల్యే.. ఆ రూట్​కు బస్సు సౌకర్యం కల్పించడంతో బుధవారం నుంచి బస్సు తిరుగుతోంది. దీంతో ఆ గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా జనగామ మాజీ సర్పంచ్ గట్టు లక్ష్మణ్ గౌడ్, ఆలుగామ మాజీ సర్పంచ్ కుమ్మరి సంతోష్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ఇచ్చిన మాట నెరవేర్చారని కొనియాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని.. ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లగానే బస్సు సౌకర్యం కల్పించారని హర్షం వ్యక్తం చేస్తున్నారు.